
బీసీసీఐ అగ్రహానికి గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఇషాన్ కిషన్ రాబోయే దేశీవాళీ క్రికెట్ సీజన్‌లో జార్ఖండ్ తరపున ఆడనున్నట్లు సమాచారం.
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో జార్ఖండ్ కెప్టెన్‌గా కిషన్ వ్యవహరించే అవకాశముందని క్రిక్‌బజ్ తెలిపింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌కు సంబంధించి 25 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ జట్టులో కిషన్ పేరును ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్.. వ్యక్తిత కారణాలతో సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు.
కానీ సెలక్టర్ల ఆదేశాలను కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడి స్ధానంలో ఆసీస్ సిరీస్‌కు ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా కిషన్ దేశీవాళీ క్రికెట్ ఆడలేదు. దేశీ వాళీ క్రికెట్ కాకుండా ఐపీఎల్-2024 కోసం ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ఆంశాలు బీసీసీఐ అగ్రహాం తెప్పించాయి.
దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి జాతీయ జట్టు ఎంపికలో కిషన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కిషన్ చివరగా భారత్ తరపున 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు.
ఇప్పుడు మళ్లీ భారత తరపున రీ ఎంట్రీ ఇవ్వాలంటే దేశీవాళీ క్రికెట్‌లో ఆడటమే కిషన్ ముందున్న ఏకైక ఆప్షన్. ఈ క్రమంలోనే కిషన్ రంజీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దులీప్ ట్రోఫీకి మాత్రం కిషన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడంట.
Comments
Please login to add a commentAdd a comment