సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం
గురజనాపల్లి(కరప), న్యూస్‌లైన్ :
బలమైన సంకల్పం ఉంటే లక్ష్యసాధనకు అంగవైకల్యం ఎంతమాత్రం అడ్డురాదని నిరూపించింది ఈ యువతి. పోలియో వల్ల రెండు కాళ్లూ చచ్చుబడిపోయినా నిరాశతో ఇంటి వద్ద కూర్చోకుండా వజ్ర సంకల్పంతో ఆమె బీఏ బీఈడీ కష్టించి పూర్తిచేసింది. ఉపాధి కల్పించాలని గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించడంతో విద్యావలంటీరుగా నియమితురాలైంది. కరప మండలం గురజనాపల్లి శివారు అడవిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి మహాలక్ష్మికి చిన్నతనంలో పోలియో సోకడంతో రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. తండ్రి రాధాకృష్ణ వ్యవసాయకూలీ. ఇంటివద్ద నడవలేని స్థితిలో ఒంటరిగా కూర్చోకుండా తల్లి గనికమ్మ సహాయంతో పాఠశాలకు వెళ్లి అక్షరాలు దిద్దుకుంది.
ఆమె పట్టుదలను చూసి తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువును కొనసాగించింది. బాగా చదువుకొని పైకి రావాలన్న పట్టుదలతో డిగ్రీ చదివింది, గతేడాది బీఈడీ పూర్తిచేసింది. డిసెంబరు 30వ తేదీన కాకినాడలోని కలెక్టర్ గ్రీవెన్స్‌కు వెళ్లి తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని విన్నవించుకుంది. కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించి విద్యావలంటీరు పోస్టు మంజూరుచేసి ఇవ్వాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్ వెన్నపు చక్రధరరావు ఉత్తర్వుల మేరకు ఎంఏఓ ఎంవీవీ సుబ్బారావు గురజనాపల్లి శివారు బొందలవారిపేట ఎంపీపీ పాఠశాలలో విద్యావలంటీరుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మహాలక్ష్మి గురువారం పాఠశాలలో విద్యావలంటీరుగా చేరి విద్యార్థులకు పాఠాలు బోధించి, తన కలను సాకారం చేసుకుంది.
పేదలకు సహాయ పడతా
బోధనపై మక్కువతో బీఈడీ చదివానని, టెట్ రాసి, డీఎస్సీలో టీచర్‌గా ఎంపిక కావాలన్న లక్ష్యంతో ఉన్నట్టు మహాలక్ష్మి ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ఉద్యోగంలో స్థిరపడ్డాక పేదలకు, వృద్ధులకు సహాయపడతానంది. వికలాంగులు అధైర్యపడకూడదని, పట్టుదలతో చదువుకుని, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని మహాలక్ష్మి పేర్కొంది.