హోమియో కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. గత పదేళ్ల నుంచి నేను దీర్ఘకాలిక జలుబు, తుమ్ములతో బాధపడుతున్నాను. గత ఏడాది జూన్ నుంచి ఇదే పరిస్థితి. ప్రతిరోజూ ఇదే సమస్య. దీనికి హోమియోపతి వైద్య విధానంలో చికిత్స ఉందా? – సునీల్ కుమార్, నల్లగొండ
అలర్జీ అనే పదం మనం రోజూ వింటూనే ఉంటాం. మన ఆధునిక జీవన విధానం, పారిశ్రామిక ప్రాంతాలు, పెద్ద పట్టణాల్లోని వాతావరణ కాలుష్యం అంశాలు ఈ అలర్జీకి ముఖ్య కారణాలు. అలర్జీ అంటే మన శరీరంలోని రోగ నియంత్రణ శక్తి కనబరిచే ఒక అసందర్భ ప్రతిచర్య. అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆడ, మగ అందరూ అలర్జీతో బాధపడుతున్నారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో అలర్జిక్ రైనైటిస్ అంటారు. విపరీతమైన తుమ్ములు, ముక్కులు బిగుసుకుపోవడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
అలర్జీకి సంబంధించిన ప్రేరేపణలు ఎదురైనప్పుడు శరీరం యాంటీబాడీస్‌ను తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీస్ మన ముక్కులో మాస్ట్ కణాలకు అతుక్కుని ఉంటాయి. ఏదైనా సరిపడని వస్తువు తిన్నా, తగిలినా ఆ మాస్ట్ కణాలు హిస్టమిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. ఆస్తమా రోగుల్లో దాదాపు 80 శాతం మందిలో అలర్జీ ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. డస్ట్ అలర్జీ ఉన్నవారికి తుమ్ములు ఎక్కువగా వస్తాయి. డస్ట్ అలర్జీ ఉన్న వ్యక్తి శరీరంలోకి దుమ్ము ధూళి ప్రవేశించడానికి ప్రయత్నించగానే విపరీతంగా తుమ్ములు, కళ్లలో దురద, ముక్కు వెంట నీరు కారడం, దగ్గు, ముక్కులు బిగుసుకుపోవడం, ఆయాసం, పిల్లికూతలు వస్తాయి. కొందరిలో గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా ఉంటుంది. గురక, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవడం కూడా కనిపించవచ్చు.
కారణాలు : ∙మనం తినే ఆహారంలో, తాగే పదార్థాలలో, పీల్చే గాలిలో ఉండే అలర్జీ కారకాలు అలర్జీని కలిగిస్తాయి ∙పొగ, ఆల్కహాల్, హెయిర్ డై, కొన్ని రకాల నొప్పి తగ్గించే మందులు అలర్జీ ప్రేరకాలుగా పనిచేస్తాయి ∙డస్ట్‌మైట్ అనేవి డస్ట్ అలర్జీకి ప్రధాన కారణం ∙కొందరిలో బొద్దింకల వల్ల కూడా అలర్జీ వస్తుంది ∙చెట్లు, గడ్డి, కొన్ని రకాల పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి కూడా డస్ట్ అలర్జీకి కారణమవుతుంది. జంతువుల జుట్టు, పక్షుల ఈకల వల్ల కూడా అలర్జీ బారిన పడతారు.
వ్యాధి నిర్ధారణ : సీబీపీ, సీటీ స్కాన్, ఎక్స్–రే
చికిత్స : డస్ట్ అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధిని ఎదుర్కొనేలా చేయవచ్చు. పోతోస్ ఫోటిడస్, నేట్రమ్ సల్ఫరికమ్ మొదలైన మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్
సర్జరీ తర్వాత మింగలేకపోతున్నాను...!
ఇఎన్‌టి కౌన్సెలింగ్
నాకు ఇటీవలే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. మాట్లాడబోతుంటే గాలిలాగా వస్తోంది. తినేప్పుడు, తాగేప్పుడు, మిగడంలో ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. దీనికి తగిన పరిష్కారం సూచించండి. – దక్షిణామూర్తి, విజయవాడ
మీకు స్వరపేటికలోని ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్‌హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, మెడ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్ ఫోల్డ్’పై ఒత్తిడి పడటానికీ లేదా అవి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వోకల్‌ఫోల్డ్ పెరాలసిస్ వచ్చేందుకూ అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి ముందుగా మీరు నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక స్పీచ్‌థెరపిస్ట్‌ను సంప్రదించి మింగడంలోని ఇబ్బందులు తొలగిపోవడానికీ, గొంతురావడానికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లను తెలుసుకుని వాటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
నేను ఇంజనీరింగ్ విద్యార్థిని. నా సమస్య ఏమిటంటే నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. నాకు నత్తిలా వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. మా అమ్మకు కూడా ఈ సమస్య ఉంది. నా చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది. ఉద్యోగం గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా బాధపడుతున్నాను. ఎవరితో మాట్లాడలేకపోతున్నాను. నేనేం చేయాలో తెలియజేయగలరు. – శ్రీనివాస్, నెల్లూరు
మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్య కారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.
డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్
జలుబు తగ్గడం లేదెలా?!
Published Mon, Feb 6 2017 11:45 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement