Govt lands sale
-
ప్రభుత్వ భూముల అమ్మకం ఆపేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకం ఆపేయాలని, ఉచితాల పేరుతో అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని సర్కార్‌కు సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు ఉచితాల రూపంలో ఇచ్చేస్తుందని, దీంతో ప్రభుత్వం అప్పుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 1923 ఫ్లాట్లు, 18.05 ఎకరాల భూమి వేలం కోసం ఈనెల 11న నోటిఫికేషన్ ఇచ్చిందని లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కోసం సరిపోయే స్థలం కావాలని ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరకు భూములు కొనుగోలు చేస్తుంటే మరో దిక్కు ఉన్న భూములను అమ్మాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. మున్ముందు పట్టణ పరిసరాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు, శ్మశాన వాటికలు, ఉద్యానవనాలకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భూములు అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఉన్న కొద్దిపాటి భూములను అమ్మేస్తే భవిష్యత్తుల్లో భూములను ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని లేఖలో కోరారు. -
భూముల మార్కెట్ ధరలు పెంచుదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని, తొలుత హెచ్ఎండీఏ పరిధిలో పెంపును వర్తింపజేయాలని, ఆర్థిక వన రుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసం ఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ప్రస్తు తం అమల్లో ఉన్న మార్కెట్ ధరలను ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలా కాలం కిందట ఖరారు చేశారని, ప్రస్తుత వాస్తవ మార్కెట్ ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడం తో రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.15 వేల కోట్లను సమీకరించాలనే నిర్ణయానికి ఉప సంఘం వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భూముల ధరలు పెంచాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం అధిక ధరలకే రిజిస్ట్రేషన్లు కరోనా సమయంలో భూముల మార్కెట్ ధరలను పెంచితే.. భూకొనుగోళ్లపై ప్రభావం పడి ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గే అవకాశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువ కన్నా అధిక ధరతోనే హెచ్ఎండీఏ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న అంశాన్ని అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలు అడ్డంకిగా మారినట్టుగా వ్యాపార, వాణిజ్యవర్గాల్లో అభిప్రాయం ఉందని కూడా వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదించారు. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ పరిధిలోని భూముల విక్రయాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. నగరం చుట్టుపక్కల ఉన్న 64 ఎకరాల భూములను విక్రయించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌కు వచ్చే స్పందన ఆధారంగా తదుపరి భూముల అమ్మకాలకు సంబంధంచిన ధరల పెంపుపై ఒక నిర్ణయానికి రావాలని, ఆ తరువాత ముఖ్యమంత్రికి దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల పెంపుతో ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అవకాశాన్ని కూడా ఉపసంఘం పరిశీలించింది. అయితే ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు మద్యం ధరలు పెంచినందున ఇప్పుడే మళ్లీ పెంచడం సరికాదని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ వి.శేషాద్రి కూడా పాల్గొన్నారు. భారం పెరిగింది.. రెవెన్యూ పెరగాలి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యకమాలు అమలు చేస్తున్నందున వీటి కొనసాగింపు కోసం నిధుల సమీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ఉపసంఘం అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు నిధులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపే పరిస్థితి లేనందున ఆర్థిక వనరుల సమీకరణకు కొత్త మార్గాల అన్వేషణ ఒక్కటే మార్గమని భావించింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.11 వేల కోట్ల అదనపు భారం పడటం, కొత్తగా 50 వేల ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఉపసంఘం చర్చించినట్లు సమాచారం. -
పీఎస్‌యూల ఆస్తుల విక్రయానికి ఈ–ప్లాట్ఫార్మ్..!
ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూల)లకు కీలకం కాని, నిరుపయోగంగా ఉన్న భూములు, ఆస్తుల విక్రయానికి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల నగదీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద మిగులుగా ఉన్న భూములు, ఆస్తులను కేంద్రం విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆస్తులకు సంబంధించి కొన్నింటికి న్యాయ వివాదాలు ఉండటం, ఇతరత్రా కారణాల వల్ల ఈ ఆస్తుల విక్రయం ఆశించినంతగా ఉండటం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి, సత్వరంగా ఆస్తులను విక్రయించడానికి ఆన్లైన్–ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేయడమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలనేది కేంద్రం ఆలోచన. ఈ–ప్లాట్ఫార్మ్పై బడ్జెట్లో ప్రకటన! పీఎస్‌యూలకు సంబంధించి కీలకం కాని ఆస్తులను విక్రయించడానికి ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ను రూపొందించాలని కేంద్రం ఇటీవలనే ప్రభుత్వ రంగ సంస్థ, ఎమ్ఎస్టీసీని ఆదేశించిందని సమాచారం. పీఎస్‌యూల భూములు, ఆస్తులకు సంబంధించి ఈ ప్లాట్ఫార్మ్.. వన్–స్టాప్ షాప్‌గా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్లాట్ఫార్మ్ ఏర్పాటుకు కనీసం నెల రోజులు పడుతుందని, దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఉండే అవకాశాలున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాట్ఫార్మ్కు దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) సమన్వయ సహకారాలనందిస్తుంది. వ్యూహాత్మక వాటా విక్రయానికి ఉద్దేశించిన పీఎస్‌యూల ఆస్తులను తొలుతగా ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా విక్రయించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే కొన్ని ఆస్తులను గుర్తించారు. బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్, బీఈఎమ్ఎల్ తదితర సంస్థల ఆస్తులు దీంట్లో ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఉత్తమం.... కీలకం కాని, వృ«థాగా ఉన్న పీఎస్‌యూల భూములను, ఆస్తులను విక్రయించాలని గత కొన్నేళ్లుగా పీఎస్యూలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. న్యాయ సంబంధిత వివాదాలు, ఇతరత్రా కారణాల వల్ల పీఎస్‌యూలు ఈ ఆస్తుల విక్రయంలో విఫలమవుతున్నాయి. ఈ వ్యవహారం ఒకడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు.. అన్న చందంగా తయారైంది. ఇలాంటి ఆస్తుల విక్రయానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఈ ప్లాట్ఫార్మ్ ఎలా పనిచేస్తుందంటే.. ► ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ ఏర్పాటు చేస్తారు ► విక్రయించే పీఎస్‌యూల భూములు, ఆస్తులను ఈ ప్లాట్ఫార్మ్పై నమోదు చేస్తారు ► ఎమ్‌ఎస్‌టీసీ, దీపమ్ల పర్యవేక్షణ ఉంటుంది ► రూ.100 కోట్లకు మించిన ఆస్తులనే అమ్మకానికి పెడతారు. ► వేలంలో పాల్గొనే సంస్థలు ఎమ్‌ఎస్‌టీసీ వద్ద నమోదు చేసుకోవాలి ► అసెట్ వేల్యూయార్చే ఆస్తుల విలువ నిర్ధారిస్తారు ► ఆస్తుల కొనుగోళ్లకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తారు ► ఈ–వేలం నిర్వహిస్తారు ► వేలం అనంతర ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు -
భూముల అమ్మకం తప్ప స్వైన్‌ఫ్లూను పట్టించుకోరా?
* సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి ప్రశ్న * అడిగిన వెంటనే కేంద్రం స్పందించింది: కేంద్రమంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, రోజుకో కొత్త హామీ ఇచ్చి, పాత హామీలను అమలుచేయకుండా రాష్ర్ట ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సమెంటును అమలు చేయడంలేదని అన్నారు. ప్రభుత్వానికి పాలనపై పట్టులేదన్నారు. భూములను అమ్మాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టడం లేదన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి, నిపుణుల బృందాన్ని పంపిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం రూపొందించిన డైరీని కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. పార్టీ మేధావుల సంఘం చైర్మన్ దినేశ్‌రెడ్డి, పార్టీ కార్యాలయ ఇన్చార్జి పరమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.