ఆన్‌డ్యూటీ 'ఓన్‌' డ్యూటీ | KGH Doctors Negligence in Duty Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆన్‌డ్యూటీ 'ఓన్‌' డ్యూటీ

Published Mon, Mar 4 2019 6:53 AM | Last Updated on Wed, Mar 20 2019 1:32 PM

KGH Doctors Negligence in Duty Visakhapatnam - Sakshi

కేజీహెచ్‌

ఉదయం 9 గంటలైతే చాలు.. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌ వైద్యులు, రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గంట.. గంటన్నర తర్వాత చూస్తే చాలా విభాగాల్లో వైద్యులు కనిపించరు. అరె.. ఇప్పుడే ఈ డాక్టర్‌ని బయోమెట్రిక్‌ హాజరు వద్ద చూశానే.. అని అనుకునేలోపే మాయమైపోతారు. వైద్యులొస్తారని వేచి చూసి చూసీ.. చివరికి పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ ఇదే డాక్టర్‌ బిజీ బిజీగా ట్రీట్‌మెంట్‌ చేస్తూ కనిపిస్తుంటారు.ఎందుకంటే.. అక్కడ ఆన్‌ డ్యూటీ.. ఇక్కడ ఓన్‌ డ్యూటీ.కేజీహెచ్‌లోని పలు విభాగాల వైద్యులు ఉదయాన్నే ఇక్కడ హాజరు వేసుకొని... తరువాత పక్కన ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు... అక్కడే పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి గైర్హాజరు.. వైద్య విద్యార్థులకు, రోగులకు తీరని అన్యాయం చేస్తుంది.

విశాఖసిటీ: ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని కేజీహెచ్‌లో నిపుణులైన వైద్యులు చాలామంది ఉన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వారు చికిత్స అందిస్తే చాలు రోగాలు మటుమాయమవుతాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఉదయం 9 నుంచి 9.30లోపు బయోమెట్రిక్‌లో హాజరు వేసినప్పటికీ వారు ఇటు ఓపీలో కాని అటు వార్డులో కాని కనిపించరు. కేజీహెచ్‌లో ఉండాల్సిన సమయంలో వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తూ రెండు చేతులాసంపాదించుకుంటున్నారు. కొంత మంది వైద్యులకు సొంత నర్సింగ్‌ హోంలు కూడా ఉన్నాయి. వీరి ప్రవర్తన రోగులకే కాదు వైద్య విద్యార్థులకు కూడా శాపంగా మారింది. అడపాదడపా వైద్యాధికారులు, మంత్రులు వీరి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అండదండలతోనే వీరిలా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఆసుపత్రిలో బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కేజీహెచ్‌ని సందర్శించిన సమయంలో.. ఆసుపత్రిలో ఉండాల్సిన సమయంలో వైద్యులు ఉండకపోతే తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆ తర్వాత రోజు కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. వచ్చినవారు వచ్చినట్టే వచ్చి.. హాజరు వేసుకొని ఎంచక్కా.. సొంత నర్సింగ్‌ హోమ్‌లకు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు చెక్కేస్తున్నారు. కేజీహెచ్‌లోని వైద్యుల తీరును పరిశీలిస్తున్న వివిధ శాఖలకు చెందిన మంత్రులు హెచ్చరిస్తున్నా ఫలితం మాత్రం సున్నా. ప్రైవేటు ఆసుపత్రుల్లో, సొంత నర్సింగ్‌ హోంలో శస్త్రచికిత్సలు, ఓపీ సేవలు అందిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు.

జూడాలపైనే భారమంతా..
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అసిస్టెంట్, అసోసియేట్, హెచ్‌ఓడీలు ఓపీల్లోనూ, వార్డుల్లోనూ వైద్య సేవలు విధిగా అందించాలి. వైద్య విద్యార్థులకు బెడ్‌సైడ్‌ శిక్షణ ఇవ్వాలి. ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులకు వారి విద్యా సంవత్సరాన్ని బట్టి రోగులను చూపిస్తూ వ్యాధుల గురించి బోధించాలి. రోగులకు అందిచే వైద్య సేవలను వివరించాలి. ఇటువంటి పరిస్థితి కేజీహెచ్‌లోని కొన్ని విభాగాల్లో కనిపించడం లేదు. ఓపీల్లో పీజీలు, జూనియర్‌ వైద్యులు మాత్రమే అధికంగా కనిపిస్తున్నారు. మరి కొన్నింటిలో అసిసెంట్‌ ప్రొఫెసర్లు కనిపిస్తుంటారు. అసోసియేట్‌లు, హెచ్‌ఓడీలు వారంలో మూడు రోజులు ఓపీకి రావాల్సి ఉండగా చాలా మంది మాత్రం ఒక్కరోజు మాత్రమే వస్తున్నారు. అదీ మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల సమయంలో మాత్రమే దర్శనం ఇస్తున్నారు.

విశ్వాసాన్ని మంటగలుపుతున్నారు..
ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల ప్రజలకు కేజీహెచ్‌ వైద్య సంజీవని వంటిది. ఎంతో మంది నిపుణులైన వైద్య ప్రముఖులు రోగులకు అందించిన సేవలే కేజీహెచ్‌కు పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి. అందువల్లనే వందలాది మంది పేదలు సర్కారీ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందన్న భరోసాతో ఇక్కడకు వస్తుంటారు. అదేవిధంగా వైద్య విద్యార్థులను నిష్ణాతులైనవారిగా తీర్చి దిద్దే అవకాశమూ ఉంది.

సర్కారీ ఆసుపత్రిలోని వైద్యుల గైర్హాజరు.. వైద్య విద్యార్థులకు, రోగులకు తీరని అన్యాయం చేస్తుంది. వీరి వల్ల ఆసుపత్రికి, ఆంధ్ర వైద్య కళాశాలకు మాయని మచ్చ ఏర్పడుతోంది. కేజీహెచ్‌కు వెళ్తే రోగం పూర్తిగా తగ్గిపోతుందన్న భరోసా రోగులకు ఉండేది. వారు కూడా అదేవిధంగా భావించేవారు, ఈ నమ్మకం క్రమంగా దూరం అయిపోతుంది. వైద్య విద్యార్థులకు తరగతుల్లో చెబుతున్న పాఠాలే తప్ప, బెడ్‌ సైడ్‌ శిక్షణ, ఓపీల్లో బోధన క్రమంగా తగ్గిపోతుంది.

అధికార పార్టీ అండతో కొందరు
అధికారం, అండ ఉంటే.. అడ్డేముంది అన్న రీతిలో కొంతమంది వైద్యులు వ్యవహరిస్తున్నారు. కొంతమంది వైద్యులు ఉదయం వచ్చి గంట పాటు సేవలందించి వేరే ఆస్పత్రులకు వెళ్లిపోతుండగా.. మరికొందరు మాత్రం కేజీహెచ్‌కు రావడం.. హాజరు వేసుకోవడం.. ప్రైవేటుకు పయనమవ్వడం.. ఇదే తంతుగా వ్యవహరిస్తున్నారు. వారిపై ఎవరైనా హెచ్‌ఓడీలుగానీ, అధికారులు గానీ ఆగ్రహం వ్యక్తం చేసిన మరుక్షణమే.. మంత్రి నుంచి, ఎమ్మెల్యే నుంచి ఫోన్‌ వస్తుంది. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలెయ్యాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, వైద్య విద్యా శాఖ మీద ఉంది. వీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేకపోవడంతో సర్కారీ సేవలు అందించే వైద్యులు ధైర్యంగా ప్రైవేటు సేవలు అందిస్తూ, సర్కారీ జీతాలు తీసుకుంటున్నారు. ఈ తరహా అర్థాంతర సేవలు అందుతున్న పరిస్థితి ఆర్థోపెడిక్, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement