హోమియో కౌన్సెలింగ్
మా పాప వయసు 12 ఏళ్లు. చల్లటి వాతావరణంలో జలుబు చేస్తోంది. గొంతులో పుండులా అయిపోయి, నొప్పిగా ఉంటోందని బాధపడుతోంది. మింగలేకపోతోంది. మందులు వాడినప్పుడు సమస్య తాత్కాలికంగా తగ్గినా, చలి పెరగగానే మళ్లీ మామూలే. హోమియో చికిత్స ద్వారా ఆమెకు నయమయ్యే అవకాశం ఉందా? - రజిత, ఖమ్మం
మీరు రాసిన వివరాలను బట్టి మీ పాప ఫ్యారింజైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గొంతు వెనక భాగాన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫ్యారింజైటిస్ లేదా సోర్ థ్రోట్ అని అంటారు. చల్లటి వాతావరణంలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఫ్యారింజైటిస్ ఒకటి. సాధారణంగా ఈ సమస్య ఒక వారంలో తగ్గిపోతుంది. కానీ సరైన చికిత్స అందించకుండా తరచూ ఈ వ్యాధికి గురవుతుంటే మాత్రం అది... చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, కిడ్నీ సంబంధిత (గ్లోమెరులో నెఫ్రైటిస్) వంటి వ్యాధులు, రుమాటిక్ ఫీవర్, శరీరమంతా ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.
కారణాలు: దాదాపు 90 శాత మందిలో సమస్య వైరస్‌తో వస్తుంది. జలుబు, ఫ్లూ, మీజిల్స్, మోనోనూక్లియోసిస్, చికెన్‌పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమందిలో బ్యాక్టీరియా వల్ల... కోరింత దగ్గు, సెఫలోకోకస్ గ్రూపునకు చెందిన బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్స్‌కు గురైన వాళ్లు దగ్గడం, తుమ్మడం వంటివి చేసినప్పుడు వైరస్, బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించడం వల్ల కొన్ని అలర్జీలు, గొంతు కండరాలు ఒత్తిడికి గురి కావడం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ (జీఈఆర్‌డీ), గొంతు నాలుక లేదా ల్యారింగ్స్‌లో కణుతులు ఏర్పడటం వల్ల కూడా గొంతు నొప్పి వస్తుంది.
లక్షణాలు: ఫ్యారింజైటిస్ ముఖ్య లక్షణం గొంతునొప్పి, మింగే సమయంలో నొప్పిగా ఉండటం (మిగతా లక్షణాలు ఇన్ఫెక్షన్ కలిగించిన బ్యాక్టీరియా లేదా వైరస్‌పై ఆధారపడతాయి)
చికిత్స: ఫ్యారింజైటిస్ వ్యాధి వచ్చిన వారికి జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో రోగితత్వం, లక్షణాలు, కారణాలను బట్టి చికిత్స అందిస్తే తప్పక మంచి ఫలితం ఉంటుంది. హోమియో పద్ధతిలో రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా దీన్ని సంపూర్ణంగా నయం చేయవచ్చు. యాంటీబయాటిక్స్ వాడితే సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ హోమియో మందులతో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వ్యాధి మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
ఎడతెరిపిలేని దగ్గు...
లంగ్ క్యాన్సర్ కౌన్సెలింగ్
మా అమ్మకు 45 ఏళ్లు. ఈమధ్య బాగా దగ్గురావడంతో దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం పడింది. డాక్టర్‌ను సంప్రదించాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తెలిపారు. దీని లక్షణాలు, చికిత్స గురించి వివరించండి. - సుకుమార్, చిత్తూరు
ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో రెండు ప్రధాన రూపాలున్నాయి. మొదటిది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎస్‌సిఎల్‌సీ), రెండోది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎన్‌ఎస్‌సీఎల్‌సీ). ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లన్నింటిలో 80 శాతం కేసులు ఎన్‌ఎస్‌సీఎల్‌సీ రకానికి చెందినవి.
లక్షణాలు: వ్యాధి తీవ్రమయ్యే వరకు లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కాబట్టి లంగ్ క్యాన్సర్‌కు చికిత్స కష్టం. ఈ వ్యాధితో బాధపడేవారిలో కనిపించే కొన్ని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. ఎడతెగని దగ్గు గొంతు బొంగురుపోవడం దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం పడటం బరువు కోల్పోవడం సరైన కారణం లేకుండా ఆకలి తగ్గిపోవడం కారణమేమీ లేకుండా జ్వరం శ్వాసనాళాల్లో వాపు ఛాతీ నొప్పి, ఛాతీలో నీరు చేరడం.
ఊపిరితిత్తుల కణాలు విపరీతంగా పెరిగి ఊపిరితిత్తులను విధ్వంసం చేసే వ్యాధి ఇది. ఈ కణాలు మామూలు కంటే అతి వేగంగా పెరిగి ఒక కంతిలా ఏర్పడతాయి. ఊపిరితిత్తుల్లో మొదట ఒక కంతి ఏర్పడితే దాన్ని ప్రాథమిక కంతి అంటారు. ఇవే కణాలు రక్తప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లోకి వ్యాపిస్తే అది పరిసరాల్లో ఉండే అవయవాల్లోనూ పెరగడం ప్రారంభమవుతుంది. ఇలా వ్యాప్తి చెందే ప్రక్రియను మెటాస్టాసిస్ అంటారు. అక్కడ ఏర్పడే కంతిని రెండో కంతి అంటారు. రోగి ఎంతకాలం ఆరోగ్యంగా మనుగడ జీవితం సాగిస్తాడనే అంశం... అతడు ఏ దశలో ఉన్నాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ రకమైన చికిత్స ఇస్తున్నారనే అంశం పైన కూడా ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ తొలిదశలోనే వ్యాధిని నిర్ధారణ చేసి, చికిత్స ఆరంభిస్తే రోగులు కొంత ఎక్కువ కాలమే జీవించే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు చాలామందిలో తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం సాధ్యం కాదు. వ్యాధిని గుర్తించేసరికి అది మరొక భాగానికి వ్యాపించి ఉంటుంది. క్యాన్సర్‌ను రావడానికి మొదటి కారణాలు... పొగతాగడం. వాతావరణ కాలుష్యం. అయితే కొంతమంది పొగతాగే అలవాటు లేనివారు సైతం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు.
చికిత్స : సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ మార్గాలతో దీనికి చికిత్స చేస్తారు. ఈ మూడింటిలోనూ ఏదో ఒక ప్రక్రియను లేదా రెండు లేక మూడు ప్రక్రియలను కలగలిపి చేస్తారు.
డాక్టర్ ఎ.జయచంద్ర
పల్మునాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్
పాపకు గొంతునొప్పి...
Published Mon, Nov 7 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
Advertisement
Advertisement