108కి డీజిల్ లేక.. ఆగిన యువకుడి ఊపిరి
సబ్బవరం (పెందుర్తి): సకాలంలో ఆదుకోవాల్సిన ఆపద్బాంధవి (108 అంబులెన్స్) చేతులెత్తేయడంతో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. ఆ వాహనానికి డీజిల్ లేకపోవడంతో.. సమయానికి చికిత్స అందక విశాఖ జిల్లాకు చెందిన యువకుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. వివరాలు.. సబ్బవరం సమీపంలోని దుర్గానగర్‌కు చెందిన పాల నాయుడికి (21) మంగళవారం అర్థరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.
ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి తలెత్తడంతో కుటుంబసభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. డీజిల్ లేనందువల్ల సమీపంలోని వాహనం రాకపోవచ్చని, మరో వాహనం రావాలంటే 2, 3 గంటల సమయం పడుతుందంటూ 108 సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. దీంతో చేసేది లేక ఆటోలోనే కేజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు. 108 సకాలంలో వచ్చి ఉంటే తమ బిడ్డ బతికేవాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.