► 19 మంది రోగులకు నిర్ధారణ కాని ఆంత్రాక్స్
► దిల్లీ, గ్వాలియర్ బృందాలతో సమగ్ర పరీక్షలు
► ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్
హుకుంపేట: విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 18 మంది గిరిజనులకు ఇంకా ఆంత్రాక్స్ నిర్ధారణ కాలేదని, గిరిజనులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ సూచించారు. మండలంలోని పాతకోట పంచాయితీ పనసపుట్టు గ్రామాన్ని శుక్రవారం సబ్ కలెక్టర్ శివశంకర్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా పీవో గిరిజనులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కేజీహెచ్‌లోని చికిత్స పొందుతున్న 18 మంది గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు కల్పిస్తున్నారని, వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక వైద్య బృందాలు కూడా కేజీహెచ్‌కు వచ్చాయన్నారు.
వారందరికి పూర్తిగా నయమయైన తరువాతే గ్రామానికి రప్పిస్తామని పీవో తెలిపారు. ఏజెన్సీలోని మృతి చెందిన పశువులను తినే అలవాటు ఉంటే గిరిజనులు మార్చుకోవాలని, విద్యావంతులైన యువకులు మృతి చెందిన పశుమాంసం తినకుండా గ్రామస్తులను చైతన్యవంతం చేయాలని కోరారు. దోమల నివారణ మందు పిచికారీ పనులు తప్పనిసరిగా ఇంటా బైటా చల్లించాలని తద్వారా మలేరియా బారి నుంచి ఇంటిల్లపాదిని కాపాడాల్సిన అవసరం ఇంటి ఇల్లాలిపైనే ఉందని చెప్పారు. గ్రామంలో పశువులు చనిపోతే పశువైద్యులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. వైద్యాధికారులు, పశువైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
పనసపుట్టుకు పీవో వరాలు
గ్రామంలోని సమస్యలపై పీవో ఆరా తీయగా రోడ్డు, తాగునీటి సమస్యలను వివరించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు చెప్పడంతో పది రోజుల్లోగా గ్రామంలో బోరు బావి నిర్మిస్తామన్నారు. పనసపుట్టు నుంచి పెదగరువు వరకు రోడ్డు నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులతో సర్వే జరిపిస్తామన్నారు. పాలెం గ్రామస్తులు గ్రామానికి తాగునీరు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పడంతో ఈ గ్రామంలో గ్రామసభ నిర్వహించి గిరిజనులకు అవగాహన కల్పించాలని తహశీల్దార్, ఈఓపీఆర్‌డీలను పీవో ఆదేశించారు. మృతి చెందిన పశువులకు నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరగా పీవో సానుకూలంగా స్పందించారు.
గిరిజన యువత నైపుణ్యరంగంలో తామందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. సబ్ కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ ఆంత్రాక్స్ అంటువ్యాధి కాదని, గిరిజనులు ఎలాంటి భయాందోళనలు చెందవద్దన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చిన నాడే వ్యాధులకు దూరమవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థకశాఖ ఏడీ కిశోర్, డిప్యుటీ డీఎంహెచ్‌వో పార్ధసారథి, ఉప వైద్యాధికారి అనూష, పశువైద్యాధికారి సునీల్‌కుమార్, సర్పంచ్ కె.లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆంత్రాక్స్‌పై ఆందోళన వద్దు
Published Sat, Apr 30 2016 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM
Advertisement
Advertisement