చికిత్సకు లొంగే ఆంత్రాక్స్
► ఆంత్రాక్స్‌పై అవగాహనకు కరపత్రాలు
► గ్వాలియర్ నుంచి రెండు రోజుల్లో నివేదిక
► జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడి
పాడేరు: ఏజెన్సీలో ప్రస్తుతం ఆంత్రాక్స్‌గా అనుమానిస్తున్న వ్యాధి ప్రాణాంతకం కాదని వైద్య సేవలతో నయం చేయవచ్చని, ఆదివాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. బుధవారం ఆయన ఐటీడీఏలో మోదకొండమ్మ ఉత్సవాలపై సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుకుంపేట మండలం ఉప్ప పీహెచ్‌సీ పరిధిలోని పనసపుట్టులో సుమారు 16 మంది, జి.మాడుగుల మండలంలోని గొయ్యిగుంట, వెన్నులకోట గ్రామాల్లో మరో 19 మందికి సోకిన చర్మ వ్యాధి ఆంత్రాక్స్‌గా ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. రక్త నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తల బృందం నుంచి దీనిపై మరో రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయని చెప్పారు. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా నిర్ధారణ అయితే తగిన వైద్యసేవలు అందజేస్తామన్నారు.
గిరిజనులు చనిపోయిన పశువుల మాంసాన్ని తినడం వల్లే వ్యాధి సోకినట్టు శాస్త్రవేత్తల బృందం నిర్థారించిందని చెప్పారు. ఏజెన్సీలో 178 చెక్‌డ్యాంల మరమ్మతులకు రూ.14 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సెకండ్ ఏఎన్‌ఎంల నియామకానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఆంత్రాక్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ఇది వ్యాప్తి చెందకుండా నియంత్రణ కోసం గ్రామాల్లో కరపత్రాల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలోనూ ఈ కరపత్రాలు పంపిణీ చేసినట్లు చెప్పారు