పునర్జన్మనిచ్చారు! | Visakha Gas Leakage Victims Praises KGH Doctors | Sakshi
Sakshi News home page

పునర్జన్మనిచ్చారు!

Published Mon, May 11 2020 4:20 AM | Last Updated on Mon, May 11 2020 5:09 AM

Visakha Gas Leakage Victims Praises KGH Doctors - Sakshi

తమ్ముడు, పిన్నిలతో పీతల లాస్య

‘ఆ రోజు రాత్రి అమ్మ దగ్గర పడుకున్నాను. మధ్య రాత్రిలో ఏదో వాసనకు మెలకువొచ్చింది. ఊపిరాడలేదు. ఒళ్లంతా మంటలు.. నోట్లోంచి నురగలొచ్చేస్తున్నాయి. తమ్ముడికీ అంతే. చచ్చిపోతున్నామా అమ్మా? అని ఏడ్చాను. అంతా బయటకొచ్చేశాం. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. స్పృహ వచ్చాక హాస్పిటల్‌ బెడ్‌మీద ఉన్నాం. డాక్టర్లు మమ్మల్ని బతికించారు’ కేజీహెచ్‌ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పదేళ్ల పీతల లాస్య సంతోషంతో చెప్పిన మాటలివి.

‘గ్యాస్‌ పీల్చడం వల్ల నాకు, నా భర్త, ఇద్దరు పిల్లలు చేతన (14), చిన్మయి (9)లకు వాంతులయ్యాయి. కాసేపటికి స్పృహ కోల్పోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. స్పృహలోకి వచ్చాక మేం బతికినా.. చావుకు దగ్గర్లో ఉన్నామనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన వైద్యం అందేలా చేసింది. డాక్టర్లు పగలూ, రాత్రి ప్రత్యేక చికిత్స చేయడంతో మా బిడ్డలు బతికారు’ అని పేడాడ నారాయణమ్మ చెమర్చిన కళ్లతో చెప్పింది. 
కోలుకున్న ఇద్దరు కూతుళ్లతో నారాయణమ్మ   

సాక్షి, విశాఖపట్నం: లాస్య, నారాయణమ్మే కాదు.. విషవాయువు బారినపడి విశాఖ కేజీహెచ్‌ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులందరిదీ ఒకే మాట. మా బిడ్డలకు వైద్యులు పునర్జన్మనిచ్చారంటూ ఆనందంతో చెబుతున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల్లో ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చికిత్స చేయడంతో వీరంతా వైద్యులను దేవుళ్లతో  పోలుస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారంటూ నిండైన హృదయాలతో కృతజ్ఞతలు చెబుతున్నారు. 

17 మంది డిశ్చార్జ్‌
► స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ కారణంగా ఆర్‌.ఆర్‌. వెంకటాపురానికి చెందిన 585 మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 54 మంది చిన్నారులకు కేజీహెచ్‌ పిల్లల వార్డులో వైద్యం అందిస్తున్నారు.
► ఇందులో ఆదివారం నాటికి 17 మంది పిల్లలను డిశ్చార్జ్‌ చేశారు. నలుగురికి న్యుమోనియా లక్షణాలుండడంతో వారిని ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం చేస్తున్నారు. 
► ఏ ఒక్కరి ప్రాణం పోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో కేజీహెచ్‌ వైద్యులు అన్ని అత్యవసర చర్యలు చేపట్టారు. రేయింబవళ్లు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సు చొప్పున నియమించారు. 
► ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. బాధిత పిల్లలందరికీ నిరంతరం మూత్ర, రక్త పరీక్షలను నిర్వహించారు. అవసరమైన మందులను అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు.
► ఫలితంగా రెండు మూడు రోజులకే చిన్నారులంతా కోలుకున్నారు. మిగిలిన పిల్లలనూ రెండు మూడు రోజుల్లోనే ఇంటికి పంపించి వేస్తామని వైద్యులు చెబుతున్నారు. 
► ఆస్పత్రిలో తమ బిడ్డలకు మంచి వైద్యంతోపాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పారు.

మూడు రోజుల్లోనే కోలుకున్నారు
నేను.. నా ఇద్దరు పిల్లలు దీపు (12), భవ్య (9) గ్యాస్‌ పీల్చి వాంతులు చేసుకుని, నురగలు కక్కుతూ పడిపోయాం. ఆ రోజు ఉదయాన్నే 108లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. పిల్లల పరిస్థితి చూస్తే బతుకుతారన్న ఆశ కనిపించలేదు. మంచి వైద్యం అందించడంతో మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. ఈ రోజు డిశ్చార్జి ఇచ్చారు. సంతోషంగా వెళ్తున్నాం. వైద్యులకు, తక్షణమే స్పందించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. 
– ఈసంశెట్టి భారతి, ఆర్‌.ఆర్‌. వెంకటాపురం

పిల్లలంతా సేఫ్‌
స్టైరీన్‌ గ్యాస్‌ పీల్చడం వల్ల ప్రాణాపాయ స్థితిలో కొందరు, ఆపస్మారక స్థితిలో మరికొందరు ఆస్పత్రిలో చేరారు. 24 గంటలూ నిపుణులైన పిల్లల వైద్యులతో చికిత్స అందించాం. మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సును నియమించాం. తక్షణమే ప్రత్యేక వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా వెంటిలేటర్లను సిద్ధం చేసినా వాటి అవసరం పిల్లలెవరికీ రాలేదు. పిల్లలు ఇంటికి వెళ్లాక న్యుమోనియా రాకుండా మందులిస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే ఆస్పత్రి తీసుకు రావాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం.  
– డాక్టర్‌ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement