పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ):వైద్యో నారాయణో హరీ అని అంతా అంటుంటారు. దైవంతో సమానమని గౌరవిస్తారు. అటువంటి వైద్యుడు మానవత్వం మరిచి డబ్బులకు కక్కుర్తిపడిన ఉదంతం అందరినీ విస్మయానికి గురిచేసింది. చేతికి అందొచ్చిన కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను... పోస్టుమార్టం రిపోర్టు కోసం రూ.10వేలు డిమాండ్ చేసి వైద్య వృత్తికే మచ్చ తెచ్చేందుకు యత్నించాడు. ఈ జుగుప్సాకర ఘటన సోమవారం కేజీహెచ్‌లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 5వ వార్డు మారికవలస పరిధి రాజీవ్‌గృహకల్ప సముదాయం బ్లాక్ నంబర్ 27లో నివసిస్తున్న కెల్లా వెంకటేశ్వరాచారి కుమారుడు వెంకటేష్ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో విశాఖ నగరంలోకి వెళ్తుండగా... వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఎదురుగా వచ్చేసరికి హైవేపై నడుచుకుని వెళ్తున్న వ్యక్తిని తప్పించేందుకు యత్నించి కింద పడిపోయాడు. అదే సమయంలో వచ్చిన లారీ వెంకటేష్ పైనుంచి దూసుకుపోవడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీఎం పాలెం పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. ఇక్కడే కేజీహెచ్‌లో పోస్టుమార్టం చేసే వైద్యుడు తన వికృత రూపం ప్రదర్శించాడు.
రూ.10 వేలు ఇవ్వకుంటే... రిపోర్టు తారుమారు
సోమవారం ఉదయం 10 గంటలకల్లా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా చేయకపోవడంతో వెంకటేష్ బంధువులు, స్నేహితులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లి వైద్యుడిని సంప్రదించారు. పోస్టుమార్టం నిర్వహించాల్సిన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... మృతి చెందే సమయానికి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానంగా ఉందని, అందువల్ల పోస్టుమార్టం రిపోర్టులో మద్యం తాగి వాహనం నడపలేదని రాసేందుకు, పోస్టుమార్టం నిర్వహించేందుకు రూ.10వేలు లంచమివ్వాలని డిమాండ్ చేశాడని వెంకటేష్ బంధువులు, స్నేహితులు ఆరోపించారు. సాధారణంగా అందరూ పోస్టుమార్టం చేసే డాక్టర్‌కు ఇస్తున్నట్టుగానే రూ.2వేలు ఇచ్చేందుకు సిద్ధపడినా రూ.10వేలు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తానని చెప్పడంతో మృతుడి బంధువులు, స్నేహితులు నిరసనకు దిగారు. ముందుగా ఆంధ్ర వైద్య కళాశాల ముందు, తరువాత పోస్టుమార్టం నిర్వహించే భవనం ముందు నిరసన చేపట్టారు. విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు సదరు పోస్టుమార్టం వైద్యుడితో సంప్రదించారు. విషయాన్ని ఏఎంసీ కార్యాలయానికి రిపోర్టు చేస్తే దర్యాప్తు చేపడతామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు.
లారీ యజమానితో కుమ్మక్కై..!
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరుతో సహా దాని యజమాని సదరు పోస్టుమార్టం చేసే వైద్యుడికి లంచం ఎర చూపడం వల్లనే చెడు అలవాట్లు లేని వెంకటేష్‌కు మద్యం అలవాటు ఉందని ఆరోపించారన్న అనుమానం మృతుని కుటుంబీకులు వ్యక్తం చేశారు. పదిమందికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ వైద్యులు ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయమని, ప్రభుత్వ వైద్యులను ఇకపై పేద ప్రజలు భయంతో చూస్తారని అందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించారు. కుమారుడి మృతదేహంపై పడి తల్లి రోదిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది.
రూ.10వేలు డిమాండ్ చేశారు
పోస్టుమార్టం చేసే వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. మృతుడు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానంగా ఉందని, మద్యం తాగి వాహనం నడపలేదని పోస్టుమార్టం రిపోర్టులో రాయాలంటే రూ.10వేలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేయడం అన్యాయం. ప్రభుత్వ వైద్యులంటే ప్రజలకు ప్రాణభయం పట్టుకుంది. రూ.10వేలు ఇవ్వడానికి నిరాకరించడం వల్లే ఉదయం చేయాల్సిన పోస్టుమార్టం మధ్యాహ్నం 2 గంటలకు చేశారు. – బేతా దుర్గారావు, బంధువు
మద్యం అలవాటు లేదు
వెంకటేష్‌కు మద్యం అలవాటు లేదు. స్నేహితులు మద్యం సేవిస్తే వారిని మందలించేవాడు. లేని అలవాటును ఉన్నదని చెప్పడం ఎంతవరకూ సబబు. లారీ డ్రైవరు, యజమాని ఇచ్చే లంచాలకు పోస్టుమార్టం చేసే వైద్యుడు చంద్రశేఖర్ ఆశపడినట్టున్నాడు. అందువల్లే లేని అలవాటు ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు.– నూకరాజు, స్నేహితుడు
మంచి బాక్సర్
నా మేనల్లుడు వెంకటేష్ మంచి బాక్సర్. తల్లిదండ్రులను, తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. చిన్నవయసులోనే బరువు బాధ్యతలు మోస్తూ తండ్రికి అండగా నిలబడ్డాడు. అటువంటి మంచివాడిపై నిందలు వేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్నదనడం నిజం కాదు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.– శ్రీదేవి, మృతుని మేనత్త
Comments
Please login to add a commentAdd a comment