ఉక్కునగరికి ఊపిరి | Vizag Gas Leak AP Govt Re Enforcement Measures | Sakshi
Sakshi News home page

ఉక్కునగరికి ఊపిరి

Published Sat, May 9 2020 2:48 AM | Last Updated on Sat, May 9 2020 7:57 AM

Vizag Gas Leak AP Govt Re Enforcement Measures - Sakshi

విశాఖ కేజీహెచ్‌లో కోలుకున్న చిన్నారులతో కుటుంబ సభ్యులు, విశాఖలోని సుజాత నగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులు

సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌లో గురువారం వేకువజామున విషవాయువు లీకేజీతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ ఉక్కునగరం రాష్ట్ర ప్రభుత్వ సత్వర చర్యలతో రెండో రోజునే ఊపిరిపీల్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిపై ఆరా తీస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ఒక్కరోజులోనే ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.బాధితులకు సీఎం ప్రకటించిన నష్టపరిహారం కింద ప్రభుత్వం 24 గంటల్లోనే రూ.30 కోట్లను విడుదల చేసింది.

ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున.. వెంటిలేటర్లపై ఉన్న వారికి రూ.10 లక్షల చొప్పున తక్షణమే పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది. గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గుతేల్చేందుకు ఉన్నతస్థాయి (హైపవర్‌) కమిటీని కూడా నియమించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడంతోపాటు ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫార్సు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ నెలరోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేదా నిపుణులను సహాయకులుగా కమిటీ చైర్మన్‌ నియమించుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. విషవాయువు కారణంగా గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన వారు క్రమంగా కోలుకుంటున్నారని.. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన చర్యలు తీసుకోవడంతో రెండోరోజునే నగరంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.

వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మొత్తం 554 మందిలో 128 మంది శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారని.. మిగిలిన వారెవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇక ప్రమాదం జరిగిన స్థానిక గ్రామాల ప్రజలకు ఎటువంటి లోటు రానీయకుండా ప్రభుత్వం పెద్దఎత్తున ఆపన్న హస్తం అందిస్తోంది. పునరావాస కేంద్రాల్లో దాదాపు 15 వేల మందికి వసతి, నాణ్యమైన భోజనం ఏర్పాటుచేస్తున్నారు. జీవిఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. గ్యాస్‌ లీకేజి వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ.50 కోట్లను విశాఖ కలెక్టర్‌ వద్ద డిపాజిట్‌ చేయాలని ఎల్‌జీ పాలిమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశించింది. కంపెనీ నుంచి లీక్‌ అవుతున్న గ్యాస్‌లో గాఢతను, విష ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో నిపుణుల బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఖాళీచేసిన కంపెనీ పరిసర ఐదు గ్రామాల్లోకి ప్రజలను మరో రెండు రోజుల వరకూ ముందుజాగ్రత్త చర్యగా అనుమతించవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశించారు. 

నిపుణుల బృందం, పీటీబీసీ రాక
కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ కృషితో విషవాయువులను నియంత్రించేందుకు అవసరమైన కెమికల్స్‌ గుజరాత్‌ నుంచి ప్రత్యేక కార్గో విమానంలో గురువారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్నాయి. వీటితోపాటు పుణే, నాగపూర్‌ నుంచి తొమ్మిది మంది ప్రత్యేక నిపుణుల బృందం కూడా వచ్చింది. వీరు తీసుకొచ్చిన పారాటెరిటరీ బ్యూటెల్‌ కాటెకాల్‌ (పీటీబీసీ) అనే రసాయనిక పదార్థాన్ని గ్యాస్‌లో గాఢతను తగ్గించేందుకు వినియోగిస్తున్నారు. గురువారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో 122.5టీపీఎం స్థాయిలో విషవాయువు గాలిలో ఉంది. శుక్రవారం ఇది చాలావరకు తగ్గిందని.. జీరో స్థాయికి రావడానికి మరో 24గంటలు పడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, గ్యాస్‌ లీకేజీ ప్రదేశంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి 20 అగ్నిమాపక శకటాల ద్వారా నీటిని వెదజల్లుతున్నారు. (అప్పుడలా.. ఇప్పుడిలా)

కాలుష్యంపై ఎప్పటికప్పుడు తనిఖీ..
గాలిలో విషవాయువులు జీరో స్థాయికి చేరాయని, వాతావరణం పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. గాలిలో గ్యాస్‌ విష ప్రభావాన్ని పరిశీలించేందుకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి చెందిన మొబైల్‌ తనిఖీ యంత్రాన్ని ఎల్‌జీ కంపెనీ ప్రాంగణంలోనే ఉంచారు. కంపెనీ పరిసర గ్రామాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో జీరోగా నమోదైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కంపెనీ ప్రధాన ద్వారం, వెంకటాపురం గ్రామంలో మాత్రమే విషవాయువు జాడ ఉందని, దీన్ని కూడా మరో 24 గంటల్లో జీరోకి తీసుకురాగలమని జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, కంపెనీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామం వ్యూ 

మంత్రుల నిరంతర పర్యవేక్షణ
గ్యాస్‌ లీకేజీ బాధితులకు, ప్రభావిత గ్రామాల్లోని వారి ఆస్తులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. నీలం సాహ్ని విశాఖలోనే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చోరీలు జరుగుతున్నాయనే వదంతులు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందవద్దని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా ప్రజలకు విన్నవించారు. మరోవైపు.. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి గౌతంరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తదితరులు స్వయంగా ఎల్‌జీ కంపెనీకి వచ్చి లోపలంతా పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్‌ తదితర నాయకులు కూడా కంపెనీని సందర్శించారు. నీలం సాహ్ని, గౌతంరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కంపెనీ ప్రాంగణంలో సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 

12కు చేరుకున్న మృతులు
ఇదిలా ఉంటే.. గ్యాస్‌ లీకేజీతో అస్వస్థతకు గురైన 554 మందికి విశాఖ నగరంలోని కేజీహెచ్‌తో పాటు అపోలో, కిమ్స్‌ ఐకాన్‌ తదితర ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో శుక్రవారానికి 128 మంది కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 305 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో 52 మంది పిల్లలు ఉన్నారు. వైద్యం అందిస్తున్న తీరుతెన్నులను ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం సమీక్షించారు. ఇక ఈ çఘటనలో మృతుల సంఖ్య 12కి చేరుకుందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. గురువారం నాటికి 10 మంది చనిపోయారని, శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను గుర్తించి పోస్ట్‌మార్టం నిర్వహించామని చెప్పారు.

దుర్ఘటన కారణాలపై హైపవర్‌ కమిటీ విచారణ
దుర్ఘటనకు కారణాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ హైపవర్‌ కమిటీని నియమించారు. ఈ కమిటీ శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. కమిటీలో సభ్యుడైన పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకేజీలో పలు తప్పిదాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. అలారం మోగకపోవడంపైనా విచారిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ప్రమాదానికి కారణాలపై శోధించేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం కూడా శుక్రవారం వచ్చింది. (మళ్లీ జరగకూడదు : సీఎం వైఎస్‌ జగన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement