
ఇస్లామాబాద్: రసాయన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా ప్రాణాంతక ఆంత్రాక్స్‌పై పాకిస్తాన్, చైనా కలసికట్టుగా పరిశోధనలు చేయాలని నిర్ణయించినట్టుగా ఇటీవల వచ్చిన వార్తల్ని పాక్ కొట్టిపారేసింది. అవన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడిన తప్పుడు వార్తలని వ్యాఖ్యానించింది. ఆంత్రాక్స్ వంటి వాటిపై ప్రయోగాలు చేయడం కోసం చైనా, పాక్ రహస్యంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఆరోపిస్తూ ఆస్ట్రేలియా వార్తా పత్రిక ది క్లాక్సన్ ఒక కథనాన్ని ప్రచురించింది. పరిశోధనాత్మక వ్యాసాలను అందించే ఆ పత్రిక ఇటీవల కాలంలో ప్రబలుతున్న అంటువ్యాధులపై పరిశోధనలు చేయడానికి మూడేళ్లపాటు కలిసి పనిచేయాలని పాక్, చైనాల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా ఆ కథనంలో వెల్లడించింది. అయితే ఈ కథనంలో ఏ మాత్రం వాస్తవం లేదని పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తోసిపుచ్చింది. దానిని రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment