కాలుష్య నివారణ మండలి క్రియాశీలకంగా ఉండాలి. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటి నివారణ, పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలి. విశాఖపట్నంలో ఇలాంటి విష వాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి.. అందులో జనావాసాల మధ్య ఉన్నవి ఎన్నో గుర్తించాలి.
విదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి వ్యవస్థలు ఏరకంగా స్పందిస్తాయో, ఏ రకంగా వ్యవహరిస్తాయో, అలాంటి స్పందనే ఇక్కడా కచ్చితంగా చూపాల్సి ఉంటుంది. అందుకనే మంచి మనసుతో.. ఉదారంగా స్పందించి పరిహారం ఇస్తున్నాం.
– సీఎం వైఎస్ జగన్
విశాఖలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఫ్యాక్టరీ ట్యాంక్‌లోని రసాయనంలో 60 శాతం పాలిమరైజ్ అయ్యింది. మిగిలిన 40 శాతం కూడా పాలిమరైజ్ అవుతోంది. ఇందుకు 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని మిగతా ట్యాంకులు భద్రంగా ఉన్నాయి.
– సీఎంతో సీఎస్, విశాఖ కలెక్టర్
సాక్షి, అమరావతి: విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని.. గ్యాస్ లీక్ వెనుక కారణాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతరం తీసుకున్నచర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
గట్టి చర్యలు తీసుకోవాలి
► ఈ తరహా దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విష వాయువులున్న పరిశ్రమలను జనావాసాల నుంచి తరలించడంపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలి.
► ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలను పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదా ఉన్న ముడి పదార్థాలను పూర్తిగా వినియోగించేలా ఇంజినీర్లతో మాట్లాడాలి.
► మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి.
క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష, సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
ఉదారంగా స్పందించాలి
► బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం పట్ల అధికారులు సీఎంను ప్రశంసించారు. దేశంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆదర్శంగా నిలిచారన్నారు.
► గతంలో తూర్పుగోదావరి జిల్లా నగరంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించానని సీఎం గుర్తు చేశారు.
► ఆ సందర్భంలో.. ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయో.. అదేరకంగా సహాయం చేయాలని డిమాండ్ చేశానన్నారు. మరణించిన కుటుంబాల వారికి భారీగా పరిహారం ఇవ్వాలని ఆరోజు తాను డిమాండ్ చేశానని చెప్పారు.
► ఈ సమయంలో ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. దేశంలో ఎక్కడోచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, అలాంటప్పుడు విదేశాల తరహా స్పందన కచ్చితంగా చూపాల్సి ఉంటుందన్నారు.
► ఈ సమీక్షలో ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్.. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా పాల్గొన్నారు. కాగా, నీరబ్ కుమార్ ప్రసాద్, వివేక్ యాదవ్ విశాఖకు బయలుదేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment