14 ఏళ్ల తర్వాత..
బయట పడిన డిఫ్తీరియాబాధితురాలు
విశాఖకు చెందిన 8 ఏళ్ల చిన్నారి
ఐదు రోజులుగా వైద్య సేవలు
నక్కపల్లి: చిన్నపిల్లల్లో చాలా అరుదుగా వచ్చే డిఫ్తీరియా(కంఠసర్పి)వ్యాధిని కేజీహెచ్ వైద్యులు తాజాగా గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి జె.సరోజిని గురువారం నక్కపల్లిలో వెల్లడించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత విశాఖ జిల్లాలో ఈ వ్యాధి బయటపడటం వైద్యవర్గాలను విస్మయపరిచింది. విశాఖపట్నం చినవాల్తేరులోని ఎనిమిదేళ్ల చిన్నారికి ఈ వ్యాధి సోకింది. స్వైన్‌ఫ్లూగా భావించి బంధువులు ఈ నెల 7న కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరపగా డిఫ్తీరియాగా తేలింది. వెంటనే ఆస్పత్రిలోచేర్చుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఎక్కడా డిఫ్తీరియా నమోదు కాలేదు. రాష్ట్రంలోనే ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో నాలుగేళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక కేసును గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఈ కేసు నమోదయింది. చిన్నారిని కేజీహెచ్ అత్యవసర వార్డులో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారని,ఆమె ఆరోగ్యపరిస్థితి మెరుగుపడిందని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని డీఎంహెచ్‌వో తెలిపారు. డిఫ్తీరియా లక్షణాలు కనిపించిన విశాఖ చినవాల్తేరు పరిధి 17,18 వార్డుల్లో 20 ప్రత్యేక బృందాలను నియమించి సహాయక చర్యలు, గుర్తింపు సర్వే చేపట్టామన్నారు. గతంలో ఈ ప్రాంతంలో బీసీజీ టీకాలు వేసిందీ, లేనిదీ నిర్ధారిస్తున్నామన్నారు. అవసరమైతే ఈ రెండు వార్డుల్లో 50వేల మందికి టీకాలు వేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లా చరిత్రలో దాదాపు 14 ఏళ్ల క్రితం ఈ వ్యాధి న మోదయిన విషయం తెలుసుకున్నానని, తర్వాత ఎక్కడా ఇటువంటి కేసులు నమోదయిన దాఖలాలు లేవన్నారు. ఈ వ్యాధిసోకితే విపరీతమైన జలుబు, ముక్కకారుట, గొంతులో తెల్లటి జిగురువంటి పదార్థం ఏర్పడుతుందని, దాదాపు స్వైన్‌ఫ్లూ లక్షణాలను పోలి ఉంటుందన్నారు.
జిల్లాలో10స్వైన్‌ఫూ ్లకేసులు నమోదు
జిల్లాలో 10 స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి జె.సరోజిని వెల్లడించారు. గురువారం ఆమె గొడిచర్ల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నక్కపల్లి సీహెచ్‌సీలో క్లస్టర్‌పీహెచ్‌సీ పనివిధానాన్ని పరిశీలించారు. క్లస్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 10 కేసులు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలోని చెస్ట్ ఆస్పత్రితోపాటు, మరో రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. మధురవాడ, అక్కయ్యపాలెం, ఇసుకతోట,పెందుర్తి, మునగపాక తదితర ప్రాంతాల నుంచి ఈ లక్షణాలతో రోగులు వస్తున్నారన్నారు. జిల్లాలో 85 పీహెచ్‌సీల పరిధిలో 21 వైద్యాధికారి పోస్టులు, 51 ఎంపీహెచ్‌ఏ(ఎం), 75 ఎంపీహెచ్‌ఏ(ఎఫ్), నాలుగు ల్యాబ్‌టెక్నీషియన్‌లు,21 స్టాఫ్‌నర్సు,15 ఫార్మాసిస్టు పోస్టులు ఖాళీలున్నాయన్నారు. వీటి భర్తీకి ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిని 350 పడకల స్థాయికి పెంచుతూ అనుమతులు వచ్చాయన్నారు. ఎలమంచిలి ఆస్పత్రిని 100 పడకల స్థాయికి, నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. చినదొడ్డిగల్లు పీహెచ్‌సీలో అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తికి అవసరమై బడ్జెట్ విడుదలతోపాటు, అవసరమైన సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
జిల్లాలో 35 పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య బాగుందన్నారు. కుటుంబ నియంత్రణ శ్రస్త్రచికిత్సలు కూడా లక్ష్యానికి మించి జరుగుతున్నాయన్నారు. గతేడాది 15వేల శ్రస్త్రచికిత్సలు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతికోసం 600 ప్రైవేటు నర్సింగ్‌హోంలు దరఖాస్తుచేసుకున్నాయన్నారు. 400హోంలకు అనుమతి ఇచ్చామని,100హోంలు పరిశీలన పూర్తయ్యాయని, మరో 100హోంలను పరిశీలించాల్సి ఉందన్నారు. అనుమతులు లేని నర్సింగ్‌హోంలు ఎనిమిది ఉన్నాయని వాటికి నోటీసులు జారీ చేశామన్నారు. సమావేశంలో నక్కపల్లి ఆస్పత్రి వైద్యాధికారి పూర్ణచంద్రరావు, ఎంపీహెచ్‌ఈవో అప్పలనాయుడు ఉన్నారు.