అప్పుడలా.. ఇప్పుడిలా | Chandrababu Comments On AP Govt With His Political Intention | Sakshi
Sakshi News home page

అప్పుడలా.. ఇప్పుడిలా

Published Sat, May 9 2020 4:11 AM | Last Updated on Sat, May 9 2020 4:11 AM

Chandrababu Comments On AP Govt With His Political Intention - Sakshi

సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు కేవలం తన షూటింగ్‌ వ్యామోహం, సర్కారు  వైఫల్యం వల్ల గోదావరి పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేందుకు సైతం మనస్కరించని చంద్రబాబు ఇప్పుడు విశాఖలో గ్యాస్‌ లీకేజీ మృతుల కుటుంబాలకు సీఎం జగన్‌ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం చాలదని వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇప్పటివరకు ప్రమాదాలు, విపత్తుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇంత భారీగా పరిహారాన్ని ప్రకటించిన దాఖలాలు లేవని, సీఎం జగన్‌ మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరని అన్ని వర్గాలు పేర్కొంటుండగా చంద్రబాబు దాన్ని స్వాగతించకపోగా విమర్శలకు దిగడంపై సొంత పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన నివాసానికి కూతవేటు దూరంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడంతో కృష్ణా నదిలో పడవ మునిగి మృత్యువాత పడ్ద వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారంతో సరిపుచ్చారు. కానీ ఇప్పుడు విశాఖలో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం, ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్‌ కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తే విమర్శలకు దిగడం, దీన్ని చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నించడం ద్వారా చంద్రబాబు తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రాణాలు, ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని నిరూపించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందలేని చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్‌ ప్రభుత్వం చేసిన మంచి పనులను స్వాగతించకపోగా విమర్శించడం విపక్ష నేత రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. నిజానికి చంద్రబాబు విమర్శల వెనుక ఒకింత అసూయ కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశానని చెప్పుకునే ఆయన ఎప్పుడూ బాధితుల పట్ల ఈ స్థాయిలో ఉదారం చూపలేదు. 

బాబు హయాంలో బాధితులకు తూతూ మంత్రమే
► చంద్రబాబు సీఎంగా ఉండగా 2014 అక్టోబర్‌ లో హుద్‌హుద్‌ తుపాను విశాఖపట్నాన్ని అతలా కుతలం చేయగా 46 మంది మృత్యువాతపడ్డారు. అప్పుడు వారి కుటుం బాలకు కేవలం రూ.ఐదు లక్షలే ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. 
► 2015 జులైలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు తన షూటింగ్‌ కోసం భక్తుల్ని ఆపివేయడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోతే వారికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేవలం తన పబ్లిసిటీ పిచ్చి, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా వారిపై కనికరం చూపలేదు.
► 2017 నవంబర్‌లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో బోటు మునిగి 21 మంది చనిపోతే రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ఘటన జరిగిన ప్రాంతం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ఉండటం, వరద ఉధృతి ఉన్నా బోటును అనుమ తించిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టమైనా బాధిత కుటుంబాలకు తూతూమం త్రంగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. 
► 2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా లో ఎనిమిది మంది చని పోగా కేవలం రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇచ్చి గొప్ప గా ప్రచారం చేసుకున్నారు. 
► 2018 మే నెలలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వాడపల్లి–మంటూరు వద్ద గోదావరి లో బోటు మునిగి 22 మంది చనిపోగా రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. 
► 2017లో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు, డ్రైవర్‌ చనిపోతే రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించినా చాలారోజులు దాన్ని వారికి ఇవ్వలేదు. 2018లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాంతం లో పాదయాత్ర చేసినప్పుడు బాధిత కుటుంబాలు ఆయన దృష్టికి ఈ విష యాన్ని తీసుకెళ్లడంతో చంద్ర బాబు వైఖరిని ఎండగట్టారు. దీంతో ఉలిక్కి పడ్డ చంద్రబాబు కేవలం రూ. రెండు లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి మిగి లిన రూ.మూడు లక్షలు ఎగ్గొట్టారు.
► 2014 జూన్‌లో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలి పలువురు మృత్యువాత పడగా చంద్రబాబు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గెయిల్‌ రూ.20 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున బాధితులకు ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement