visakha KGH
-
కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేజీహెచ్‌లో కోవిడ్–19 వ్యాక్సిన్.. కోవీషీల్డ్ ట్రయల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసిన సంగతి తెలిసిందే. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా కేజీహెచ్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు శ్రీకారం చుట్టాయి. తొలి రోజు ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ పర్యవేక్షణలో కేజీహెచ్‌లో ముగ్గురు (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) ఆరోగ్యవంతులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన 57, 90, 180వ రోజుల్లో వారి నుంచి రక్త నమూనాలు సేకరించి.. వారి పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తారు. -
పునర్జన్మనిచ్చారు!
‘ఆ రోజు రాత్రి అమ్మ దగ్గర పడుకున్నాను. మధ్య రాత్రిలో ఏదో వాసనకు మెలకువొచ్చింది. ఊపిరాడలేదు. ఒళ్లంతా మంటలు.. నోట్లోంచి నురగలొచ్చేస్తున్నాయి. తమ్ముడికీ అంతే. చచ్చిపోతున్నామా అమ్మా? అని ఏడ్చాను. అంతా బయటకొచ్చేశాం. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. స్పృహ వచ్చాక హాస్పిటల్ బెడ్‌మీద ఉన్నాం. డాక్టర్లు మమ్మల్ని బతికించారు’ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పదేళ్ల పీతల లాస్య సంతోషంతో చెప్పిన మాటలివి. ‘గ్యాస్ పీల్చడం వల్ల నాకు, నా భర్త, ఇద్దరు పిల్లలు చేతన (14), చిన్మయి (9)లకు వాంతులయ్యాయి. కాసేపటికి స్పృహ కోల్పోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. స్పృహలోకి వచ్చాక మేం బతికినా.. చావుకు దగ్గర్లో ఉన్నామనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన వైద్యం అందేలా చేసింది. డాక్టర్లు పగలూ, రాత్రి ప్రత్యేక చికిత్స చేయడంతో మా బిడ్డలు బతికారు’ అని పేడాడ నారాయణమ్మ చెమర్చిన కళ్లతో చెప్పింది. కోలుకున్న ఇద్దరు కూతుళ్లతో నారాయణమ్మ సాక్షి, విశాఖపట్నం: లాస్య, నారాయణమ్మే కాదు.. విషవాయువు బారినపడి విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులందరిదీ ఒకే మాట. మా బిడ్డలకు వైద్యులు పునర్జన్మనిచ్చారంటూ ఆనందంతో చెబుతున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల్లో ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చికిత్స చేయడంతో వీరంతా వైద్యులను దేవుళ్లతో పోలుస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారంటూ నిండైన హృదయాలతో కృతజ్ఞతలు చెబుతున్నారు. 17 మంది డిశ్చార్జ్ ► స్టైరీన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఆర్.ఆర్. వెంకటాపురానికి చెందిన 585 మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 54 మంది చిన్నారులకు కేజీహెచ్ పిల్లల వార్డులో వైద్యం అందిస్తున్నారు. ► ఇందులో ఆదివారం నాటికి 17 మంది పిల్లలను డిశ్చార్జ్ చేశారు. నలుగురికి న్యుమోనియా లక్షణాలుండడంతో వారిని ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం చేస్తున్నారు. ► ఏ ఒక్కరి ప్రాణం పోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కేజీహెచ్ వైద్యులు అన్ని అత్యవసర చర్యలు చేపట్టారు. రేయింబవళ్లు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సు చొప్పున నియమించారు. ► ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. బాధిత పిల్లలందరికీ నిరంతరం మూత్ర, రక్త పరీక్షలను నిర్వహించారు. అవసరమైన మందులను అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. ► ఫలితంగా రెండు మూడు రోజులకే చిన్నారులంతా కోలుకున్నారు. మిగిలిన పిల్లలనూ రెండు మూడు రోజుల్లోనే ఇంటికి పంపించి వేస్తామని వైద్యులు చెబుతున్నారు. ► ఆస్పత్రిలో తమ బిడ్డలకు మంచి వైద్యంతోపాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పారు. మూడు రోజుల్లోనే కోలుకున్నారు నేను.. నా ఇద్దరు పిల్లలు దీపు (12), భవ్య (9) గ్యాస్ పీల్చి వాంతులు చేసుకుని, నురగలు కక్కుతూ పడిపోయాం. ఆ రోజు ఉదయాన్నే 108లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. పిల్లల పరిస్థితి చూస్తే బతుకుతారన్న ఆశ కనిపించలేదు. మంచి వైద్యం అందించడంతో మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. ఈ రోజు డిశ్చార్జి ఇచ్చారు. సంతోషంగా వెళ్తున్నాం. వైద్యులకు, తక్షణమే స్పందించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – ఈసంశెట్టి భారతి, ఆర్.ఆర్. వెంకటాపురం పిల్లలంతా సేఫ్ స్టైరీన్ గ్యాస్ పీల్చడం వల్ల ప్రాణాపాయ స్థితిలో కొందరు, ఆపస్మారక స్థితిలో మరికొందరు ఆస్పత్రిలో చేరారు. 24 గంటలూ నిపుణులైన పిల్లల వైద్యులతో చికిత్స అందించాం. మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సును నియమించాం. తక్షణమే ప్రత్యేక వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా వెంటిలేటర్లను సిద్ధం చేసినా వాటి అవసరం పిల్లలెవరికీ రాలేదు. పిల్లలు ఇంటికి వెళ్లాక న్యుమోనియా రాకుండా మందులిస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే ఆస్పత్రి తీసుకు రావాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం. – డాక్టర్ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
ఆ రసాయనాన్ని కొన్నారా?
-
ప్రాణాలు తీసిన రసాయనం!
సాక్షి, విశాఖపట్నం/గాజువాక : చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే కుటుంబాల్లో విప్పసారా రూపంలోని విషపూరిత రసాయనం తీవ్ర విషాదం నింపింది. ఎప్పట్నుంచో నిషాకు అలవాటుపడిన ఆ బడుగు జీవులు తాము సేవిస్తున్నది విషమని గమనించలేకపోయారు. రోజంతా కష్టపడ్డ శ్రమను గుక్కెడు సారాతో మరచిపోవచ్చని భావించారే తప్ప అది తమను శాశ్వత నిద్రలోకి తీసుకెళ్తుందని ఊహించలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇంకో 11మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. విశాఖ నగర శివారు పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో చోటుచేసుకున్న ఈ విషాదంపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీకి చెందిన వారు చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తుంటారు. ఎప్పటిలాగే కాలనీకి చెందిన వాడపల్లి అంకమ్మ శనివారం సాయంత్రం సమీపంలోని డంపింగ్ యార్డుకు చిత్తు కాగితాల కోసం వెళ్లింది. అక్కడ తుప్పల మాటున నల్లని ప్లాస్టిక్ డబ్బా (20 లీటర్ల సామర్థ్యం) కనిపించడంతో దాని మూతతెరచి వాసన చూసింది. విప్ప సారాగా భావించి ఆ డబ్బాను ఇంటికి తీసుకొచ్చింది. రాత్రి తన మామ వాడపల్లి అప్పడు (75), అతని చెల్లెలు పెండ్ర అప్పాయమ్మ (70)లకు ఇచ్చి ఆమె కూడా తాగింది. సమీప బంధువులు ఆసనాల కొండోడు, ఆసనాల చిన్నారావు, ఆసనాల రమణమ్మ, పెండ్ర లోవరాజు సహా మరో 20 మంది వరకు ఇచ్చింది. వారంతా రాత్రి తాగి నిద్రించారు. వీరిలో కొందరు వాంతులు చేసుకున్నారు. ఉదయానికి పెండ్ర అప్పాయమ్మ మృతి చెందింది. ఈమె అనారోగ్యంతో చనిపోయిందనుకుని దహన సంస్కారాలు కూడా పూర్తి చేసేశారు. ఆ కాసేపటికి అప్పడు కూడా చనిపోయాడు. ఆందోళనతో కాలనీ వాసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వీరిలో అంకమ్మను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి, కొండోడుతో పాటు మిగతా వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యంలో కొండోడు కూడా మరణించాడు. వీరిలో ఆసనాల రమణమ్మ, ఆసనాల చిన్నారావుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆదివారం రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 11కి చేరింది. ఆ రసాయనాన్ని కొన్నారా? ఈ ఘటనలో రసాయన డబ్బా దొరకడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాగుడు అలవాటు ఉన్న కాలనీ వాసులు మద్యంతో పాటు మత్తెక్కించే ద్రావణాలను రహస్యంగా సేవిస్తారని తెలుస్తోంది. తనకు డంపింగ్ యార్డులో రసాయన డబ్బా దొరికిందని, అది విప్ప సారాగా భావించి తీసుకొచ్చానని కాలనీ వాసులకు అంకమ్మ చెప్పింది. అయితే, దీనిని తాగిన మరికొందరు బాధితులు తాము వంద రూపాయల చొప్పున కొనుగోలు చేశామని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులతో పాటు కేజీహెచ్ వైద్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంకమ్మ చెబుతున్నట్టు డంపింగ్ యార్డులో దొరికిందా? లేక కొన్నాళ్లుగా ఎవరైనా కాలనీ వాసులకు విప్పసారా పేరిట మత్తునిచ్చే ఇతర ద్రావణాలను తెచ్చి విక్రయిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. పరీక్షకు రసాయనం.. కాగా, ఎక్సైజ్ అధికారులు ఆ ద్రావణాన్ని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. ఆదివారం రాత్రి వరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అది పరిశ్రమలకు వినియోగించే నాన్‌పోటబుల్ కెమికల్గా తేల్చారు. పూర్తిస్థాయి నివేదిక సోమవారం వస్తుందని ఎక్సైజ్ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మద్యంలో పోటబుల్ లిక్కర్‌ను మాత్రమే వాడతారని తెలిపారు. బాధితులకు పరామర్శ స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఏసీపీ ప్రవీణ్‌కుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్‌లు సందర్శించారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ కె.భాస్కర్, ఎక్సైజ్ డీసీ టి.శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు. ఈ రసాయనం ప్రాణాంతకమైనదే.. బాధితులు సేవించినది స్పిరిట్లాంటి ప్రాణాంతక రసాయనంగా భావిస్తున్నాం. ఇందులో మత్తు కలిగించే ఆల్కహాల్ కూడా ఉండడంవల్ల దీనిని సేవించిన వారికి కిక్కు ఇస్తుంది. ఇలాంటి రసాయనాలు పరిశ్రమల్లో వాడతారు. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసి దీనిని తాగామని బాధితులు చెబుతున్నారు. మత్తు, న్యూరో వైద్యులతో నిరంతర వైద్యం అందిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. – డా. జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్
కేజీహెచ్‌లో 13 మందికి చికిత్స సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. తాజాగా హుకుంపేట మండలం పనసపుట్టుకు చెందిన 13 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కేజీహెచ్‌లో చేరారు. వివ రాలిలా ఉన్నాయి. పనసపుట్టులో ఇటీవల కొంతమంది గిరిజనులు చనిపోయిన మేక మాంసాన్ని తిన్నారు. దీంతో చేతి వేళ్లపై పొక్కుల్లా వచ్చాయి. వీరు పాడేరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడ వైద్యులు వీరికి ఆంత్రాక్స్ సోకినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. అనంతరం వీరిని మంగళవారం రాత్రి విశాఖ కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. వీరిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఒక బాలుడు ఉన్నారు. వీరిని కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల చికిత్స వార్డులో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బాధితులకు చర్మవ్యాధుల చికిత్స విభాగాధిపతి డాక్టర్ అనీలా నాయర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. వీరి శరీరం నుంచి శాంపిళ్లను తీసి పరీక్షలకు పంపుతామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌బాబు తెలిపారు. -
పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం
-
మరపురాని విషాదం
వంగర : చిన్న నిర్లక్ష్యం ఏడుగురు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పొట్టకూటికోసం బాణసంచా పనికి వెళ్తే ప్రాణాల మీదకు వస్తుందని తెలియక మృత్యుపంజరంలో చిక్కుకున్నారు. మండలంలోని కొత్తమరువాడలో ఈ నెల 15న జరిగిన బాణాసంచా పేలుడులో గాయపడిన వారంతా మృతిచెందారు. క్షతగాత్రుల శరీర భాగాలు పూర్తిగా కాలిపోవడంతో మృత్యువుతూ పోరాడుతూ విశాఖ కేజీహెచ్‌లో మరణించగా, ఆఖరుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గేదెల పోలీసుల కూడా బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ కుటుంబంలో ఆయనతోపాటు తల్లి గేదెల రాములమ్మ, కొడుకు గేదెల శ్రీను, సోదరుడు గేదెల భాస్కరరావు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరు కాకుండా మరో ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు కూడా వీధిన పడ్డాయి. పోలీసు కుటుంబంలో ఉన్న మగవారంతా మృతిచెందారు. 18 ఏళ్ల కుమార్ మినహా ఆ నాలుగు కుటుంబాల్లో మగవారన్నవారు లేకుండా పోయారు. రెండు ఇళ్లుతోపాటు సర్వం కాలిబూడిదయ్యాయి. శోకసంద్రంలో గ్రామం కొత్తమరువాడ దుర్ఘటనలో క్షతగాత్రులంతా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాయపడిన ఏ ఒక్కరూ బతకకపోవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రి వద్ద వారి రోదనలు మిన్నంటాయి. వారిని చూసిన వారంతా కంటతడిపెడుతున్నారు. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. పొట్టకూటి కోసం చేసే కూలి పని ప్రాణాల మీదకు తెచ్చిందని, జీవనాధారమైన ఇళ్లు, గృహోపకరణ వస్తువులు, తిండిగింజలతోపాటు, విలువైన ధ్రువపత్రాలు కాలి బూడిదయ్యాయని వాపోతున్నారు. బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని స్థానికులు, బాధితులు వేడుకుంటున్నారు. -
రెండురోజుల పసికందు అపహరణ
విశాఖ : విశాఖ కేజీహెచ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కేజీహెచ్‌లో రెండు రోజుల పసికందు అదృశ్యమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఓ మగ శిశువు అపహరణకు గురైంది. దాంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బంధువులపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కేజీహెచ్‌లో సీసీ కెమెరాలు కూడా పనిచేయక పోవడంతో శిశువును ఎవరు అపహరించారనే పోలీసులు విచారణ ప్రారంభించారు. -
కేజీహెచ్ పిల్లలవార్డులో దొంగల బీభత్సం
విశాఖ : విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డులో దొంగలు గురువారం బీభత్సం సృష్టించారు. సిబ్బందిని గాయపర్చి పిల్లలను ఎత్తుకు వెళ్లేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. సిబ్బందితో పాటు, పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిఘటించటంతో దొంగలు పరారయ్యారు. ఈ సందర్భంగా పిల్లల బంధువులపై దుండగులు దాడికి ప్రయత్నించారు. కాగా నిన్న మొన్నటి వరకూ పిల్లల వార్డులో కుక్కలు యధేచ్చగా వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా పిల్లలనే ఎత్తుకు పోయేందుకు యత్నించటం కలకలం సృష్టించింది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.