మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్
కేజీహెచ్‌లో 13 మందికి చికిత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. తాజాగా హుకుంపేట మండలం పనసపుట్టుకు చెందిన 13 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కేజీహెచ్‌లో చేరారు. వివ రాలిలా ఉన్నాయి. పనసపుట్టులో ఇటీవల కొంతమంది గిరిజనులు చనిపోయిన మేక మాంసాన్ని తిన్నారు. దీంతో చేతి వేళ్లపై పొక్కుల్లా వచ్చాయి. వీరు పాడేరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడ వైద్యులు వీరికి ఆంత్రాక్స్ సోకినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. అనంతరం వీరిని మంగళవారం రాత్రి విశాఖ కేజీహెచ్‌కు తీసుకువచ్చారు.
వీరిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఒక బాలుడు ఉన్నారు. వీరిని కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల చికిత్స వార్డులో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బాధితులకు చర్మవ్యాధుల చికిత్స విభాగాధిపతి డాక్టర్ అనీలా నాయర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. వీరి శరీరం నుంచి శాంపిళ్లను తీసి పరీక్షలకు పంపుతామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌బాబు తెలిపారు.