will power
-
వీల్‌చైర్‌లో వచ్చాడు... విల్‌పవర్ చూపాడు
వీల్‌చైర్‌కు పరిమితమైన ఈ యువకుడు విల్ పవర్ మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. స్నేహితుల సహాయంతో వీల్‌చైర్‌లో నుంచి రిషికేష్‌లో బంగీ జంప్ చేశాడు. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల మనసు దోచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ డేర్’ ‘మోర్ పవర్ టు యూ, బాయ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. చాలామంది హార్ట్ ఇమోజీలతో రియాక్ట్ అయ్యారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్ అవనీష్ బాజ్‌పాయ్ ఆర్టిఫిషియల్ లింబ్‌తో భటిండాలో 14,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్‌ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్‌తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్‌బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్‌మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
35 అడుగుల మంచులో కూరుకుపోయినా..
సియాచిన్ అంటేనే మృత్యువుకు మరోపేరు. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఈ ఎత్తయిన యుద్ధక్షేత్రంలో కొనఊపిరితో బతికి బయటపడ్డ లాన్స్‌నాయక్ హనుమంతప్ప ధీరోదాత్త ఉదంతం ఓ మిరాకిల్‌గా నిలిచింది. వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడు రోజుల క్రితం అక్కడ పహారా కాస్తున్న సైన్యం మంచు తుఫానులో చిక్కుకుంది. హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. మీద పడటంతో భారత సైనిక శిబిరం సమాధి అయిన ఘటనలో హనుమంతప్ప ఒక్కడే అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా మిగతా 9 మంది సైనికులు అసువులు బాశారు. 19,600 అడుగుల ఎత్తయిన మంచు పర్వతం.. 35 అడుగుల మంచు.. మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నిమిషాల్లో రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి.. ఇవన్నీ ఉన్నా హనుమంతప్ప బయటపడ్డాడు. హనుమంతప్పను సజీవంగా నిలిపింది ఏంటన్నదే ఇపుడు చర్చకు దారితీసింది. మంచులోని గాలిబుడగలే కాపాడాయని నిపుణులు చెబుతున్నారు. అతని నోరు, ముక్కు దగ్గర ఎయిర్ పాకెట్స్ ను గమనించామని రెస్క్యూ ఆపరేషన్ ఆఫీసర్లు తెలిపారు. తాము పేరు పెట్టుకున్న హనుమంతుడే తన బిడ్డను కాపాడాడని అతడి తండ్రి అంటున్నారు. నిరంతర కఠోర వ్యాయామం, యోగ సాధన, ప్రాణాయామం బాగా అలవాటు ఉండటం వల్లే హనుమంతప్ప బయటపడినట్లు తెలుస్తోంది. శరీరంలోని పలు భాగాలు గడ్డకట్టుకుపోయి కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను సైనిక వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావడం లేదని.. రక్తపోటు చాలా తక్కువగా ఉందని, కిడ్నీలు, లివర్ పనిచేయడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం విషమంగానే ఉందని, 24గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు. దీంతో.. హనుమంతప్ప క్షేమ సమాచారం కోసం దేశం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. ధీరుడా.. కోలుకో అంటూ ప్రార్థనలు చేస్తోంది. అసలు 1984కు ముందు సియాచిన్‌పై సైనిక శిబిరాలు ఉండేవి కావు. అయితే, వ్యూహాత్మక ప్రాంతం కావడంతో ఇరుదేశాలు సైనిక శిబిరాలు ఏర్పాటుచేశాయి. వీటిని విరమించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. కానీ ఇంతవరకూ తొలి అడుగు పడలేదు. -
సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం
గురజనాపల్లి(కరప), న్యూస్‌లైన్ : బలమైన సంకల్పం ఉంటే లక్ష్యసాధనకు అంగవైకల్యం ఎంతమాత్రం అడ్డురాదని నిరూపించింది ఈ యువతి. పోలియో వల్ల రెండు కాళ్లూ చచ్చుబడిపోయినా నిరాశతో ఇంటి వద్ద కూర్చోకుండా వజ్ర సంకల్పంతో ఆమె బీఏ బీఈడీ కష్టించి పూర్తిచేసింది. ఉపాధి కల్పించాలని గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించడంతో విద్యావలంటీరుగా నియమితురాలైంది. కరప మండలం గురజనాపల్లి శివారు అడవిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి మహాలక్ష్మికి చిన్నతనంలో పోలియో సోకడంతో రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. తండ్రి రాధాకృష్ణ వ్యవసాయకూలీ. ఇంటివద్ద నడవలేని స్థితిలో ఒంటరిగా కూర్చోకుండా తల్లి గనికమ్మ సహాయంతో పాఠశాలకు వెళ్లి అక్షరాలు దిద్దుకుంది. ఆమె పట్టుదలను చూసి తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువును కొనసాగించింది. బాగా చదువుకొని పైకి రావాలన్న పట్టుదలతో డిగ్రీ చదివింది, గతేడాది బీఈడీ పూర్తిచేసింది. డిసెంబరు 30వ తేదీన కాకినాడలోని కలెక్టర్ గ్రీవెన్స్‌కు వెళ్లి తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని విన్నవించుకుంది. కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించి విద్యావలంటీరు పోస్టు మంజూరుచేసి ఇవ్వాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్ వెన్నపు చక్రధరరావు ఉత్తర్వుల మేరకు ఎంఏఓ ఎంవీవీ సుబ్బారావు గురజనాపల్లి శివారు బొందలవారిపేట ఎంపీపీ పాఠశాలలో విద్యావలంటీరుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మహాలక్ష్మి గురువారం పాఠశాలలో విద్యావలంటీరుగా చేరి విద్యార్థులకు పాఠాలు బోధించి, తన కలను సాకారం చేసుకుంది. పేదలకు సహాయ పడతా బోధనపై మక్కువతో బీఈడీ చదివానని, టెట్ రాసి, డీఎస్సీలో టీచర్‌గా ఎంపిక కావాలన్న లక్ష్యంతో ఉన్నట్టు మహాలక్ష్మి ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ఉద్యోగంలో స్థిరపడ్డాక పేదలకు, వృద్ధులకు సహాయపడతానంది. వికలాంగులు అధైర్యపడకూడదని, పట్టుదలతో చదువుకుని, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని మహాలక్ష్మి పేర్కొంది.