
పాడేరు ప్రాంతంలో దట్టంగా కురుస్తున్న పొగమంచు
సాక్షి, పాడేరు: చలి తీవ్రతకు మన్యం ప్రాంతం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పొగమంచు, చలిగాలుల తీవ్రత పెరగడంతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. అరకులోయలోని కేంద్ర కాఫీబోర్డు వద్ద సోమవారం ఉదయం 8.6 డిగ్రీలు, పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో ఆదివారం 10 డిగ్రీలు, అరకులోయలో 15.2 డిగ్రీలు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఒక్కరోజులోనే మినుములూరు మినహా, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి చలిగాలులు పెరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రత పెరగడంతో స్థానికులతోపాటు ఏజెన్సీని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం 10గంటల వరకు అరకులోయ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, చింతపల్లి ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. పది గంటల తర్వాతే సూర్యుడు కనిపించాడు. పొగమంచు కారణంగా లంబసింగి, పాడేరు, అనంతగిరి, దారకొండ, రంపుల, మోతుగూడెం, మారేడుమిల్లి ఘాట్‌రోడ్లలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment