ఆర్టీసీ సమ్మెపై చర్చలు విఫలం: సమ్మె కొనసాగింపు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గం ఉపసంఘం చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రివర్గం ఉపసంఘం ఎటువంటి ముందడుగు వేయకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మరో మూడు వారాల గడువు ఇవ్వాలని ఉపసంఘం కోరడంతో అందుకు కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. ఎట్టిపరిస్థితిల్లోనూ తాము సమయం ఇవ్వలేమని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెప్పారు.
ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో యనుమల రామకృష్ణుడు, శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, ఎండీ సాంబశివరావులు పాల్గొన్నారు. ఆర్టీసీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. 43 శాతం ఫిట్ మెంట్ తో సంస్థపై అదనపు భారం పడుతుందని పాత పంథానే కొనసాగించడం కాస్తా చర్చలు విఫలం కావడానికి దారి తీసింది. దీంతో కార్మిక సంఘాలు తమ సమ్మెను యథావిధిగా కొనసాగించడానికి సన్నద్ధమైయ్యాయి.
గత ఐదు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా.. అవి ఫలించని సంగతి తెలిసిందే. మరోపక్క తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు భీష్మించుకున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా.. అటు విద్యార్థులకు ఎంట్రెన్స్ టెస్ట్ లు ఉండటం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.