చిన్న నిర్లక్ష్యం ఏడుగురు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పొట్టకూటికోసం బాణసంచా పనికి వెళ్తే ప్రాణాల మీదకు వస్తుందని తెలియక మృత్యుపంజరంలో చిక్కుకున్నారు.
వంగర : చిన్న నిర్లక్ష్యం ఏడుగురు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పొట్టకూటికోసం బాణసంచా పనికి వెళ్తే ప్రాణాల మీదకు వస్తుందని తెలియక మృత్యుపంజరంలో చిక్కుకున్నారు. మండలంలోని కొత్తమరువాడలో ఈ నెల 15న జరిగిన బాణాసంచా పేలుడులో గాయపడిన వారంతా మృతిచెందారు. క్షతగాత్రుల శరీర భాగాలు పూర్తిగా కాలిపోవడంతో మృత్యువుతూ పోరాడుతూ విశాఖ కేజీహెచ్‌లో మరణించగా, ఆఖరుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గేదెల పోలీసుల కూడా బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ కుటుంబంలో ఆయనతోపాటు తల్లి గేదెల రాములమ్మ, కొడుకు గేదెల శ్రీను, సోదరుడు గేదెల భాస్కరరావు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరు కాకుండా మరో ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు కూడా వీధిన పడ్డాయి. పోలీసు కుటుంబంలో ఉన్న మగవారంతా మృతిచెందారు. 18 ఏళ్ల కుమార్ మినహా ఆ నాలుగు కుటుంబాల్లో మగవారన్నవారు లేకుండా పోయారు. రెండు ఇళ్లుతోపాటు సర్వం కాలిబూడిదయ్యాయి.
శోకసంద్రంలో గ్రామం
కొత్తమరువాడ దుర్ఘటనలో క్షతగాత్రులంతా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాయపడిన ఏ ఒక్కరూ బతకకపోవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రి వద్ద వారి రోదనలు మిన్నంటాయి. వారిని చూసిన వారంతా కంటతడిపెడుతున్నారు.
బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. పొట్టకూటి కోసం చేసే కూలి పని ప్రాణాల మీదకు తెచ్చిందని, జీవనాధారమైన ఇళ్లు, గృహోపకరణ వస్తువులు, తిండిగింజలతోపాటు, విలువైన ధ్రువపత్రాలు కాలి బూడిదయ్యాయని వాపోతున్నారు. బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని స్థానికులు, బాధితులు వేడుకుంటున్నారు.