35 అడుగుల మంచులో కూరుకుపోయినా.. | While Koppad’s survival is a miracle, which saved him | Sakshi
Sakshi News home page

35 అడుగుల మంచులో కూరుకుపోయినా..

Published Wed, Feb 10 2016 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

35 అడుగుల మంచులో కూరుకుపోయినా..

35 అడుగుల మంచులో కూరుకుపోయినా..

సియాచిన్ అంటేనే మృత్యువుకు మరోపేరు. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఈ ఎత్తయిన యుద్ధక్షేత్రంలో కొనఊపిరితో బతికి బయటపడ్డ లాన్స్‌నాయక్ హనుమంతప్ప ధీరోదాత్త ఉదంతం ఓ మిరాకిల్‌గా నిలిచింది. వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఏడు రోజుల క్రితం అక్కడ పహారా కాస్తున్న సైన్యం మంచు తుఫానులో చిక్కుకుంది. హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. మీద పడటంతో భారత సైనిక శిబిరం సమాధి అయిన ఘటనలో హనుమంతప్ప ఒక్కడే అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా మిగతా 9 మంది సైనికులు అసువులు బాశారు.
 
19,600 అడుగుల ఎత్తయిన మంచు పర్వతం.. 35 అడుగుల మంచు.. మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత,  నిమిషాల్లో రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి.. ఇవన్నీ ఉన్నా హనుమంతప్ప బయటపడ్డాడు. హనుమంతప్పను సజీవంగా నిలిపింది ఏంటన్నదే ఇపుడు చర్చకు దారితీసింది. మంచులోని గాలిబుడగలే కాపాడాయని నిపుణులు చెబుతున్నారు.  అతని నోరు, ముక్కు దగ్గర  ఎయిర్ పాకెట్స్ ను గమనించామని  రెస్క్యూ ఆపరేషన్  ఆఫీసర్లు తెలిపారు. తాము పేరు పెట్టుకున్న హనుమంతుడే తన బిడ్డను కాపాడాడని అతడి తండ్రి  అంటున్నారు. నిరంతర కఠోర వ్యాయామం, యోగ సాధన, ప్రాణాయామం బాగా అలవాటు ఉండటం వల్లే హనుమంతప్ప బయటపడినట్లు తెలుస్తోంది. 

శరీరంలోని పలు భాగాలు గడ్డకట్టుకుపోయి కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను సైనిక వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావడం లేదని.. రక్తపోటు చాలా తక్కువగా ఉందని, కిడ్నీలు, లివర్ పనిచేయడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం విషమంగానే ఉందని, 24గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు. దీంతో.. హనుమంతప్ప క్షేమ సమాచారం కోసం దేశం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. ధీరుడా.. కోలుకో అంటూ ప్రార్థనలు చేస్తోంది.

అసలు 1984కు ముందు సియాచిన్‌పై సైనిక శిబిరాలు ఉండేవి కావు. అయితే, వ్యూహాత్మక ప్రాంతం కావడంతో ఇరుదేశాలు సైనిక శిబిరాలు ఏర్పాటుచేశాయి. వీటిని విరమించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. కానీ ఇంతవరకూ తొలి అడుగు పడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement