అదో చిత్రమైన పరిస్థితి. చూడ్డానికి అంతా బాగానే ఉంటుంది. కానీ ముక్కు రంధ్రాల్లో ఏదో అడ్డు ఉన్న భావనతో గాలి ఆడటం కష్టమవుతుంది. ఒక్కోసారి ఒక్కో ముక్కు రంధ్రం నుంచి మాత్రమే గాలాడుతుంటుంది. అదీ అతి కష్టంగా. నలుగురితో ఉన్నప్పుడు ముక్కు ఎగబీలుస్తూ, గాలాడని ముక్కు రంధ్రాన్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి గురక కూడా వస్తుంది. ఈ గాలి ఆడకపోవడం సమస్యకు అదనంగా చికాకూ, చిరాకూ కలుగుతుంటాయి. ఈ సమస్య ఎందుకొస్తుంది, పరిష్కారాలేమిటో చూద్దాం.
ముక్కుదిబ్బడ కారణంగా శ్వాస పీల్చుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలతో వచ్చే అలర్జీలు, సైనసైటిస్, ముక్కులోని రెండు రంధ్రాల మధ్యన ఉండే దూలం (సెప్టమ్) సరిగా లేకపోవడం, (అంటే) ముక్కు దూలం పూర్తిగా నిటారుగా లేకుండా అది ఎంతో కొంత ఒంపు తిరిగి ఉండటం వంటి అనేక అంశాలు శ్వాస సరిగా తీసుకోలేకపోవడానికి కారణమవుతాయి.
నిజానికి ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లేలోపు... ఊపిరి పీల్చుకునే సమయంలోనే ముక్కులో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ముందుగా బయటి నుంచి ముక్కులోకి ప్రవేశించిన గాలి ఉష్ణోగ్రతను... ఊపిరితిత్తుల వద్ద ఉన్న ఉష్ణోగ్రతతో దాదాపు సమం చేయడానికి ముక్కులోని మ్యూకస్ పొరలపై ఉండే నేసల్ టర్బినేట్స్ ప్రయత్నిస్తాయి.
బయటి తేమను ఊపిరితిత్తుల వద్ద ఉన్న తేమతో సమం చేయడానికీ ఈ టర్బినేట్స్ కృషిచేస్తాయి. ముక్కులోపలి వెంట్రుకల సహాయంతో గాలిలోని కాలుష్యాలు కొంత ఫిల్టర్ అవుతాయి. అయితే అలర్జీల సమస్య ఉన్నవారిలో ముక్కులోని మ్యూకస్ పొరల్లో ఇన్‌ఫ్లమేషన్ కారణంగా వాపు వచ్చే అవకాశముంది కాబట్టి ముక్కు ద్వారా గాలి సాఫీగా లోపలికి వెళ్లే ప్రక్రియలో కొంత అడ్డంకులు ఏర్పడతాయి.
ఈ అడ్డంకుల కారణంగానే ‘ముక్కు దిబ్బడ’ వస్తుంది. దాంతో గాలిని బలంగా పీల్చడం లేదా నోటితో గాలి పీల్చాల్సి రావడం జరుగుతుంటుంది. ఇలాంటివారు కాస్త పక్కకు ఒరుగుదామన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పడుకుంటే ఈ బాధ మరింత పెరుగుతుంది. కూర్చున్నప్పుడే కొద్దిమేర ఈ సమస్య తగ్గినట్టు అనిపిస్తుంది.
కొన్ని వైద్య చికిత్సలు...
ముక్కుదిబ్బడ సమస్య ఉపశమనం కోసం కొన్ని రకాల సింపుల్ చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహాతో డీకంజెస్టెంట్స్, యాంటీహిస్టమైన్స్, నేసల్ స్ప్రేస్ వంటి మందుల్ని వాడటం మేలు. వీటితో చాలా వరకు మంచి ప్రయోజనం ఉంటుంది.
∙యాంటీహిస్టమైన్స్ : ట్యాబ్లెట్స్ రూపంలో లభ్యమయ్యే ఈ మందులు కఫం రూపంలో ఉండే మ్యూకస్‌ను వీలైనంతగా తొలగించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని దూరం చేసి, శ్వాస సాఫీగా జరిగేలా చూస్తాయి. అయితే యాంటీహిస్టమైన్స్‌లో ప్రతికూలత ఏమిటంటే ఇవి వాడినప్పుడు బాధితులు చాలావరకు మందకొడిగా కనిపిస్తుంటారు.
చురుకుదనం ఎక్కువగా ఉండదు.
డీకంజెస్టెంట్స్ : ముక్కులో కేవలం రెండు చుక్కలతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ చుక్కల మందు... ముక్కులోని అడ్డంకి ఫీలింగ్‌ను తొలగించడానికి, టర్బినేట్స్ డీ–కంజెషన్‌కు ప్రయత్నిస్తాయి. ముక్కు కారడం వంటి సమస్యలు పరిష్కారం దొరకక΄ోయినా శ్వాస సాఫీగా అయ్యేందుకు ఇవి చాలావరకు తోడ్పడతాయి.
∙సెలైన్ నేసల్ స్ప్రే : ముక్కులోకి స్ప్రే చేసుకునే ఈ మందులు ముక్కుదిబ్బడను తాత్కాలికంగా తగ్గిస్తాయి.
ఆవిరి పట్టడం : అనేక శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఇంటి చిట్కా ఇది. ముక్కు దిబ్బడ పట్టిన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ముందుగా ప్రయత్నించదగిన ప్రక్రియ ఆవిరి పట్టడం. విక్స్ లాంటి మందును వేడి నీటిలో వేసి ఆవిరి పట్టే ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనది. అయితే వీటిన్నింటితో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు ముక్కు దూలం సరిచేయడానికి శస్త్రచికిత్సను సూచిస్తారు. లేదా ఇతరత్రా కారణాలను బట్టి చికిత్స అందిస్తారు.
మరికొన్ని అనర్థాలు కూడా...
తరచూ ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుండేవారిలో దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వాళ్లలో గురక, స్లీప్ ఆప్నియా, తగినంత నిద్ర లేకపోవడం, పట్టిన కొద్దిపాటి నిద్రలో నాణ్యత లేకపోవడం, రాత్రి నిద్ర సరిపోకపోవడంతో అసహనం, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్
(చదవండి: ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?)
Comments
Please login to add a commentAdd a comment