ఆర్థిక సాయం.. గ్రీష్మ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం పత్రాలు అందజేస్తున్న మంత్రులు
పరిహారం కోసం పడిగాపులు లేవు..కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి లేదు..ప్రజా ప్రతినిధుల రికమండేషన్లతో పనిలేదు..ప్రాణాలకు వెలకట్టే వ్యాపారిలా కాకుండా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ప్రభుత్వం నిలబడింది! మానిపోని గాయానికి మానసిక స్థైర్యాన్ని అందిస్తూ..బాధితులకు భరోసా కల్పిస్తూ బాసటగా నిలిచింది. ఘటన జరిగిన రోజే ప్రకటించిన పరిహారాన్ని కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే అందించి ఆదుకుంది. కన్నీటి సుడులు తిరుగుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలబడ్డారు.
సాక్షి, విశాఖపట్నం: విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు దేశంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోనంత సాయాన్ని అందచేసి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన దానికంటే రెట్టింపు పరిహారం ఇస్తామని విశాఖలో దుర్ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేవలం ఐదు రోజుల్లోనే బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఆదివారమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సోమవారం అందచేశారు.
బాధిత కుటుంబాలకు భరోసా..
విశాఖ కేజీహెచ్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబుతోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ వి.వినయ్‌చంద్ కలిసి మృతుల కుటుంబాలకు అకౌంట్‌లల్లో నగదు జమ చేశారు. పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంబంధిత పత్రాలతోపాటు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖను కూడా అందించారు. తొలి విడతగా మృతుల చట్టబద్థ వారసులుగా నిర్థారించిన 8 మందికి ఒకొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు.
బాధితులందరినీ ఆదుకుంటామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రులు అన్ని విధాలా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మాటగా భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అదనపు డీజీపీ రాజీవ్‌కుమార్ మీనా, ఏఎంపీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ పాల్గొన్నారు.
కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు: మంత్రి బొత్స
► ఎల్‌జీ పాలిమర్స్ సమీప గ్రామాల్లో నీటి నమూనాలను పరీక్షల కోసం పుణె ల్యాబ్‌కు పంపాం. సుమారు 500 మంది సిబ్బందితో గ్రామాల్లో శానిటైజేషన్ నిర్వహిస్తున్నాం.
► గ్యాస్ లీకేజీ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను నియమించాం. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయి.
► ఈ ప్రభుత్వానికి ప్రజలపైనే ప్రేమ ఉంటుంది. కంపెనీలపై కాదు.
► గత సర్కారు చేసిన తప్పిదాలను మా ప్రభుత్వం సరిదిద్దుతోంది.
► టీడీపీ సర్కారు ఇచ్చిన అనుమతుల కారణంగానే ఆ కంపెనీ పనిచేస్తోంది.
గ్రామాల్లో మెడికల్ క్యాంప్ : మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్
► స్టైరీన్ గ్యాస్ పూర్తిగా అదుపులో ఉంది. ఇప్పటికే ఐదు గ్రామాలను మేమంతా పరిశీలించాం. జీవీఎంసీ 500 మంది సిబ్బందితో అణువణువు శుభ్రం చేస్తోంది.
► సాయంత్రం గ్రామాల్లోకి వచ్చిన ప్రజలందరికీ భోజన వసతి కల్పిస్తున్నాం.
► ప్రజల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది.
► గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాం.
అనుమతులిచ్చింది గత సర్కారే: మంత్రి కన్నబాబు
► గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కారణంగానే ఎల్‌జీ పాలిమర్స్‌లో లీకేజీ ఘటన సంభవించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
► రూ.కోటితో మృతి చెందిన వారి ప్రాణాలు తీసుకురాలేం కానీ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలనే గొప్ప మనసుతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
► అస్వస్థతకు గురైన వారందరిని మంగళవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. డిశ్చార్జి అయిన వారికి గ్రామ వలంటీర్లే నేరుగా ఇంటికి వెళ్లి పరిహారం అందజేస్తారు.
► నిపుణుల సలహా మేరకు ఐదు గ్రామాల్లో శానిటైజేషన్ చేయించాం. ట్యాంక్‌లో విషవాయువులు సాధారణ స్థితికి వచ్చాయి. ప్రజలెవరూ అధైర్యపడొద్దు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది.
బాధిత గ్రామాల్లో మంత్రుల బస
విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెప్పేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి గ్రామాల్లోనే బస చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బి. సత్యవతి బాధిత గ్రామాల్లో రాత్రంతా ప్రజలతో పాటునిద్రపోయారు. అంతకుముందు బాధిత గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో చేపడుతున్న చర్యలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా,ఎల్‌జీ పాలిమర్స్ ఘటన నుంచి కోలుకొని గ్రామాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వం సోమవారం రాత్రి భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది. మంత్రుల నేతృత్వంలో నాణ్యమైన భోజనాన్ని అందించారు. వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో ఐదు గ్రామాల్లోనూ ప్రజలకు భోజనం పెట్టారు. ప్రజలతో కలిసే మంత్రులు కూడా భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment