నేను మీ ముక్కుని.. | special story to nose | Sakshi
Sakshi News home page

నేను మీ ముక్కుని..

Published Wed, May 25 2016 11:03 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

నేను మీ ముక్కుని.. - Sakshi

నేను మీ ముక్కుని..

ఆనంద్ తన ముఖంలోని కళ్ల గురించి, చెవుల గురించి కాస్త ఎక్కువగా ఆరాటపడిపోతాడు. వాటి గురించి తెగ బెంగపడతాడు. కానీ ముఖంలోనే ఉన్నా నా గురించి అంతగా పట్టించుకోడు. నేను ఆనంద్ ముక్కును. ఆనంద్‌కు జలుబు చేసి నా నుంచి ధార కారుతుంటే లేదా తరచూ తమ్ములు వస్తూ నాలో దురద పెడుతూ ఉంటే తప్ప నన్ను అంతగా గుర్తించడు. తాను గుర్తించకపోయినా నేను చాలా ముఖ్యమైన అవయవాన్ని. ఆనంద్‌కు తెలియకుండానే చాలా  ముఖ్యమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంటా. ఉదాహరణకు ఆనంద్ నిద్రపోతూ ఎడమవైపునకు ఒరిగాడనుకోండి. అతడి ఎడమ ముక్కు రంధ్రం నుంచి క్రమంగా గాలి ఆడకుండా పోయిందనుకోండి. వెంటనే అతడి మెదడు నుంచి అవసరమైన సిగ్నల్స్ పంపి, అతడు కాస్తా నిద్ర నుంచి మేల్కొనేలా చేసి కుడివైపునకు తిరిగేలా చేస్తుంటా.

 
నిజానికి ఆనంద్ తినే సమయంలో అతడి నోటి కంటే వాసన ద్వారా రుచిని నేనే ముందుగా ఆస్వాదిస్తుంటా. అలా ఆహారాన్నీ ఆనంద్ ఆస్వాదించేందుకు దోహదం చేస్తుంటా. ఇదే సమయంలో పాడైపోయిన ఆహారాన్ని ఆనంద్ తినకుండా కూడా హెచ్చరిస్తుంటా. ఆహారం నుంచి పసందైన సువాసన వస్తుందనుకోండి.. వెంటనే అతడి లాలాజలగ్రంథులను ప్రేరేపించి నోరూరేలా చేస్తుండేది నేనే. ఆ మరుక్షణమే అతడి జీర్ణగ్రంథుల నుంచి జీర్ణరసాలు ఊరేలా తోడ్పడుతుంటాను. ఆనంద్‌కు జలుబు చేసిందనుకోండి... ఏ ఆహారపు సువాసనా తెలియదు సరికదా బొత్తిగా రుచి కూడా తెలియకుండా పోతుంది. దాంతో ఏదో తినాలని తింటుంటాడు తప్ప ఇష్టంగా తినడు.

 
ఇక నిర్మాణపరంగా నేను గొప్ప చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నన్ను చూస్తేనే తెలుస్తుంది. నిజానికి నోటి పైకప్పుకూ, మెదడుకూ మధ్యన నేను ఉంటా. నేను ఒకే అవయవంలా కనిపిస్తాను... కానీ ముక్కులో రెండు రంధ్రాల మధ్య పార్టిషన్ గోడ ఉంటుంది. దాంతో రెండు ముక్కు రంధ్రాలుగా విడివడి ఉంటా. దాని వెనక, ఆనంద్ నోటి పైభాగమంతా నా కార్యక్షేత్రం. ఆనంద్ కళ్లకూ, నాకూ మధ్య భాగంలోనూ  దాని వెనక... ఇలా తల భాగం మొత్తంలో నాకు ఇరువైపులా ఎనిమిది ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఇవి పుర్రెను బోలుగా ఉంచడంతో పాటు నేను పీల్చుకునే గాలిలో తేమ ఉండేలా చూస్తుంటాయి. ఈ ఖాళీ ప్రదేశాలను సైనస్‌లు అంటారు. ఈ ఖాళీలలో బ్యాక్టీరియా చేరితే నాకు ఇబ్బంది కలగడంతో పాటు ఆనంద్‌ను తలనొప్పి బాధిస్తుంది.

 
పెద్ద ఎయిర్‌కండిషన్‌ను రెండు సెం.మీ.కు కుదిస్తే...
నా పనులన్నింటిలోనూ అతి పెద్ద పని ఒక ఎయిర్ కండిషనర్‌లా వ్యవహరించడం. ప్రతిరోజూ నేను దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతాను. వాతావరణంలో ఒక్కోసారి పొడిగాలి ఉంటుంది. మరికొన్నిసార్లు గాలిలో తేమ ఒక్కోసారి 75 నుంచి 80 శాతం వరకు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో ఉన్న గాలి కావాలి. అందుకే ఒక పెద్ద చెట్టు మొద్దు అంతటి సైజ్‌లో ఉన్న ఎయిర్ కండిషనర్‌ను కొన్ని సెంటీమీటర్లకు కుదిస్తే ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటాను. నేనూ ఆ ఎయిర్ కండిషనర్‌లాగే పని చేస్తాను. గాలిలో తేమ కల్పించడానికి దాదాపు లీటరు తేమను స్రవిస్తాను. ఇదంతా మ్యూకస్ రూపంలో కాస్త జిగురుగా ఉంటుంది. నాలోని ఎర్రటి స్పాంజ్ కణజాలం నుంచి ఈ తేమ ఊరుతూ ఉంటుంది. కాస్త రఫ్‌గా ఉండే ముక్కు రంధ్రాలు గాలిని శుభ్రం చేస్తుంటాయి. నూనెలో ముంచితీసినట్టుగా ఉండే పేపరును గాల్లో వేలాడదీస్తే, దానికి పురుగులు అంటుకున్నట్లుగా నాలోని వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి  అంటుకుంటాయి. అయితే స్వాభావికంగా అలా చిక్కుకుపోయే వాటిని నేను అక్కడ పేరుకోనివ్వను. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా బ్యాక్టీరియామయం అయిపోతుంటుంది. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్ బ్లాంకెట్‌ను ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటాను. ఆ మ్యూకస్‌ను తొలగించడానికి సీలియా అని పిలిచే అతి చిన్న (మైక్రోస్కోపిక్) చీపుర్లు ఉంటాయి. అవి కొరడాల్లా కదులుతూ మ్యూకస్‌ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. అక్కడి నుంచి మ్యూకస్ కడుపులోకి పడిపోతుంటుంది. అక్కడ అత్యంత ప్రభావపూర్వకమైన యాసిడ్ స్రవించి, ఆ బ్యాక్టీరియాను కాల్చేస్తుంది. నాలోని సీలియా అనే ఆ చీపుర్లు ప్రతి సెకనుకు పదిసార్లు కొరడా ఝళిపించినట్లుగా కదులుతూ మ్యూకస్‌ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. ఆనంద్‌కు జలుబు చేసినప్పడు ఈ మ్యూకస్ మరింత ఎక్కువగా స్రవిస్తుంది. అది గొంతులోకి చేరడానికి బదులు మరింత ముందుకు వచ్చి నాలోని ముక్కు రంధ్రాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. అలా జరగడాన్ని ముక్కు కారడంగా చెబుతుంటారు అందరూ!

 
అతి సన్నటి రక్తనాళాలు...

ముక్కులో రక్తనాళాలు ఒక పరుపులా పరుచుకొని ఉంటాయి. గాలిలోకి తేమ నింపే గాలి మరల్లాంటి టర్బినేట్స్ నాలో ఉంటాయి. ఆ టర్బినేట్స్ అన్నీ ముక్కు రంధ్రాలకు ఇరువైపులా ఒక అంగుళం పొడవుతో పొడుచుకువచ్చినట్లుగా ఉంటాయి. అవన్నీ అత్యంత చిన్న వైన కారుల్లోని రేడియేటర్లలోని ఫ్యాన్లలాంటివవి. వాటన్నింటికీ అతి సన్నగా పరుచుకున్న రక్తనాళాలనుంచి చాలా సమృద్ధిగా రక్తప్రసరణ జరుగుతుంటుంది. అవన్నీ ఒక బెడ్‌లా పరుచుకొని ఉండటానికి కారణం... పీల్చుకున్న చల్లగాలినంతటినీ ఊపిరితిత్తులకు అనువుగా అందించేందుకు వీలయ్యేలా ఎక్కువ స్థలాన్ని (ఏరియాను) కల్పించడమే.

 
ఎన్నెన్నో జబ్బులకు గురయ్యే ప్రమాదం...

నేను దేహం బయటే ఉంటాను కాబట్టి ఎన్నెన్నో వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు సిఫిలిస్, టీబీ వంటి క్రిములతో నా కార్టిలేజ్ దెబ్బతిని, నా ఆకృతే మారిపోయే అవకాశం ఉంది. అలాగే ఒక్కోసారి నాలో అదనపు కండ పెరిగి అవి పుట్టగొడుగు షేప్‌లో పెరగవచ్చు. వీటినే నేసల్ పాలిప్స్ అంటారు. అవి ముక్కులోకి వచ్చే వాయుప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. లేదా సైనస్ గదులకు అడ్డుగోడగా మారవచ్చు. దాంతో అవి ఆనంద్‌కు బాధాకరంగా పరిణమించవచ్చు.

 
అలర్జీ కలిగించే పదార్థాలైన పొగ, పొగాకు వాసనలు నాలోని మ్యూకస్ పొరలను ప్రేరేపించి, వాటిని వాచిపోయేలా చేస్తాయి. ఫలితంగా రక్షణాత్మక ద్రవాలు ఎక్కువగా  గొంతులోకి ప్రవహిస్తాయి. ముక్కుదిబ్బడ కలిగేలా చేస్తాయి. దాంతో ఊపిరి సరిగా అందక ఆనంద్ ముక్కు చీదుతుంటాడు. ఫలితంగా గొంతులోని సూక్ష్మజీవులు బలవంతంగా సైనస్‌లలోకిగానీ లేదా మధ్య చెవిలోకిగానీ ఎవరో తోసినట్లుగా ప్రవేశించవచ్చు. ముక్కులోని పొరల వాపు తగ్గడానికి ఆనంద్ నేసల్ డ్రాప్స్ వాడుతుంటాడు. కానీ నిజానికి అతడు వాడే డ్రాప్స్ వల్లనే అతడి ముక్కులోని పొరల్లో  మరింత వాపు వచ్చే ప్రమాదం ఉంది.

 
ఆనంద్‌కు వయసు పెరుగుతున్న కొద్దీ అతడి వాసన సామర్థ్యాలూ తగ్గుతాయి. ఒకప్పుడు బాగా పరిమళంగా అనిపించిన కాఫీ ఘుమఘుమలు ఇప్పుడు అంతే గొప్పగా ఉండకపోవచ్చు. కానీ ఆనంద్ పీల్చే గాలిని శుభ్రపరచడం, అతడికి రక్షణ కల్పిస్తూ అతడి తరఫున పోరాటం చేయడం మాత్రం అతడి తుదిశ్వాస వరకూ కొనసాగిస్తుంటా.

 

వినసొంపైన స్వరానికి కారణం నేనే...
ఆనంద్‌కు తన గొంతు అంటే చాలా ఇష్టం. ఆనంద్ గొంతు ఇంతగా బాగుండటానికి నాకు కృతజ్ఞుడై ఉండాలి. ఏదీ... ఒక్కసారి తన ముక్కు రంధ్రాలు రెండూ వేళ్లతో మూసుకొని, మాట్లాడమనండి చూద్దాం! ఆ తేడా అతడికే తెలుస్తుంది. నాలోంచి వచ్చే ప్రకంపనల (రిజొనెన్స్) వల్లనే అతడి గొంతు అంత బాగుంటుంది.

 

వాసనలు ఎలా గుర్తుపడతానంటే...
నా విధుల్లో ముఖ్యమైన వాటిల్లో ఒకటి వాసన చూడటం. నేను దాదాపుగా 4,000 రకాల వాసనలను గుర్తించగలను. నిజానికి గుర్తింపు శక్తి చాలా ఎక్కువగా ఉన్నవారిలో దాదాపు 10,000 రకాల వాసనలూ గుర్తుపడతా. నా ప్రతి ముక్కు రంధ్రంలోనూ పేపర్ కంటే పలచగా... పసుపు-బ్రౌన్ రంగుల్లో ప్యాచ్‌ల మాదిరిగా ఉండే కణజాలం ఉంటుంది. ప్రతి ప్యాచ్‌లోనూ దాదాపు కోటి రిసెప్టార్ కణాలు ఉంటాయి. ప్రతి కణంలోనూ ఆరు నుంచి ఎనిమిది అతి సన్నటి కేశాల్లా ఉండే నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ నా నుంచి కేవలం మూడు సెంటీమీటర్ల దూరంలో ఉండే మెదడుకు అనుసంధానితమై ఉంటాయి. ఏదైనా వాసన రాగానే... పదార్థాల నుంచి వచ్చిన మాలెక్యూల్స్.. వాసన గుర్తించే ప్యాచ్‌లను తాకుతాయి. ఆ వెంటనే అక్కడి నుంచి అత్యంత  తక్కువ మోతాదులో ఉండే విద్యుత్ తరంగాలు  వెలువడి మెదడును చేరతాయి. ఆ విద్యుత్ తరంగాలను మెదడు స్వీకరించి.. అది మరుగుతున్న పులుసా, అప్పుడే వేస్తున్న తాలింపా, కాలుతున్న రొట్టెనా, మరింకేదైనా వాసనా అని గుర్తించి, తన తీర్పు వెలువరిస్తుంది. చెడు వాసనల విషయంలోనూ అంతే.

 
అయితే వాసనను గుర్తించడం అన్నది కేవలం ఇక్కడ పేర్కొన్నంత సులువు కాదు. రంగుల్లో మూడు ప్రైమరీ కలర్స్ ఉండి... అవి వేర్వేరు పాళ్లలో కలిసినప్పుడు ఎన్నో షేడ్స్ ఏర్పడ్డట్లుగానే వాసనల్లోనూ ప్రైమరీ వాసనలు ఉండి, అవి వేర్వేరు పాళ్లలో కలిసి... వేర్వేరు వాసనలుగా మనకు తెలుస్తాయి. ఒకవేళ నేను ఏదైనా వాసనను అదేపనిగా పీలుస్తూ ఉన్నాననుకోండి. ఒక దశలో ఆ వాసనకు అలవాటైపోయి... దాన్ని గుర్తించలేను. ఉదాహరణకు ఆనంద్ తోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడనుకుందాం. అప్పుడు ఆనంద్ క్రమంగా తోళ్ల పరిశ్రమ నుంచి వచ్చే ఘాటైన వాసనను గుర్తించలేడు. కానీ మిగతా వాసనలు గుర్తించడంలో అతడి నైపుణ్యాలను మాత్రం కోల్పోడు. ఉదాహరణకు మంచి గులాబీల వాసన వచ్చిందనుకోండి. అతడు తోళ్లపరిశ్రమలో ఉన్నంత మాత్రాన అతడి ముక్కు మొద్దుబారదు. మునుపటిలాగే గులాబీల పరిమళాలను ఆఘ్రాణించగలడు.

 

డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి - ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement