హిందూపురం : ఆరోగ్యం కుదుట పడడంతో ఆంత్రాక్స్ సోకిన విద్యార్థిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆనందంతో విద్యార్థి తల్లిదండ్రులు డాక్టర్లను సన్మానించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో లేపాక్షి మండలం మానెంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి శ్రీకాంత్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా అక్కడి వైద్యులు ఆంత్రాక్స్‌గా తేల్చారు.
అనంతరం స్వగ్రామానికి చేరుకున్న శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులను గ్రామంలో వెలివేసేందుకు చూశారు. కన్నీరుమున్నీరైన వారు లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా డాక్టర్ శివకుమార్, దివాకర్‌ల సాయంతో హిందూపురం ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు కూడా సంకోచించి కేసు విషయమై కర్నూలు, అనంతపురం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడగా.. తమ వద్ద ఐసోలేషన్ వార్డు లేదని చెప్పారు. చివరకు ఈ విషయం కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ దృష్టికి వెళ్లడంతో ప్రాథమిక చికిత్స కోసం అడ్మిట్ చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 31వ తేదీ నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్‌ఎంఓ శ్రీనివాసరెడ్డి, స్థానిక వైద్యుల పర్యవేక్షణలో శ్రీకాంత్‌కు చికిత్స అందించారు. అనంతరం మైసూరు డీఆర్‌డీఓ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రక్తనమూనాలు పంపగా అతడు కోలుకున్నట్లు వైద్యులు చెప్పడంతో గురువారం శ్రీకాంత్‌ను డిశ్చార్జ్ చేశారు. నెల రోజుల పాటు వాడాల్సిన మందులను ఇచ్చి పంపారు. కొడుకు అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆనందంలో ముగినిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు వైద్యులతో పాటు నర్సులు ఇందిరా, శ్యామలమ్మ, ఖుర్షీద్‌బేగం, అటెండర్ లక్ష్మినారాయణను సన్మానించారు.
ఈ సమయంలో ఉద్వేగానికి లోనైన వైద్యులు.. ఇకపై మరింత బాధ్యతతో పని చేస్తామని చెప్పారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి భవిష్యత్‌లో మంచి శాస్త్రవేత్త అయి ఆంత్రాక్స్ వ్యాధిపై రీసెర్స్ చేయాలని శ్రీకాంత్‌కు సూచించారు. వ్యాధి బారి నుంచి శ్రీకాంత్ పూర్తిగా కోలుకున్నాడని, అపోహలను నమ్మకుండా అందరిలో ఒక్కడిగా శ్రీకాంత్‌ను చూసుకోవాలన్నారు. ఈ విషయమై తహశీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు.
ఆంత్రాక్స్ నుంచి పూర్తిగా కోలుకున్న విద్యార్థి
Published Fri, Nov 28 2014 2:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement