aim and goal
-
సీఎం పదవే నా లక్ష్యం : రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు ఆరునెలల తర్వాత తన మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్ తనను వాడుకుంటే సొమ్ము చేసి పెడతానని, లేదంటే ఆ పార్టీకి మన్నే మిగులుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘నన్ను పార్టీలోకి రమ్మన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దూతలు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలన్నీ వారికి తెలుసు. నా పనితీరు తెలిసి కూడా రాష్ట్ర టీం లీడర్ సరిగా వాడుకోవడం లేదు. ఆయనకు సలహాలిచ్చే వారు సరిగా లేరు. నాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా తీసుకోను. ఆ పదవి వద్దని రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. నా హోదాకు తగిన పదవిని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా నా లక్ష్యం సీఎం కుర్చీనే’’ అని అన్నారు. తాను మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని, కొన్నేళ్ల తర్వాతయినా సీఎం అవుతానని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాల రద్దుకు నిరసనగా గాంధీభవన్‌లో 48 గంటల దీక్ష చేపట్టాలని తానే సలహా ఇచ్చినట్లు చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుదారులు వేరే పార్టీ వ్యక్తికి ఓటు వేసినా కాంగ్రెస్ నాయకత్వం కోర్టును ఆశ్రయించడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. గతంలో చాలా మంది ప్రలోభాలు గురిచేసినా తాను లొంగలేదని, బీజేపీ చీఫ్ అమిత్‌షా ఎన్నో ఆఫర్లు ఇచ్చినా వదులుకున్నానని చెప్పారు. -
జీఈఎస్-2017 ఉద్దేశం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా రాజధాని నగరం హైదరాబాద్‌లో ఇపుడు ఎక్కడ చూసినా గ్లోబల్ ఎంట్రపెన్యూయర్‌షిప్ సమ్మిట్ 2017 (జీఈఎస్), ఇవాంకా ట్రంప్ ఫీవరే కనిపిస్తోంది. అటు మహిళలకు పెద్ద పీట వేస్తున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు, ఇటు ఇవాంకా ట్రంప్ సందర్శన. దీంతో ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను ఆగమేఘాల నిర్వహిస్తోంది. ఈ నెల28-30 మధ్య జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూయర్‌షిప్ సమ్మిట్ 2017 (జీఈఎస్)లో ఇవాంకా పాల్గొననున్నారు. అంతేకాదు తొలిసారి దాదాపు సగానికిపైగా (52.5శాతం) మహిళా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇంతకీ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఏ చర్చించబోతున్నారు. ఈ జీఈఎస్ ఉద్దేశం, లక్ష్యాలు ఏమిటి? అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తారు. విరివిగా పెట్టుబడులను ఆకర్షించేందుకు, గ్లోబల్ ఇన్వెస్టర్లను ప్రోత్సాహాన్నివ్వడం, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్ట్ ఆప్ సంస్థలకు ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈజీ బిజినెస్ నిర్వహణలో ప్రభుత్వం అండదండలు, వ్యాపార నైపుణ్యాలను పెంచుకోవడం, వినూత్న ఆలోచనలతో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేలా యువ పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా మహిళలు ప్రోత్సాహాన్నందించడమే ప్రధాన లక్ష్యం. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసురానున్నారు. అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు, సరికొత్త అవకాశాలను సృష్టించేందుకు వేదిక ఈ సమ్మిట్. ఈ నేపథ్యంలో వీరి మధ్య అనుసంధానకర్తగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమెరికాతో కలిసి నీతి ఆయోగ్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఎనిమిదవ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 127 దేశాలనుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. 10పైగా దేశాలనుంచి మొత్తం మహిళా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడం విశేషం. దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సును జరుగుతుండగా "ఉమెన్ ఫస్ట్, ప్రాస్పర్టీ ఫర్ ఆల్ " అనే అంశం ఈ సదస్సులో హైలైట్‌గా నిలవనున్న సంగతి తెలిసిందే. -
సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం
గురజనాపల్లి(కరప), న్యూస్‌లైన్ : బలమైన సంకల్పం ఉంటే లక్ష్యసాధనకు అంగవైకల్యం ఎంతమాత్రం అడ్డురాదని నిరూపించింది ఈ యువతి. పోలియో వల్ల రెండు కాళ్లూ చచ్చుబడిపోయినా నిరాశతో ఇంటి వద్ద కూర్చోకుండా వజ్ర సంకల్పంతో ఆమె బీఏ బీఈడీ కష్టించి పూర్తిచేసింది. ఉపాధి కల్పించాలని గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించడంతో విద్యావలంటీరుగా నియమితురాలైంది. కరప మండలం గురజనాపల్లి శివారు అడవిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి మహాలక్ష్మికి చిన్నతనంలో పోలియో సోకడంతో రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. తండ్రి రాధాకృష్ణ వ్యవసాయకూలీ. ఇంటివద్ద నడవలేని స్థితిలో ఒంటరిగా కూర్చోకుండా తల్లి గనికమ్మ సహాయంతో పాఠశాలకు వెళ్లి అక్షరాలు దిద్దుకుంది. ఆమె పట్టుదలను చూసి తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువును కొనసాగించింది. బాగా చదువుకొని పైకి రావాలన్న పట్టుదలతో డిగ్రీ చదివింది, గతేడాది బీఈడీ పూర్తిచేసింది. డిసెంబరు 30వ తేదీన కాకినాడలోని కలెక్టర్ గ్రీవెన్స్‌కు వెళ్లి తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని విన్నవించుకుంది. కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించి విద్యావలంటీరు పోస్టు మంజూరుచేసి ఇవ్వాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్ వెన్నపు చక్రధరరావు ఉత్తర్వుల మేరకు ఎంఏఓ ఎంవీవీ సుబ్బారావు గురజనాపల్లి శివారు బొందలవారిపేట ఎంపీపీ పాఠశాలలో విద్యావలంటీరుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మహాలక్ష్మి గురువారం పాఠశాలలో విద్యావలంటీరుగా చేరి విద్యార్థులకు పాఠాలు బోధించి, తన కలను సాకారం చేసుకుంది. పేదలకు సహాయ పడతా బోధనపై మక్కువతో బీఈడీ చదివానని, టెట్ రాసి, డీఎస్సీలో టీచర్‌గా ఎంపిక కావాలన్న లక్ష్యంతో ఉన్నట్టు మహాలక్ష్మి ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ఉద్యోగంలో స్థిరపడ్డాక పేదలకు, వృద్ధులకు సహాయపడతానంది. వికలాంగులు అధైర్యపడకూడదని, పట్టుదలతో చదువుకుని, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని మహాలక్ష్మి పేర్కొంది.