ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
♦ అందుకు ఫెసిలిటేషన్ కౌన్సిల్, ‘హెల్త్ క్లినిక్’: కేటీఆర్
♦ పరిశోధనలు, ఆవిష్కరణల కోసం ‘రిచ్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరుతో రూ.100 కోట్లతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు కేంద్ర మంత్రితో చర్చించాం. సిరూపర్ పేపర్, ఏపీ రెయాన్స్ వంటి సంస్థల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు.
ఆయా శాఖల పద్దులపై విపక్షాల ప్రశ్నలకు గురువారం సభలో ఆయన సమాధానమిచ్చారు. మైనారిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేందుకు త్వరలో టీఎస్–ప్రైమ్ విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. ‘‘రాష్ట్రంలో 30 కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల దాకా ఉన్నా అవి విద్యాపరమైన సంస్థలుగానే మిగిలి పోయాయి. ఈ నేపథ్యంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, కొత్త పారిశ్రామికీకరణ, సంపద సృష్టి, ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం రిచ్ అనే కొత్త విధానం తేనుంది’’ అని ప్రకటించారు. పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. జిల్లాల వారీగా వనరులను గుర్తించి, అందుకు తగ్గట్లు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు.
‘‘వెనకబడిన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీ ఇస్తాం. హైదరాబాద్‌లో ఉన్న 1,140 పై చిలుకు కాలుష్యకారక పరిశ్రమలను కాలుష్యరహిత ఏర్పాట్లతో దశలవారీగా శివార్లకు తరలిస్తాం. వాటి కార్మికులకు నివాస సదుపాయం కల్పిస్తాం. గతంలో పరిశ్రమలకు విచ్చలవిడిగా భూ కేటాయింపులు చేశారు. మేం అవసరాల మేరకే కేటాయిస్తున్నాం. పరిశ్రమలు ఏర్పాటు చేయనందుకు 790 ఎకరాలను వెనక్కు తీసుకున్నాం. రామగుండంలో ఆటో పార్కును శనివారం 25న సీఎం ప్రారంభిస్తారు. మిర్యాలగూడలో మరో పార్కు వస్తుంది. బెజ్జంకిలో గ్రైనైడ్ క్లస్టర్ రానుంది.
చేనేత పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రూ.1,200 కోట్ల కేటాయింపుల్లో రూ.400 కోట్లు చేనేత కోసమే ప్రత్యేకించాం. బతుకమ్మ, దసరా పండుగలకు పేదలకు చేనేత వస్త్రాల పంపిణీకి రూ.160 కోట్లు కేటాయించాం. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును ఏప్రిల్లో సీఎం ప్రారంభిస్తారు. వచ్చే సమావేశాల నాటికి అసెంబ్లీలో సభ్యుల డెస్కుల ముందు సభా వ్యవహారాలు తిలకించేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం’’ అని కేటీఆర్ చెప్పారు.