సైనసైటిస్‌ తగ్గుతుందా? | sakshi health councling | Sakshi
Sakshi News home page

సైనసైటిస్‌ తగ్గుతుందా?

Published Tue, Feb 14 2017 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

సైనసైటిస్‌ తగ్గుతుందా? - Sakshi

సైనసైటిస్‌ తగ్గుతుందా?

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 34 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ముక్కుతో గాలి పీల్చుకోవడం కష్టం కావడంతో పాటు తలనొప్పితో బాధపడుతుంటాను. చాలా రకాల మందులు వాడాను. వాడినప్పుడు కొద్దిపాటి ఉపశమనమేగానీ సమస్య తగ్గడం లేదు.  హోమియోలో శాశ్వత చికిత్స ఉందా? – రవిందర్, కరీంనగర్‌
సైనస్‌ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్‌ల లోపలివైపున మ్యూకస్‌ మెంబ్రేన్‌ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి వేడిమిని మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ  గదుల్లో ఇన్ఫెక్షన్‌ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌ ఫ్యారింగ్స్‌ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్‌ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్‌ వస్తుంది.

సైనసైటిస్‌ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం ∙ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం ∙కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం ∙తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్‌ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్షెక్షన్‌ వ్యాపించవచ్చు. ఎక్స్‌–రే, సీటీస్కాన్‌ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు.

సైనస్‌ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా  నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి...

హెపార్‌ సల్ఫూరికమ్‌: అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్‌ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు.
మెర్క్‌సాల్‌: రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్‌ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్‌ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు.

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి సీనియర్‌ డాక్టర్‌
పాజిటివ్‌ హోమియోపతి
హైదరాబాద్‌

బ్లడ్‌ క్యాన్సర్‌ ఎందుకు వస్తుంది?
బ్లడ్‌ క్యాన్సర్‌ కౌన్సెలింగ్‌


మా అమ్మగారికి వయసు 45 ఏళ్లు. ఈమధ్య ఆమెకు కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్‌ అని తెలిసింది. దాంతో షాక్‌ అయ్యాము. బ్లడ్‌ క్యాన్సర్‌ రావడానికి కారణాలు చెప్పండి. – మాధురి, నల్లగొండ
రక్తకణాల ఉత్పత్తి సక్రమమైన తీరులో జరగకపోవడం వల్ల బ్లడ్‌  క్యాన్సర్‌ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్‌ మ్యారో (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడే మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్‌లెట్స్‌గానూ తయారవుతాయి. బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కోల్పోతారు. బ్లడ్‌ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి.
అవి... 1) లుకేమియా
2) లింఫోమా 3) మైలోమా
లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటి వల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్‌ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి.

వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో తమ విధులను అవి సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరక్తణాలు తగ్గిపోయి, రోగికి రక్తహీనత రావచ్చు. ఫలితంగా వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. అందుకే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

ఇతర లక్షణాలు: జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పోవడం, ఇన్‌ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, చిన్నగాయం నుంచి అధిక రక్తస్రావం ∙తలనొప్పి, కాలేయం, స్పీ›్లన్, ఎముకల నొప్పి. సాధారణంగా బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారికి ప్రధానంగా మందులతో (కీమోథెరపీ) చికిత్స చేస్తారు. మీ అమ్మగారి విషయంలో మీ డాక్టర్‌ చెప్పిన సూచనలు పాటించి, తగిన చికిత్స అందించండి.

శైలేశ్‌ ఆర్‌. సింగీ సీనియర్‌
హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్
సెంచరీ హాస్సిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement