
అగర్తలా: కర్ణాటక రంజీ జట్టు కెప్టెన్, భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. శుక్రవారం నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం మంగళవారం సాయంత్రం అగర్తలా నుంచి సూరత్ బయలుదేరేందుకు మయాంక్ విమానం ఎక్కాడు. తాను కూర్చున్న సీటు ముందు ప్లాస్టిక్ కవర్‌లో ఉంచిన హానికారక ద్రవ్యాన్ని నీళ్లనుకొని మయాంక్ తాగాడు.
ఆ వెంటనే అతని నోరు వాచిపోయి బొబ్బలు రావడంతో మాట్లాడలేకపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో వెంటనే విమానాన్ని ఆపి అతడిని ఆసుపత్రికి తరలించారు. రోజంతా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మయాంక్ బుధవారం సాయంత్రంకల్లా కోలుకోవడంతో అతడిని డిశ్చార్జి చేశారు.