విశాఖ ఘటన: నిందితులకు 14 రోజుల రిమాండ్‌ | Visakhapatnam Gas Leakage: Accused remanded In 14 Day Custody | Sakshi
Sakshi News home page

విశాఖ గ్యాస్‌ లీకేజీ: నిందితులకు 14 రోజుల రిమాండ్‌

Published Wed, Jul 8 2020 2:39 PM | Last Updated on Thu, Jul 9 2020 7:44 AM

Visakhapatnam Gas Leakage: Accused remanded In 14 Day Custody - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన కేసులో అరెస్టు అయిన 12 మందిని విశాఖ పోలీసులు బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు మందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరు పరచగా వీరికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు నిందితులను విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా స్టైరీన్‌ గ్యాస్‌ ప్రమాద ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి కేజీఎచ్‌లో నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబర్‌ 213గా కేసు నమోదు చేయగా, ఐపీసీ 304(2),278, 284 285, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్‌)

గోపాలపట్నం ప్రాంతంలో ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో మే 7వ తేదీన ఎల్‌జీ పాలీమర్స్‌ కంపెనీలో స్టైరీన్‌ వాయువు లీకైన ఘటనలో స్థానికులు 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బాదితులని పరామర్శించి ఆదుకుంటామని. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమని తేలితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి బాధితులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు రోజుల్లోనే కోటి రూపాయిల నష్టపరిహారం చెల్లించారు. బాధిత గ్రామాల ప్రజలందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్య సేవలకి వెంకటాపురంలో పది‌ పడకల క్లినిక్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. (ఎల్జీ గ్యాస్‌ లీకేజీ : ప్రమాదానికి కారణమదే)

అనంతరం ఎల్జీ పాలిపర్స్ ప్రమాదంపై సీనియర్ ఐఏఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమించగా, రెండు నెలలపాటు ఆయా గ్రామాల ప్రజలు, అన్ని వర్గాలను సంప్రదించి 350 పేజీల‌ నివేదికను హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సమర్పించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని హైపవర్ కమిటీ తేల్చి చెప్పిన వెంటనే నివేదిక ఇచ్చిన 24 గంటలలోపే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎల్జీ పాలిపర్స్ సీఈఓ, డైరక్టర్లు సహా విశాఖ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సస్పెన్షన్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement