రోడ్లపై ఉమ్మి వేస్తారేమో...జాగ్రత్త!
- సర్కారుకు సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల పరిధిలో రోడ్లపై ఉమ్మి వేసే వారిపై జరిమానా విధించాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. పురపాలికల్లో పారిశుద్ధ్య పరిస్థితులు దుర్భరంగా మారడంతో అవి చెత్తకు కేంద్రాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తమకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించాలని మునిసిపల్ కమిషనర్లు ఇటీవల జరిగిన మేయర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో పరిశీలనకు వచ్చిన అంశాలపై అధ్యయనం కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమై.. వచ్చే మూడు నెలల్లో చేపట్టాల్సిన స్వల్పకాలిక ప్రణాళికలు, ప్రభుత్వానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించింది. పారిశుద్ధ్య నిర్వహణపై సమాలోచనలు జరిపింది. సింగపూర్ స్ఫూర్తిగా మునిసిపల్ కమిషనర్లకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించాలని, కాలుష్య కారకులకు జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అయితే పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించిన తర్వాతే ఈ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.