ఎల్‌జీ సీఈఓ అరెస్ట్‌ | LG Polymers Company CEO Arrested | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ సీఈఓ అరెస్ట్‌

Published Wed, Jul 8 2020 3:51 AM | Last Updated on Wed, Jul 8 2020 8:01 AM

LG Polymers Company CEO Arrested - Sakshi

జియోంగ్, ఎల్‌జీ పాలిమర్స్‌ సీఈఓ

సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: స్టైరీన్‌ గ్యాస్‌ ప్రమాద ఘటనకు సంబంధించి ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గోపాలపట్నం ప్రాంతంలో ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో మే 7వ తేదీన ఎల్‌జీ పాలీమర్స్‌ కంపెనీలో ఎమ్‌–6 స్టోరేజ్‌ ట్యాంక్‌ నుంచి స్టైరీన్‌ వాయువు లీకైన ఘటనలో స్థానికులు 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజునే వెంకటాపురం రెవెన్యూ అధికారి ఎంవీ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా పర్యవేక్షణలో పోలీసుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. కంపెనీపై కేసు నమోదు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై విచారణకు హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు రెండు నెలల పాటు అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపింది.

ప్రమాదానికి గత కారణాలతో నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసింది. నివేదిక ఇచ్చిన 24 గంటల్లోనే కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా మొత్తం 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. సరిగ్గా ప్రమాదం జరిగిన రెండు నెలల్లో పోలీసులు సైతం ప్రమాదానికి గల కారణాలపై అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా కంపెనీ ప్రతినిధుల నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్ధారణ అవడంతో ఎల్‌జీ పాలిమర్స్‌ సీఈఓ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుంకీ జియోంగ్, టెక్నికల్‌ డైరెక్టర్‌ డి.ఎస్‌.కిమ్, అడిషనల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) పి.పూర్ణచంద్రమోహన్‌ రావు, ఎస్‌ఎంహెచ్‌ ఇన్‌చార్జ్‌ హెచ్‌ఓడీ కె.శ్రీనివాస్‌ కిరణ్‌కుమార్, ప్రొడక్షన్‌ టీమ్‌ లీడర్‌ ఆర్‌.సత్యనారాయణ, ఇంజినీర్లు సీహెచ్‌  చంద్రశేఖర్, కె. గౌరీ శంకర నాగేంద్ర రాము, ఆపరేటర్‌ ఎం.రాజేష్,  నైట్‌ డ్యూటీ ఆఫీసర్‌ (ఆపరేషన్స్‌) పి.బాలాజీ, జీపీపీఎస్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌. అచ్యుత్, ఇంజినీర్‌ కె.చక్రపాణి, నైట్‌షిఫ్ట్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కె. వెంకట నరసింహ రమేష్‌ పట్నాయక్‌లను అరెస్టు చేశారు.

నివేదిక అందిన 24 గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదానికి బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రెండు నెలల క్రితం జరిగిన ప్రమాద ఘటనపై హైవపర్‌ కమిటీ నివేదిక సమర్పించిన 24గంటల్లోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 మంది కంపెనీ బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఒకవైపు కంపెనీ సీఈవో, కీలకమైన ఇద్దరు డైరెక్టర్లతో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేసే లోపే మరోవైపు ప్రభుత్వం ముగ్గురు అధికారులపై వేటు వేసింది. 

నాడు చెప్పారు.. నేడు చేశారు
ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం జరిగిన వెంటనే విశాఖకు వెళ్లి దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించి వారం రోజుల్లోనే అందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. క్షతగాత్రులను శరవేగంగా ఆదుకున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అంతే వేగంగా ఇప్పుడు బాధ్యులపైనా చర్యలు తీసుకున్నారు. మే 7న క్షతగాత్రులను పరామర్శించడం కోసం హుటాహుటిన విశాఖపట్నం వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ దోషులెంతటివారైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నాడు ప్రకటించినట్టుగానే సరిగ్గా రెండు నెలల్లోనే... మే 7న ప్రమాదం జరగ్గా జూలై 7న చర్యలు తీసుకోవడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement