lack of funds
-
అరకొరగానే అమలవుతోన్న కేసీఆర్ కిట్స్ పథకం..!
-
శివయ్యా.. నా వల్ల కాదయ్యా!
సాక్షి, ఖమ్మం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఆలయ నిర్వహణ నిధులు రాకపోవడంతో శివరాత్రి వేడుకలు నిర్వహించలేనంటూ నేలకొండపల్లిలోని శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం అర్చకుడు కొడవటిగంటి నరసింహారావు అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు. ఆలయం పేరిట 1996వ సంవత్సరం వరకు 23 ఎకరాల భూమి ఉండగా, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు. ఆతర్వాత ఆదాయం పడిపోయి అర్చకుల వేతనాలు నిలిపేయడంతో 2018లో నరసింహారావు హైకోర్టును ఆశ్రయించగా, భూమి విలువతో పాటు వడ్డీ కలిపి రూ.51 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశారు. అయినప్పటికీ నాలుగేళ్ల నుంచి అర్చకుడికి వేతనం రాకపోగా, దీప, ధూప నైవైద్యం నిధులు కూడా ఇవ్వడంలేదు. దీంతో కుటంబ పోషణే కష్టంగా మారిన నేపథ్యాన శివరాత్రి వేడుకలు చేయడం సాధ్యం కాదంటూ నరసింహారావు బుధవారం తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
చైనా పెట్టుబడులకు బ్రేక్..
ముంబై: పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినప్పట్నుంచీ చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు గణనీయంగా తగ్గాయి. నిర్దిష్ట నిబంధనలపై స్పష్టత కొరవడటంతో చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన 150కి పైగా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో దేశీ స్టార్టప్ సంస్థలకు నిధుల కొరత సమస్య తీవ్రమవుతోంది. ఖేతాన్ అండ్ కో అనే న్యాయసేవల సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌తో సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రెస్ నోట్ 3 (పీఎన్3)ను రూపొందించింది. భారతీయ కంపెనీల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను కట్టడి చేయడమే దీని ప్రధాన లక్ష్యం అయినప్పటికీ.. ఇందులోని కొన్ని అంశాలపై స్పష్టత కొరవడటంతో మిగతా సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపైనా ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్లకు భారత్‌తో సరిహద్దులు ఉన్నాయి. పీఎన్3 సవరణలకు ముందు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సంస్థలు మాత్రమే భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. పెట్టుబడులు 72 శాతం డౌన్.. చైనా, హాంకాంగ్ పెట్టుబడులు.. రెండేళ్ల క్రితం వరకూ దేశీ స్టార్టప్‌లకు ప్రధాన ఊతంగా నిల్చాయి. 2019లో 3.4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు రాగా 2020లో 72 శాతం క్షీణించి 952 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. చైనా నుంచి పెట్టుబడులు 64 శాతం క్షీణించి 377 మిలియన్ డాలర్లకు పడిపోగా.. హాంకాంగ్ నుంచి ఏకంగా 75 శాతం తగ్గి 575 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. అయితే, కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడుల క్షీణత వంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ 2020లో పీఈ/వీసీ పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 39.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 814 డీల్స్ కుదిరినట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇందులో సింహభాగం వాటా 27.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. రిలయన్స్ రిటైల్, జియోలోకే వచ్చాయి. కొత్త మార్గదర్శకాలివీ .. పీఎన్3 ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెట్టుబడుల ద్వారా అంతిమంగా లబ్ధి పొందే యజమాని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనపై గందరగోళం నెలకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అంతిమ లబ్ధిదారు.. తైవాన్, హాంకాంగ్, మకావు వంటి దేశాలకు చెందిన వారైనా .. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా .. చైనా లాంటి సరిహద్దు దేశాల ద్వారా చేసే పెట్టుబడులకు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటోంది. కరోనా సంక్షోభ పరిస్థితులను అడ్డం పెట్టుకుని ఇతర దేశాల మదుపుదారులు (ముఖ్యంగా చైనా సంస్థలు) దేశీ కంపెనీలను టేకోవర్ చేయడాన్ని నిరోధించేందుకే ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిందని ఖేతాన్ అండ్ కో పార్ట్నర్ రవీంద్ర ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. చైనాపై ఆర్థికాంశాలపరంగా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టిక్‌టాక్, పబ్జీ వంటి 200కి పైగా చైనా యాప్‌లను నిషేధించడం, టెలికం పరికరాల నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఈ కోవకు చెందినవేనని ఆయన పేర్కొన్నారు. -
రూ. 2,400 కోట్ల పూచీకత్తు ఇవ్వండి
న్యూఢిల్లీ: తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) కొత్తగా మరిన్ని రుణాలు సమీకరించే ప్రయత్నాల్లో పడింది. నిర్వహణ అవసరాల కోసం కావాల్సిన నిధులను సమీకరించుకునేందుకు రూ.2,400 కోట్ల మేర పూచీకత్తు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇవ్వనున్న దాదాపు రూ.7,600 కోట్ల గ్యారంటీలోనే ఇది భాగంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రుణాలు, నష్టాలతో కుదేలవుతున్న ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుండటం తెలిసిందే. 2018–19లో ఎయిరిండియా సుమారు రూ.8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది. కంపెనీ మూతబడకుండా కార్యకలాపాలు కొనసాగించేందుకు 2011–12 నుంచి కేంద్రం ఇప్పటిదాకా రూ.30,520 కోట్ల మేర తోడ్పాటు అందించిన సంగతి తెలిసిందే. -
తీవ్ర నిధుల సంక్షోభంలో ఐరాస
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి తీవ్రమైన నిధుల కొరతలో ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలిచ్చేందుకూ సరిపోను నిధులు లేవన్నారు. ఐరాసలో ఈ దశాబ్దంలో ఈ స్థాయి సంక్షోభం ఎన్నడూ లేదన్నారు. సంస్థకు ఇస్తామని ప్రకటించిన నిధులను తక్షణమే అందించాలని 193 సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. నిధుల్లేకుండా ఐరాస పథకాల అమలు సాధ్యం కాబోదన్నారు. ఈ దశాబ్దంలోనే ఈ నెలలో అత్యంత తక్కువ స్థాయిలో నిధులున్నాయన్నారు. సంస్థకు దేశం తరఫున అందించాల్సిన నిధులను పూర్తిగా అందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, శాంతి పరిరక్షణ దళ ఖర్చుల నిమిత్తం భారత్‌కే ఐరాస రూ. 270 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 73 దేశాలు మాత్రమే.. 2017, 2018 సంవత్సరాలకు గానూ 73 దేశాలు మాత్రమే, మార్చి నాటికి తమ వాటాను పూర్తిగా చెల్లించాయని గ్యుటెరస్ తెలిపారు. 2016లో 62 దేశాలు, 2015లో 67 దేశాలు తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. 2018 చివరి నాటికి సభ్య దేశాల నుంచి సంస్థకు అందాల్సిన నిధులు 529 మిలియన్ డాలర్లు. 2018, 2019 సంవత్సరాలకు గానూ.. సంస్థ సాధారణ బడ్జెట్ అయిన 5.4 బిలియన్ అమెరికన్ డాలర్లలో దాదాపు 22% అమెరికా నుంచి అందాల్సి ఉంది. ఈ జనవరి నుంచి తీవ్రస్థాయిలో పొదుపు చర్యలు చేపట్టకుండా, నెలవారీ ఖర్చుల విధానం ప్రారంభించకుండా ఉండి ఉంటే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండి ఉండేదని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారు. ‘ఆ చర్యలే చేపట్టకుండా ఉండి ఉంటే.. జనరల్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా మనవద్ద ఉండేవి కావు’ అన్నారు. అత్యంత తీవ్రమైన నిధుల లేమి కారణంగా కఠినమైన పొదుపు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. -
అంగన్వాడీలకు బియ్యం, గుడ్లు కరువు
పెద్దేముల్(తాండూరు) : అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం, గుడ్లు కరువయ్యాయి. ప్రతి నెలా రావాల్సిన సరుకులు (బడ్టెట్) నిధులు ఆలస్యం కావడం, జూన్‌లో çసమయానికి కేంద్రాలకు అందకపోవడంతో బాలింతలు, గర్భిణులకు భోజనం నిలపేశారు. పెద్దేముల్ మండలంలోని 25 పంచాయతీల్లో 53 అంగన్వాడీ, 6 మినీ కేంద్రాలున్నాయి. ప్రతి నెలా 25న సెక్టార్ మీటింగ్ అయిన వెంటనే కేంద్రాలకు సరుకులు అందచేసేది. జూన్‌లో బడ్టెట్ ఆలస్యం కావడంతో పెద్దేముల్ మండలంలోని ఆత్కూర్, ఆత్కూర్‌తండా, తట్టెపల్లితో పాటు పలు కేంద్రాల్లో బియ్యం గుడ్లు కరువయ్యాయి. దీంతో చేసేదేమీ లేదంటూ అంగన్వాడీ టీచర్లు బాలంతలు, గర్భిణులకు భోజనాన్ని నిలపేశారు. మరికొన్ని కేంద్రాల్లో చిన్న పిల్లలకు బియ్యం ఖరీదుచేసి వంట చేస్తున్నారు. కేంద్రాల్లో టీచర్లు కూడా సమయానికి రావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని అంగన్వాడీ మండల సుపర్‌వైజర్లకు ఫిర్యాదు చేసినా లాభంలేకుండా పోతోందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఆత్కూర్‌తండా, బండమీదిపల్లితో పాటు పలు కేంద్రాల్లో టీచర్లు కేంద్రాలకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయాలు కేంద్రాలు కొనసాగించారు. కేంద్రాల్లో భోజనం లేకపోవడంతో చిన్నారుల సంఖ్య తగ్గుతోంది. ఈ విషయమై ఇన్చార్జీ సీడీపీఓ రేణుకను వివరణ కోరగా బడ్డెట్ రాక సరుకులు లేని విషయం వాస్తవమని, రెండు రోజుల్లో అన్ని కేంద్రాలకు సరుకులు అందచేయడం జరుగుతుందని అన్నారు. కేంద్రాలకు టీచర్లు సరైన సమయానికి రాకపోయినా, ఎవరైనా ఫిర్యాదులు చేసినా చర్యలు తప్పవన్నారు. -
వర్సిటీ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం
ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ 2008 జూన్ 25న ఏర్పడింది. కొత్త యూనివర్సిటీలు బలోపేతం కావాలంటే ప్రత్యేక నిధులు అవసరం. సీనియర్ వర్సిటీల స్థాయికి చేరుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందులో భాగంగానే కొత్త యూనివర్సిటీల నుంచి ప్రభుత్వం అనుమతులు కోరింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. కొత్తగా ఏర్పాటైన వర్సిటీలు ఆదికవి నన్నయ్య, శ్రీకృష్ణ, విక్రమసింహపురిలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.33.45 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పలు నిర్మాణాలు చేయాలని అధికారులు భావించారు. అధికారులు ప్రతిపాదించిన వాటిలో రూ.6 కోట్లతో పరిపాలన భవనం, రూ.90 లక్షలతో న్యాయకళాశాల, రూ.90 లక్షలతో విద్యావిభాగం భవనాలు, రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ. 2.50 కోట్లతో క్రికెట్ మైదానం, రన్నింగ్ ట్రాక్‌కు రూ.1.50 కోట్లు, జిమ్ ఏర్పాటుకు రూ.1.50 కోట్లు, ఎగ్జామినేషన్స్ బ్లాక్‌కు రూ. 3.45 కోట్లు, వసతిగృహం భవనాలకు రూ.2.65 కోట్లు, తరగతి గదుల నిర్మాణం కోసం రూ.4.05 కోట్లు, రూ.8 కోట్లతో అకడమిక్ భవనాల నిర్మాణం చేపట్టాలని భావించారు. ఉన్నత విద్యాశాఖ మంజూరు చేసిన ఈ నిధులను వర్సిటీలకు నేరుగా మంజూరు చేయకుండా రోడ్లు, భవనాల శాఖకు ఖర్చు, అంచనాల బాధ్యత అప్పగించారు. ఈ మేరకు ఆర్అండ్బీ అధికారులు వర్సిటీకి వచ్చి అంచనాలు రూపొందించారు. నిర్మాణాలకు అనువైన స్థలాలను సైతం గుర్తించారు. అంచనాలకు అనుగుణంగా పనులకు టెండర్లు వేయనున్నట్లు ప్రకటించారు. అయితే వర్సిటీ అధికారులు ఆర్‌అండ్‌బీకి కాకుండా, కేంద్ర ప్రజా పనుల విభాగానికి పనులు అప్పగిస్తే నాణ్యత ఉంటుందని భావించారు. నిధుల మంజూరుపై నీలినీడలు: ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ నిధుల మంజూరుపై నీలినీడలు అలుముకున్నాయి. గత రెండేళ్ల నుంచి ప్రదిపాదన దశలో ఉన్న నిధులు మంజూరు కావడం లేదు. ఉన్నత విద్యామండలి, ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి సైతం వర్సిటీ అధికారులు తీసుకువెళ్లారు. అయినా ప్రభుత్వం నిధుల మంజూరు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రత్యేక నిధులు బడ్జెట్లో కేటాయించడం కుదరదు. మరోవైపు పెద్ద యూనివర్సిటీలకు బడ్జెట్లో వర్సిటీ స్థాయి బట్టి నిధులు మంజూరు అవుతున్నాయి. బడ్జెట్లో వర్సిటీకి అరకొర నిధులతో ప్రభుత్వం సరిపెడుతోంది. ప్రస్తుతం మంజూరు చేసిన ప్రత్యేక నిధులు సైతం అందజేయలేదు. అసలు ఈ నిధులు మంజూరు అవుతాయా? లేదా? అన్న అంశం సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం: ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో వర్సిటీకి అందజేశారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖకు వర్సిటీ ప్రత్యేక నిధులు అప్పగించారు. ఇంజినీరింగ్ అధికారులు సైతం వర్సిటీకి వచ్చి నిర్మాణాలకు అనువైన స్థలాలు, అంచనాలు పరిశీలించారు. ఈ వర్సిటీ సీనియర్ వర్సిటీలతో పోటీ పడాలంటే ప్రత్యేక నిధులు తప్పని సరి. లేదంటే ప్రగతి సాధ్యం కాదు. వర్సిటీలో కొత్త కోర్సులు, అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, ఎగ్జామినేషన్ విభాగాలు బలోపేతం కావాలంటే ప్రత్యేక నిధుల మంజూరు కీలకం. నిధుల కోసం అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాం. ---ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ -
తమ్మిలేరుపై నీలినీడలు
తమ్మిలేరు జలాశయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కారు నిర్లక్ష్యం శాపంగా మారింది. ఫలితంగా జిల్లాతోపాటు కృష్ణాజిల్లాలోని 30వేల ఎకరాలకుపైగా ఆయకట్టు భవిత ప్రశ్నార్థకంగా మారింది. చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్ నిర్మించి 40 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకూ పూర్తిస్థాయి మరమ్మతులకు నోచుకోలేదు. 1996 తర్వాత ఈ ప్రాజెక్టు అభివృద్ధి అంశం మరుగున పడింది. కనీసం ఈసారి బడ్జెట్లోనైనా దీని అభివృద్ధికి నిధులు కేటాయించాలనే డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అన్నీ సమస్యలే: ప్రస్తుతం రిజర్వాయర్ గట్టు బలహీనంగా ఉంది. గట్టుపైకి చేరుకునే మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. రివిట్మెంట్ కూడా అంతంత మాత్రంగా ఉంది. సాగునీరు అందించే పంట కాలువలూ దెబ్బతిన్నాయి. రిజర్వాయర్ కుడి కాలువ 6.508 కిలోమీటర్లు, ఎడమకాలువ 10.185 కిలోమీటర్లు, మంకొల్లు కాలువ పొడవు 3.38 కిలోమీటర్లు. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ జలాశయం వద్ద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ 6.4 కిమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 74 మీటర్ల ఎత్తులో మట్టికట్టను నిర్మించారు. ఎంతగా కృషి చేసినా..!: తమ్మిలేరు అభివృద్ధి కోసం 2006లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం ఎంతగా కృషి చేసినా ఫలితం దక్కలేదు. అప్పట్లో ఇరిగేషన్ అధికారులు రూ.24కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాత జపాన్‌కు చెందిన ఇంటర్నేషనల్ కో–ఆపరేటివ్ ఎయిడ్ (జేఐసీఏ) అనే సంస్థ నిధులతో తమ్మిలేరు మరమ్మతులు చేపట్టారు. అయితే అన్ని అనుమతులు వచ్చాక నిధుల విడుదలకు నిర్దేశించిన గడువు పూర్తి కావడంతో మరమ్మతులు నిలిచిపోయాయి. దీంతో తిరిగి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం అనుమతులు లభించి నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, గత ఏడాది రాష్ట్ర విభజన కూడా జరిగిపోవడంతో ఈ నిధులపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. విభజన శాపం: రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన తమ్మిలేరుకు రాష్ట్ర విభజన శాపంగా మారింది. విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో విభజన చట్టంలో దానికి చోటు దక్కలేదు. విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం తమ్మిలేరుకు వచ్చే నీటిని నిలిపి వేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మెట్ట రైతుల కల్పతరువైన ఈ రిజర్వాయర్‌కు శాశ్వత సాగునీరు ఎండమావిలా మారింది. పరిశీలనతో సరి!: రాష్ట్ర విభజన అనంతరం తమ్మిలేరు ప్రాజెక్టును అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించడంతోపాటు అంతర్రాష్ట్ర కోటాలో అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ దశలో గత ఏడాది ఫిబ్రవరిలో జపాన్ బృందం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లింది. ఆ తర్వాత సర్కారు పట్టించుకోకపోవడంతో జపాన్ నిధులు వచ్చేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇందిరాసాగర్ ఆశలు ఆవిరేనా!: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2005లో మంజూరు చేసిన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం ఆశలు ప్రస్తుతం ఆవిరైనట్టే కనిపిస్తోంది. గోదావరి జలాలను మెట్ట ప్రాంతంలోని తమ్మిలేరు ప్రాజెక్టుతోపాటు, చెరువుల్లోకి మళ్లించి 36 వేల ఎకరాలకు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా , అశ్వారావుపేట మండలం రుద్రమకోట వద్ద ఇందిరాసాగర్ ఎత్తిపోతల ప«థకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత ప్రభుత్వం ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశాక విభజన అనంతరం ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోనూ, కాల్వలు తెలంగాణ భూ భాగంలోకి వెళ్లడంతో ప్రాజెక్టును ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. దీంతో ఈ ప్రాజెక్టు కోసం కొన్న భారీ పైపులు, మోటార్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం: తమ్మిలేరు ప్రాజెక్టుకు పూర్వ వైభవం రావాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి తమ్మిలేరుకు గోదావరి జలాలను మళ్లించాలి. నా హయాంలోనే వైఎస్సార్ ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ పథకం తెలంగాణలో ఉండటంతో నీరు వచ్చే అవకాశాలు తక్కువ. చింతలపూడి పథకం ఒక్కటే మెట్ట రైతులకు శరణ్యం. ఘంటా మురళీరామకృష్ణ, మాజీ శాసన సభ్యులు, చింతలపూడి ఈసారి నిధులు వస్తాయి తమ్మిలేరు ప్రాజెక్టు అభివృద్ధికి ఈ సారి తప్పకుండా నిధులు మంజూరు అవుతాయి. ప్రభుత్వం జపాన్ బృందంతో చర్చలు జరుపుతోంది. జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇటీవల ఢిల్లీ వెళ్ళి నిధుల కోసం యత్నాలు చేశారు. ఎం.అప్పారావు, ఇరిగేషన్ డీఈ , తమ్మిలేరు -
14వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు
విద్యుత్ బకాయిలు, పీడబ్ల్యూఎస్ స్కీం, గ్రామ పంచాయతీల నిర్వహణ పేరిట 60 శాతం కోత ఇప్పటికే పంచాయతీలను వేధిస్తోన్న నిధుల కొరత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్పంచ్ల ఆగ్రహం దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైంది గ్రామ పంచాయతీల పరిస్థితి. ఇప్పటికే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరింత కుదేలు కానున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల్లో వివిధ సాకులు చూపి 60 శాతం కోత పెట్టడం సర్పంచ్‌లను ఆగ్రహానికి గురి చేస్తోంది. గ్రామాల పురోగతికి చేయూతనివ్వాల్సిందిపోయి వచ్చిన నిధులను వేరే వాటికి మళ్లించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్, పీడబ్ల్యూఎస్ బకాయిలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి :గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1158 గ్రామ పంచాయతీలకు ఇటీవల మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం నిధులను వివిధ అవసరాల పేరుతో మళ్లిస్తోంది. ప్రధానంగా గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలకు పరిష్కారం చూపాలనే కోణంలో కేంద్రం నేరుగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లిస్తోంది. ముందుగానే చెక్కులు.. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం దారి మళ్లుతున్నాయి. ఇందులోంచి 30 శాతం మేరకు విద్యుత్ బకాయిలకు, 20శాతం పీడబ్ల్యూఎస్(పబ్లిక్ వాటర్ సప్లయ్ స్కీం) స్కీం నిర్వహణ, పది శాతం గ్రామ పంచాయతీ నిర్వహణ పేరిట కోత విధిస్తోంది. ఇందుకు గాను ముందస్తుగానే సర్పంచ్ల నుంచి చెక్కు లు తీసుకుంటున్నారు. చెక్కులు ముందస్తుగా ఇస్తేనే గ్రామం లో చేసిన వివిధ అభివృద్ధి పనులకు ఎంబీ రికార్డుల మేరకు చెక్కులపై కౌంటర్ సంతకాలు చేస్తున్నారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఇది కూడా కేవలం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఈఓపీఆర్డీ కౌంటర్ సంతకంతోనే సాగుతోంది. సర్పంచ్‌లకు నోటీసులు 15 ఏళ్ల క్రితం ఏర్పడిన సీపీడబ్ల్యూఎస్ స్కీం బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల నుంచి సర్పంచ్‌లకు నోటీసులు అందాయి. ఉదాహరణకు గుండాల మండలంలోని తుర్కలాషాపురంలో నాలుగు సీపీడబ్ల్యూఎస్ స్కీం మోటార్ల విద్యుత్ బకాయిల కింద రూ.9.74లక్షలు చెల్లించాలని, ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని వంగాల గ్రామంలో గల మరో రెండు పీడబ్ల్యూఎస్ స్కీం విద్యుత్ మోటార్ల బకాయి బిల్లు కింద రూ.4.56లక్షలు చెల్లించాలంటూ సర్పంచ్‌లకు నోటీసులను అందజేశారు. తుర్కలషాపురం పంచాయతీ నుంచి బిల్లు వసూలు 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పీడబ్ల్యూఎస్ స్కీం నిర్వహణ కింద 20శాతం గ్రాంట్ చెల్లించాని జీఓఆర్టీ నెంబర్ 544 పీఆర్, ఆర్జీ తేదీ 28/08/2015న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తుర్కలషాపురం గ్రామ పంచాయతీ నుంచి అధికారు లు రూ.1,18,498 లక్షలు వసూలు చేశారు. గ్రామాల్ని గ్రామా లే పాలించుకోవాలన్నది 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం నేరుగా ఆర్థిక సంఘం నిధులను గ్రా మ పంచాయతీలకు విడుదల చేస్తోంది. గ్రామాల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉండగా, ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలు, పీడబ్ల్యూఎస్ స్కీం నిర్వహణ, పంచాయతీల నిర్వహణ పేరిట ముందస్తుగానే ఈఓఆర్డీల కౌంటర్ సంతకం ప్రయోగిస్తూ బి ల్లులు వసూలు చేస్తున్నారు. నిధులలేమితో గ్రామాల్లో సమస్య లు పేరుకుపోతున్నాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నాళ్లీ చెట్టుకింద చదువులు?!
జిల్లాలో 3,155 పాఠశాలలు నేటికీ రాని యూనిఫాం ఇండెంట్ పెట్టామంటున్న అధికారులు గతేడాదీ పంపిణీ చేయని వైనం 268 పాఠశాలల్లో వంటషెడ్లు లేవు నిధుల కొరతతో నిలిచిన మరమ్మతులు ఎల్‌ఎన్‌పురంలో పశువుల పాకలా పాఠశాల ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి తాగునీటి కుండీలు ఉంటే నీరుండదు.. మరుగుదొడ్లు ఉన్నా అలంకారప్రాయమే.. వానొచ్చిందంటే ఆవరణంతా జలమయమే.. శిథిలావస్థకు చేరిన భవనాలు.. ఇదీ మరో మూడు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ప్రభుత్వ పాఠశాలల్లోని దుస్థితి. జిల్లాలో చిన్నారుల భవితకు బాటలు దిద్దే పాఠశాలలు అసౌకర్యాలకు నిలయాలుగా మారుతున్నా పట్టించుకునేవారే లేరు. మరోపక్క పలు పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. మొగల్రాజపురం: స్థానిక రావిచెట్టు సెంటర్లోని తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ సుమారు 60 మంది చిన్నారులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నారు. కొండ ప్రాంతంలో నివశించే రోజువారి కూలీల పిల్లలు చదువుకోడానికి ఈ స్కూల్ దగ్గరలో ఉంది. ఈ స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు. కూర్చునేందుకు చెంచీలు లేవు, తరగతి గది లేదు. ఆరుబయట రావిచెట్టు నీడన తాత్కలికంగా నిర్మించిన ప్లాస్టిక్ రేకుల షెడ్డులోనే నేలపై కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. స్కూల్ కోసం నిర్మించిన చిన్న పాటి గదులు వీరికి ఏమాత్రం సరిపోవడం లేదు. అందువల్ల పక్కనే ఉన్న ఖాళీస్థలంలో చెట్టుకింద గోడలు లేకుండా ప్లాస్టిక్ రేకులతో నిర్మించిన ఒక షెడ్డులో విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్షం వస్తే చాలా ఇబ్బంది. పుస్తకాలూ తడిసిపోతుంటాయి. ఎండ కాలంలో సెలవులు ఇచ్చే వరకు వేడిని భరించాల్సిందే. వాటర్ ట్యాంకర్ రాకపోతే స్కూల్‌కు సెలవే స్కూల్లో ఉన్న మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ వాసులకు మంచి నీటిని సరఫరా చేయడానికి వచ్చే ట్యాంకర్ నుంచి ప్లాస్టిక్ డ్రమ్ములోకి నీటిని పట్టుకుని నిల్వ చేసుకుని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. మరుగుదొడ్డిని ఉపయోగించాలంటే విద్యార్థులు బక్కెట్‌తో నీటిని తీసుకుని వెళ్లాల్సిందే. ఏ కారణం చేతనైనా ట్యాంకర్ రాకపోతే ఆ రోజు స్కూల్‌కు సెలవే. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం కోసం కార్పొరేషన్ అధికారులు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, విద్యుత్ మోటారు అమర్చలేదు. ట్యాంకర్ రాని రోజూ స్కూల్‌కు అనధికారికంగా సెలవు ప్రకటిస్తున్నారు.విద్యార్థులు లెట్రిన్‌కు వెళతామంటూ లైన్కట్టి అడగడంతో వారిని ఇళ్ళకు పంపేస్తున్నారు. స్కూల్ మరుగుదొడ్డిలో నీరు రాకపోతే ఇంటికి వెళ్లవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు వరసగా లెట్రిన్ అనడంతో వారిని ఇంటికి పంపక తప్పని పరిస్థితి.ఇలా పదులు సంఖ్యలో విద్యార్థులు అడగడం తో స్కూల్‌కు అనధికారికంగా సెలవు ప్రకటిస్తున్నారు.ఈ సమస్యతో ఉపాధ్యాయులూ ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ ఆవరణలో ఉన్న కొద్ది పాటి స్థలంలో ప్రత్యేకంగా తరగతి గది నిర్మించాల్సిందిగా స్కూల్ సిబ్బంది కార్పొరేషన్ అధికారులకు విన్నవించుకోగా సుమారు రూ.4 లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న స్కూల్లో (రావిచెట్టు సెంటర్) కాకుండా సమీపంలోనే ఉన్న కార్పొరేషన్ పార్కు స్థలంలో స్కూల్ నిర్మిస్తే విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు వస్తాయని, అక్కడ నిర్మిచాల్సిందిగా పాఠశాల ఉపాధ్యాయులు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను కోరడంతో విషయం పెండింగ్‌లో పడింది. రోజులు గడుస్తున్నా ఏవిషయం తేలకపోవడంతో మంజూరైన నాలుగు లక్షల రుపాయల నిధులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెనక్కు పంపించేశారు. ఫలితంగా విద్యార్థులకు ఈఏడాది కూడా చెట్టు కింద చదువులు తప్పడం లేదు. అరకొర వసతులతో పాఠశాలలు కృష్ణలంక: స్థానిక పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు అరకొరగా ఉన్నాయి. ఈ స్కూల్ పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌కు ఒక్కటే మూత్రశాల ఉంది. సుమారు 400 మంది విద్యార్థులు ఉండే ఈ స్కూల్లో రెండు మూత్రశాలలు మాత్రమే ఉన్నాయి. గతంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా మూత్రశాలలుండేవి. ఇక్కడ కళాశాల నిర్మాణ నేపథ్యం లో వాటిని తొలగించడంతో సమస్యగా ఉంది. ఎస్వీరెడ్డి స్కూల్లోమూత్రశాలలు పిల్లలకు, ఉపాధ్యాయులకు వేరుగా నిర్మించుకున్నారు. విద్యార్థుల మూత్రశాల దుర్వాసన వెదజల్లుతోంది. రాణిగారితోట తాడికొండ సుబ్బారావు స్కూల్, వంగవీటి మోహనరంగా ఎలిమెంటరీ స్కూల్లోనూ మూత్రశాలతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. చెత్తతో నిండిన ప్రాంగణం ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రపరిచ వారు లే రు. దీంతో చెట్ల ఆకులు రాలి ప్రాంగణమంతా అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో స్కూల్ తెరిచే సమయానికి విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధ్యాహ్నం భోజనం పథకం స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం విషయంలోనూ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించడంలేదు. వారికి ప్రత్యేకమైన షెడ్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా పలు స్కూళ్లల్లో షెడ్లు లేకపోవడంతో వేరేచోట వండి తరలిస్తున్నారు. ఈనేపథ్యంలో నిర్వాహకులు పిల్లలకు చాలీ చాలని భోజనం పెడుతున్నారు. ఇటీవల తాడికొండ సుబ్బారావు స్కూల్లో మేయర్ ఆకస్మిక తనిఖీల్లో ఇది బయటపడింది. -
ఆస్తిపన్ను పెంపు?
ఆదాయం పెంచేందుకు బహుళ అంతస్తుల మదింపు సిద్ధమవుతున్న గ్రేటర్ అధికారులు సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఆదాయమార్గాలపై దృష్టిసారించిన ప్రభుత్వం...ఇందుకు ఆస్తిపన్ను పెంపుదల, వాణిజ్య భవనాల రీ అసెస్మెంట్ను ఓ మార్గంగా భావిస్తోంది. పన్ను పెంపుదల జరగకముందే నగరంలోని పలు వాణిజ్య భవనాల రీ అసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలో పలుచోట్ల ఎక్కువ విస్తీర్ణంలోని భవనాలకు తక్కువ విస్తీర్ణం చూపుతూ తక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ సిబ్బంది పాత్ర సైతం ఉందనే ఆరోపణలున్నాయి. మరోవైపు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, నివాస కేటగిరిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలు సైతం గణనీయంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ భవనాలు, బహుళ అంతస్తుల భవనాలను మరోమారు అసెస్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. -
నిధుల కొరత లేదు
తాగునీటి ఎద్దడిని నివారించండి మండల కమిటీలు అప్రమత్తంగా ఉండాలి {Oపెవేట్ బోర్లు అద్దెకు తీసుకోండి నగరానికి రెండు రోజుల్లో గోదావరి జలాలు తీసుకురావాలి పశుగ్రాసంపై దృష్టి సారించాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం హన్మకొండ : తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ నిధుల కొరత లేదని, ప్రభుత్వం తాగునీటికి ఎంతైనా వెచ్చిస్తుందన్నారు. తాగునీటి సమస్యపై మండల కమిటీలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతివారం మండల స్థాయి కమిటీ సమావేశమై తాగు నీటి పరిస్థితిని సమీక్షించాలన్నారు. గ్రామాల్లో బోర్లు అద్దెకు తీ సుకునే ముందు ఆ బోర్లలో నీటి లభ్యతను అం చనా వేసుకోవాలన్నారు. వరంగల్ నగరంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని నగర పాల క సంస్థ అధికారులను ఆదేశించారు. దేవాదుల ద్వారా గోదావరి నీటిని పంపింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగానిధులు మంజూరు చేసిం దన్నారు. ఈ పనులు పూర్తి కాకపోవడం పట్ల కడియం అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజు ల్లో పనులు పూర్తి చేసి గోదావరి నీటిని నగరాని కి తీసుకురావాలని మేయర్ నరేందర్, కమిషన ర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. విలీన గ్రా మాలకు ట్యాంకర్ల ద్వారా గానీ, ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొని గానీ నీటిని సరఫరా చేయూల ని ఆయన సూచించారు. నగరంలో చలి వేంద్రా లు పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. 40 చలి వేంద్రాలు ఏర్పాటు చేశామని కమిషనర్ సర్ఫరాజ్ చెప్పారు. తాగునీటికి కొరత లేదని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కడియం సూచించారు. ఉపాధిహామీ పనులు, పశుగ్రాసం పైనా ప్రతీ వారం సమీక్షించించాలని, పశుగ్రాసానికి ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ గతంలో అద్దెకు తీసుకున్న బోర్ల బకాయిలు చెల్లించామన్నారు. తాగునీటిపై నియోజకవర్గం ప్రత్యేకాధికారులు సమీక్ష జరుపాలని, సమస్య ఎక్కడుందో అధికారులు తెలుసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారుల్లో ఇంత నిర్లక్షం పనికి రాదని, పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే పదేళ్ళయినా జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ ం పూర్తికాదని మందలించారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి గ్రామాలను ఎంపిక చేసి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ మహానగర పాలక సంస్ణ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ నగరంలో తాగునీటిపై ఇప్పటికే ఐదు సార్లు సమీక్షించామని, లీకేజీలు లేకుండా మరమ్మతులు చేశామన్నారు. సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు గోదావరి నీటిని దేవాదుల ద్వారా పంపింగ్ చేసి నగరానికి రెండురోజుల్లో నీరు అందిస్తామని చెప్పారు. విలీన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ రాంచంద్, వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు బి.గంగారాం, డీఆర్డీఏ పీడీ వెంకట్‌రెడ్డి, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బడ్జెట్లో మనకు దక్కేదెంత!?
నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు గన్నవరం, బందరు పోర్టులకు నిధుల కొరత కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి పెడతారా? పర్యాటక రంగానికి సపోర్టు ఎంత.. గత బడ్జెట్లో పెట్టిన అంశాలు కార్యరూపం దాల్చని వైనం విజయవాడ: కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేడు అసెంబ్లీకి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తారనే అంశంపై జిల్లాలో వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. గత ఏడాది బడ్జెట్లో మన జిల్లాకు ఆశించినంతగా నిధులు కేటాయించలేదు. ఈసారి బడ్జెట్లోనైనా అవకాశాలు దక్కుతాయని ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజధాని ప్రాంతానికి న్యాయం జరగలేదు. రాష్ట్ర బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లోని ప్రాజెక్టులు వాటికి కావాల్సిన నిధులను పరిశీలిస్తే.. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు.. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచాలంటే 698 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. దీనిలో 438 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 180 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మిగిలిన వారు ముందుకు రాలేదు. రెండో విడత 260 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేయాలంటే సుమారు రూ.360 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు బడ్జెట్లో కేటాయించాలని కోరుతున్నారు. మచిలీపట్నం పోర్టు విస్తరణకు.. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి గాను 5,324 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించాల్సి ఉంటుంది. దీనికి గాను సుమారు రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఎప్పటికప్పుడు భూముల్ని సేకరిస్తామని హడావుడి చేయడమే తప్ప తగినంత నిధులు కేటాయించలేదు. ఆ నిధులకు కొత్త బడ్జెట్లో స్థానం దక్కుతుందేమో చూడాలి. మచిలీపట్నం పోర్టుతో పాటు క్రోకరీ, రిఫైరనరీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. వీటికి కావాల్సిన నిధులు కేటాయించాల్సి ఉంది. భవానీ ద్వీపం విస్తరణకు.. ఎన్నికలకు ముందు భవానీ ద్వీప విస్తరణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన సీఎం ఆ తరువాత మాటమార్చారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భవానీద్వీపంలో వాటర్‌గేమ్స్‌ను చాంపియన్ యాచ్ క్లబ్‌కు అప్పగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గత బడ్జెట్లోనే భవానీద్వీపాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కావాల్సిన నిధులు గత ఏడాది కాలంలో ఖర్చు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పర్యాటక రంగానికి నిధులిస్తారా.. రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారే తప్ప వాస్తవంగా నిధులు కేటాయించడం లేదు. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన దేవాలయాలను కలుపుతూ టెంపుల్ సర్కిల్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించవచ్చు. కొండపల్లి, ఉండవల్లి కొండల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. గత బడ్జెట్లో హామీలు ఇచ్చి.. గత ఏడాది మార్చి 12న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బందరులో మెరైన్ అకాడమి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. హస్తకళల అభివృద్ధి కోసం జిల్లాలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం చేశారు.విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చాలని గత బడ్జెట్లో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో విజయవాడ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసింది. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు గత బడ్జెట్లో రూ.111 కోట్లు కేటాయించినా అరకొరగానే పనులు జరిగాయి. ఆ పనుల తాలుకా బిల్లులు ఇవ్వకపోవడంలో కొత్తగా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇక పులిచింతల, పట్టిసీమ పనులు సాగుతూనే ఉన్నాయి. ఆగిరిపల్లిలో ఆయుర్వేద యూనివర్శిటీ ఏర్పాటుచేస్తామన్న ప్రతిపాదన ముందుకు సాగలేదు. కృష్ణాజిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఊసే నేతలు ఎత్తడం లేదు. -
ఎడారిలా..
తడి ఆరిన రక్షిత నీటి పథకాలు పడకేసిన మంచినీటి పథకాలు వెంటాడుతున్న నిధుల కొరత కనీస మరమ్మతులకు నోచుకోని వైనం ఎండిపోతున్న చెరువులు, బావులు పాలకుల వైఫల్యంపై గ్రామస్తుల ధ్వజం నిధుల లేమి.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి గ్రామీణులకు గుక్కెడు నీరందని దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల సామూహిక రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) పడకేశాయి. ఇందులోని మోటార్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడినా కనీస మరమ్మతులు చేయలేని పరిస్థితి. ఫలితంగా వేసవికి ముందే జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. విజయవాడ : జిల్లాలో 374 తాగునీటి చెరువులు ఉన్నాయి. వర్షాభావం, కాలువలకు నీటి విడుదలలో జాప్యం కారణంగా అడుగంటాయి. సామూహిక రక్షిత మంచినీటి పథకాల ద్వారా బిందెడు నీరు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందని దుస్థితి నెలకొంది. ఈ చెరువుల ఆధారంగానే రక్షిత నీటి పథకాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఉప్పునీరే దిక్కవుతోంది. ఈ నీరు తాగడం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. నిధుల కొరత గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు జిల్లా పరిషత్‌కు జమ అయ్యేవి. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పలువురు సర్పంచులు సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ఆలోచిస్తుండడంతో గ్రామీణ నీటి సరఫరా శాఖను నిధుల కొరత వేధిస్తోంది. దీనికితోడు జెడ్పీ పాలకవర్గ సభ్యులు తాగునీటి సరఫరాలో నిధులకు సంబంధించి పొదుపును పాటిస్తుండడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ బిల్లుల భారం, మోటార్ల కొనుగోలు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వివిధ సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. జిల్లాలోని 717 గ్రామాలకు సీపీడబ్ల్యు పథకాల ద్వారా తాగునీరు అందించేందుకు ఏడాదికి రూ. 15.84 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా తాగునీటి కొరత తీరడం లేదు. కంచికచర్ల మండలంలోని 42 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కృష్ణానదిలో బత్తినపాడు తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. నదిలో నీరు లేకపోవడంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. గన్నవరం నియోజకవర్గంలో ఏలూరు కాలువపై ఆధారపడి నడుస్తున్న రక్షిత నీటి పథకాల్లో అల్లాపురం, తెంపల్లి, బాపులపాడు, పెరికీడు ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణంగా ఏలూరు కాలువ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఈ ప్రాజెక్టులకు తరలించాల్సి ఉంది. అనంతరం ప్రాజెక్టులోని నీటిని ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధిచేసి గ్రామాలకు సరఫరా చేస్తుంటారు. ఏడాది కాలంలో ఏలూరు కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోవడంతో ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల సుమారు 30 గ్రామాలకు నీటిని సరఫరా చేసే అల్లాపురం, తెంపల్లి ప్రాజెక్టులు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయి. బాపులపాడు ప్రాజెక్టు నిర్మించి ఆరేళ్లయినా మరమ్మతుల కారణంగా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పెరికీడు ప్రాజెక్టుకు నీటిని లిప్ట్ చేసే పైపులైన్లు రెండేళ్ల కిందట రోడ్డు విస్తరణలో పగిలిపోవడంతో మూలనపడింది. పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరులో 49 రక్షిత మంచినీటి పథకాలు, 17 డెరైక్ట్ పంపింగ్ స్కీములు ఉన్నాయి. 1.85 లక్షల జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చటానికి కొత్తగా నాలుగు ట్యాంకులకు శంకుస్థాపనలు చేశారు. పనులు ప్రారంభానికి నోచలేదు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 45 రక్షిత మంచినీటి పథకాలుండగా వీటిలో ఆరు పథకాలు ఆర్‌డబ్ల్యుఎస్ నిర్వహణలో ఉన్నాయి. కోడూరు, నాగాయలంక మండలాల్లోని పది గ్రామ పంచాయితీలకు తాగునీరు అందించే కమ్మనమోల రక్షిత మంచినీటి చెరువు పూర్తిగా అడుగంటింది. ఇక్కడ రెండురోజులకొకసారి ఒకపూట మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక మండలంలో ఎదురుమొండి రక్షితనీటి పథకం పూర్తిగా ఎండిపోయింది. జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లిలో ఏర్పాటు చేసిన తాగునీటి పెలైట్ పథకం నిరుపయోగంగా మారింది. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడు, గరికపాడు, రామచంద్రునిపేట గ్రామాలకు గత ఏడాది గ్రామీణ నీటి సరఫరా శాఖ రూ.2.10 కోట్ల నిధులతో పెలైట్ ప్రాజెక్టు ద్వారా పాలేటిలో బోరు వేసి నీరు అందించేందుకు చర్యలు చేపట్టింది. మైలవరం మండలంలో కృష్ణా జలాల పంపిణీకి పైలట్ ప్రాజెక్టు పనులు పూర్తయినా శివారు గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కావడంలేదు. ఆయా గ్రామాల ప్రజలు బోరునీటినే తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు, కేతనకొండ, దాములూరు, చిలుకూరు, కాచవరం, కొటికలపూడి గ్రామాల్లో తాగునీటి సమస్య వుంది. ఈ గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 450కోట్లతో పైలట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టినా పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాట్రాయి మండలంలోని చిన్నంపేట, కోటపాడు, తుమ్మగూడెం, చనుబండ, చీపురుగూడెం, పోతనపల్లిలలో గ్రామాలలో బోర్లు ఎండిపోవడం వల్ల నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పామర్రు మండలం ఐనంపూడిలో తాగునీటికి వినియోగించే బావిలో నీరు అడుగంటడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఎలకుర్రులో చెరువులు ఎండిపోవడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అధికారులు అందజేస్తున్నారు. నెమ్మలూరు తాగునీటి చెరువులో నీరు అడుగంటడంతో కొద్దిపాటిగా ఉన్న నీటినే తాగునీరుగా వాడుకుంటున్నారు. జుఝవరంలో ఫిల్టర్ బెడ్లు లేకపోవడంతో చెరువు నుంచినేరుగా కలుషిత నీరే ఉపయోగించుకుంటున్నారు. -
ఎన్ఈసీ గ్యాస్ బ్లాక్‌లో విక్రయానికి నికో వాటాలు
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న నికో రిసోర్సెస్ .. ఎన్ఈసీ-25 గ్యాస్ బ్లాక్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇందులో తనకున్న 10 శాతం వాటాలను భాగస్వామ్య సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీకి విక్రయించనున్నట్లు 2016 రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. ఎన్ఈసీ-25 బ్లాక్‌లో 60% వాటాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన ఆపరేటర్‌గా ఉంది. బీపీకి 30%, నికో రిసోర్సెస్‌కు 10% వాటాలున్నాయి. ఒడిషాలో తీరానికి దగ్గర్లోని ఎన్ఈసీ-25 బ్లాక్‌లో సుమారు 1.032 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఆర్థిక కష్టాల్లో ఉన్న నికో.. సమస్యల నుంచి గట్టెక్కేందుకు కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రంలో కూడా తనకున్న వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. -
మౌలిక రంగానికి ‘పేమెంట్స్’ బూస్ట్!
- అందుబాటులోకి ఏటా రూ. 14 లక్షల కోట్ల నిధులు - ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో అంచనా.. ముంబై: దేశంలో కొత్తగా ఏర్పాటుకానున్న పేమెంట్స్ బ్యాంకులు.. మౌలిక(ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగానికి చేదోడుగా నిలవనున్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్న ఇన్ఫ్రా రంగానికి ఏటా రూ.14 లక్షల కోట్ల మేర అందుబాటులోకి వచ్చేందుకు పేమెంట్స్ బ్యాంకులు వీలుకల్పించనున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో అంచనా వేసింది. ‘మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవల విస్తరణకు పేమెంట్స్ బ్యాంకులతో సాధ్యమవుతుంది. మరోపక్క, ఇవి సమీకరించే డిపాజిట్ నిధులను కేవలం ప్రభుత్వ బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కారణంగా ఈ మొత్తమంతా ఇన్ఫ్రా రంగానికి నిధులందించేందుకు అందుబాటులోకి వస్తుంది. మా అంచనాల ప్రకారం ఏటా ఈ విధంగా రూ.14 లక్షల కోట్ల అదనపు నిధులు లభ్యమయ్యే అవకాశం ఉంది. వివరంగా చూస్తే.. రోజువారీ అవసరాలకోసం ప్రజలు తమదగ్గరున్న డబ్బులో 13 శాతాన్ని క్యాష్ రూపంలోనే ఉంచుకుంటారు. ఈ మొత్తంలో 1 శాతం తగ్గినా.. డిపాజిట్ల రూపంలో అదనంగా రూ.15 లక్షల కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. ఇందులో 75 శాతాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులకు వీలుంది. అంటే రూ.11.25 లక్షల కోట్లు లభించినట్లే’ అని ’ అని నివేదిక తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్టెల్ సహా మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం రూ. లక్ష వరకూ ఇవి డిపాజిట్లను సమీకరించవచ్చు. దేశంలో ప్రస్తుతం ఉన్న చిన్న వాణిజ్య బ్యాంకుల సగటు డిపాజిట్ల పరిమాణం రూ. లక్ష కోట్లుగా ఉంది. ఇందులో కనీసం నాలుగో వంతును డిపాజిట్లుగా సమీకరించగలిగితే... 11 పేమెంట్స్ బ్యాంకులు కలిపి ఏడాదిలో దాదాపు రూ.2.75 లక్షల కోట్లను సమకూర్చుకోగలవని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇక భారత్‌లో చెలామణీలో ఉన్న బ్యాంక్ నోట్లు, నాణేల విలువ కూడా చాలా అధికంగా ఉందని(జీడీపీలో 12 శాతం).. ఏవైనా చెల్లింపులకు క్యాష్‌ను వాడేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతుండటమే దీనికి కారణమని నివేదిక పేర్కొంది. పేమెంట్స్ బ్యాంకుల రాక, అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రభావంతో దేశంలోని మొత్తం మనీ సప్లైలో నగదు పరిమాణం భారీగా తగ్గి.. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. బ్రిటన్‌లో ఈ పరిమాణం 2 శాతం కాగా, ఆస్ట్రేలియాలో 3 శాతం, జపాన్‌లో 6 శాతంగా ఉంది. -
‘వసతి’కి చెదలు!
- దయనీయ స్థితిలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు - మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత - ప్రతిపాదనలు తెప్పించుకుని పట్టించుకోని ప్రభుత్వం - ఒక్కో ఎస్సీ హాస్టల్‌కు రూ. 14,990 కేటాయింపు - ఆ నిధులకూ ట్రెజరీలో అడ్డుకట్ట - ఒక్కో బీసీ హాస్టల్‌కు రూ.30 వేలు ఖర్చు చేసి బిల్లు పెట్టాలని సూచన - డబ్బు లేదని చేతులెత్తేసిన బీసీ హెచ్డ బ్ల్యూఓలు - ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ వసతి గృహాలు కడప రూరల్ : జిల్లాలోని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు పడకేశాయి. సాధారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన రోజుల్లో ఆయా హాస్టళ్లలో మరుగుదొడ్లు, నీటి సరఫరా, భవనాలకు సున్నం వేయడం, ఫ్లోరింగ్‌ను బాగు చేయడం, విద్యుత్ సరఫరా, తలుపులు, కిటికీలను బాగు చేయడం తదితర పనులు చేపట్టాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు దయనీయంగా మారాయి. అసౌకర్యాలతో పోరాడుతూనే హాస్టల్ విద్యార్థులు ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలను సాధించి తమ సత్తాను చాటుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ హాస్టళ్లు దయనీయం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 143 బాలబాలికల హాస్టళ్లు ఉన్నాయి. అందులో 14 వేల మంది వసతి పొందడానికి అవకాశం ఉండగా, గడిచిన 2014-15 విద్యా సంవత్సరంలో ఆ హాస్టళ్లలో పది వేల మంది విద్యార్థులు వసతి పొందారు. మొత్తం 143 హాస్టళ్లకుగాను 102 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో, 41 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. మొదట రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా అధికారులు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొత్తగా ప్రభుత్వ భవనాల్లో నడిచే హాస్టళ్లలో మరుగుదొడ్లు, స్నానపుగదుల కొత్త భవనాల నిర్మాణంతోపాటు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, శ్లాబ్ తదితర శాశ్వత పనులు, మరమ్మత్తుల కోసం రూ. 6.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మైనర్ పనుల కింద తాత్కాలికంగా అత్యవసరంగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఆ మేరకు అధికారులు 82 పనులకు రూ.3.55 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపా రు. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ప్రభుత్వ భవనాల్లో నడిచే హాస్టళ్లలో తాత్కాలిక, మౌలిక సదుపాయాల కోసం ఒక్కో హాస్టల్‌కు నామమాత్రంగా రూ.14,900 కేటాయించింది. అయితే, ఇందుకు సంబంధించి ట్రెజరీలో బిల్లులు మంజూరు కాకపోవడంతో హెచ్‌డబ్ల్యుఓలు చేసేది ఏమిలేక మిన్నకుండిపోయారు. బీసీ హాస్టళ్లు దారుణం జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 59 బాలబాలికల హాస్టళ్లు ఉన్నాయి. అందులో 38 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో, 21 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ హాస్టళ్లలో గడిచిన విద్యా సంవత్సరం ఏడు వేల మంది వరకు వసతి పొందారు. కాగా, ఈ సెలవుల్లో బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగమైన ఏపీఈడబ్ల్యుఐడీసీకి ఒక్కో హాస్టల్లో రూ.30 వేల వ్యయంతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ శాఖ ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కొనసాగించాలంటే ఆలస్యమవుతుందని సంకల్పించింది. దీంతో ఆయా హాస్టల్ హెచ్డబ్ల్యుఓలే రూ.30 వేలను భరించి తమ హాస్టళ్లలో వసతుల కల్పన కోసం ఖర్చు పెడితే అందుకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత ఖర్చు మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. అయితే, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు (హెచ్‌డబ్ల్యుఓలు) తమ వద్ద అంత డబ్బు లేదని చేతులెత్తేసినట్లు తెలిసింది. ఇదివరకే డైట్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఆ భారం తమపైన పడిందని, ఇప్పుడు అదనంగా రూ. 30 వేలను ఖర్చు చేయాలంటే ఏ విధంగా చేయాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, అందులో ఇద్దరు హెచ్‌డబ్ల్యుఓలు మాత్రమే రూ.30 వేలతో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసినట్లు తెలిసింది. నిరుపేదల సంక్షేమం పట్టదా? గతంలో ఏడాదికి రూ. 20 వేల చొప్పున కేటాయింపులు చేపట్టాలనే నిబంధన ఉం డేది. ఇప్పుడు అది కూడా లేదు. పైగా మెటీరియల్, కూలీల ఖర్చుకూడా అమాంతం పెరిగాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఏ మూలకు సరిపోతుందని హెచ్‌డబ్ల్యుఓలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపాదనలు పంపాం: ప్రభుత్వ సూచనల మేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పంపాం. ఒక్కో ఎస్సీ హాస్టల్‌కు రూ. 14,900 మంజూరు చేసింది. ఆ డబ్బులు హెచ్‌డబ్ల్యుఓలకు అందాల్సి ఉంది. డబ్బులు అందగానే పనులు ప్రారంభిస్తాం. -
టీబీ కేంద్రంలో నిధుల మేత
గుంటూరు మెడికల్: జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో నిధులను ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ కేంద్రం పరిధిలో ఎక్కువశాతం మంది సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్టెక్నీషియన్లు కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి టీఏ, డీఏలు ఇవ్వకూడదు. కార్యాలయ అధికారులు, సిబ్బంది నిబంధనలను పక్కనపెట్టి ఎనిమిది మంది కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కు ఆరునెలలుగా ఒక్కొక్కరికి నెలకు 18వేల రూపాయల చొప్పున చెల్లించారు.వ్యాధి నిర్ధారణ కోసం రోగి కళ్లెను సేకరించి దానిని హైదరాబాద్ పంపటానికి ఉపయోగించే థర్మాకోల్ బాక్స్‌లను జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఇరువురు కాంట్రాక్ట్ ఉద్యోగుల చేత కొనుగోలు చేయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్తిపాడులో పనిచే స్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహించకుండానే అలవెన్స్‌లు అన్నీ దిగమింగుతున్నాడు. రోగులను గుర్తించేందుకు, రోగులుచేత రెగ్యులర్‌గా మందులు మింగిస్తూ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రభుత్వం ఉద్యోగులకు టూవీలర్స్ అందజేసింది. వాహనాలపై తిరగకుండానే కొందరు ఉద్యోగుల ఫోన్లలో సమాచారం సేకరిస్తూ పెట్రోలు బిల్లులు తీసుకుంటున్నారు. కార్యాలయంలో ఫైళ్లు భద్రం చేసేందుకు అవసరమైన బీరువాలను కార్యాలయం సిబ్బంది మార్కెట్ ధర కంటే అధిక ధరలకు కొనుగోలు గుంటూరు మెడికల్: జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో నిధులను ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ కేంద్రం పరిధిలో ఎక్కువశాతం మంది సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్టెక్నీషియన్లు కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి టీఏ, డీఏలు ఇవ్వకూడదు. కార్యాలయ అధికారులు, సిబ్బంది నిబంధనలను పక్కనపెట్టి ఎనిమిది మంది కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కు ఆరునెలలుగా ఒక్కొక్కరికి నెలకు 18వేల రూపాయల చొప్పున చెల్లించారు.వ్యాధి నిర్ధారణ కోసం రోగి కళ్లెను సేకరించి దానిని హైదరాబాద్ పంపటానికి ఉపయోగించే థర్మాకోల్ బాక్స్‌లను జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఇరువురు కాంట్రాక్ట్ ఉద్యోగుల చేత కొనుగోలు చేయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్తిపాడులో పనిచే స్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహించకుండానే అలవెన్స్‌లు అన్నీ దిగమింగుతున్నాడు. రోగులను గుర్తించేందుకు, రోగులుచేత రెగ్యులర్‌గా మందులు మింగిస్తూ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రభుత్వం ఉద్యోగులకు టూవీలర్స్ అందజేసింది. వాహనాలపై తిరగకుండానే కొందరు ఉద్యోగుల ఫోన్లలో సమాచారం సేకరిస్తూ పెట్రోలు బిల్లులు తీసుకుంటున్నారు. కార్యాలయంలో ఫైళ్లు భద్రం చేసేందుకు అవసరమైన బీరువాలను కార్యాలయం సిబ్బంది మార్కెట్ ధర కంటే అధిక ధరలకు కొనుగోలు. -
గడువులోనే గడబిడ!
ఫ్లాట్ల అప్పగింతలో ఆలస్యం.. నిధుల కొరత 2014లో దేశంలో స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం రాజకీయ అనిశ్చితి.. నిర్మాణ పనుల్లో ఆలస్యం.. నిధుల కొరత.. వెరసి 2014లో దేశంలో స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం ఎదురైంది. ఇచ్చిన గడువులోగా ఫ్లాట్లను అందించడంలో బిల్డర్లు విఫలమవ్వడంతో రియల్ అమ్మకాలూ తగ్గుముఖం పట్టాయి. కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు.. చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు, విక్రయించేందుకే రియల్టర్లు మొగ్గు చూపారని ప్రాప్‌ఈక్విటీ సంస్థ నివేదిక చెబుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో చేపట్టిన సర్వే సారాంశంపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది. గతేడాదితో పోల్చుకుంటే ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొత్త ప్రాజెక్ట్‌లు 42 శాతం తగ్గుముఖం పట్టాయి. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో 59 శాతం తక్కువగా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. 2013లో హైదరాబాద్‌లో 18,515 కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది కేవలం 7,589 మాత్రమే ప్రారంభమయ్యాయి. -51 శాతంతో ముంబై రెండో స్థానంలో నిలిచింది. 2013లో ముంబైలో 80,953లో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 39,491, అలాగే -48 శాతంతో ఢిల్లీలో 2013లో 88,879 ప్రారంభం కాగా.. 2014లో 46,636 ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అదే -26 శాతంతో బెంగళూరులో గతేడాది 63,798లకు గాను.. ఈ ఏడాది 47,207 ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. కేవలం కోల్‌కతా స్థిరాస్తి వ్యాపారంలో మాత్రమే కాసింత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గతేడాది 15,043 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 5 శాతం పెరుగుదలతో 15,866 కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. గడువు గండం.. 2014లో ప్రతి త్రైమాసికంలోనూ స్థిరాస్తి అమ్మకాలు పడిపోతూ ఉన్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయనే నమ్మకంతో కొనుగోలుదారులు ఇంకా వేచి చూస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సర్వే చెబుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏడు ప్రధాన నగరాల్లో కేవలం 23.5 శాతం మాత్రమే ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించారు. మొ త్తం 4,70,183 ఫ్లాట్లను అందించాల్సి ఉండగా.. కేవలం 1,10,510 ఫ్లాట్లకు మాత్రమే తాళాలను అందించగలిగారు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి, ఉన్న వాటిని విక్రయించడానికే నిర్మాణ సంస్థలకు చుక్కలు కనిపిస్తున్నాయి మరి. రిజిస్ట్రేషన్ శాఖకు గండే.. 2014లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికీ భారీగానే గండి పడింది. లోన్ల విషయంలో కనికరించని బ్యాంకులు, రాజకీయాంశం, ఎన్నికలు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లాట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభావితం చేశా యి. రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఏడాది అక్టోబర్ వరకు హైదరాబాద్‌లో 525.69 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 277.99 కోట్లను గడించింది. రంగారెడ్డి జిల్లాలో చూస్తే.. 1,346.16 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. 690.84 కోట్లను మాత్రమే ఆర్జించింది. -
వాహన చోదకులకు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : నిధుల కొరతతో ఏళ్ల తరబడి జిల్లాలోని ప్రధాన రహదారులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రధాన రహదారులను కలిపే సింగిల్‌రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకైన వంతెనలు, శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టులు పెరిగిన వాహన రద్దీకి అనుగుణంగా లేవు. గతంలో పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలు రోడ్ల విస్తరణ, మరమ్మతుల కోసం అరకొరగా నిధులు సాధించుకున్నారు. దీంతో జిల్లాలో చాలా చోట్ల గుంతలు తేలిన రోడ్డపై వాహనదారులు సర్కస్ ఫీట్లతో ప్రయాణం చేస్తున్నారు. రోడ్ల విస్తరణ, మరమ్మతుల కోసం ప్రస్తుతం రూ.వేయి కోట్లతో ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు పంపడంతో జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. జిల్లాలో డబుల్‌రోడ్డు లేని 31మండల కేంద్రాలకు రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు రహదారులు, భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 376.76 కిలోమీటర్ల మేర సింగిల్ లేన్ రహదారులను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు రూ.452.90 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సిద్ధం చేశారు. వీటితో పాటుగా జిల్లా మీదుగా వెళ్లే రాష్ట్ర, జాతీయ రహదారులను కలుపుతూ వెళ్లే 25 సింగిల్ రోడ్లను కూడా డబుల్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించారు. వీటితో పాటు పలు రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ఇరుకైన వంతెనలను విస్తరించడం, శిథిలావస్తకు చేరిన వంతెనలు, కల్వర్టులను తిరిగి నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధాన అంతర్గత రోడ్ల విస్తరణకు రూ.524.91 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. జిల్లాలో రోడ్ల విస్తరణ, మరమ్మతులకు సుమారు రెండేళ్లుగా నిధులు విడుదల కావడం లేదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే గతంలో తమ నియోజకవర్గ పరిధిలోని రోడ్లను మెరుగు పరిచేందుకు కొంత మేర నిధులు సాధించగలిగారు. తాజా ప్రతిపాదనల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రోడ్లు అన్నింటినీ విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం విశేషం. విడతల వారీగా నిధులు? డబుల్ రోడ్లు, రాష్ట్ర హైవేలను కలుపుతూ సాగే 25 అంతర్గత సింగిల్ రోడ్లు 759.78 కిలోమీటర్లున్నట్లు గుర్తించారు. అయితే ప్రతిపాదనల్లో మాత్రం 378 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.524.91 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపించారు. మిగిలిన పనులను తర్వాత దశల్లో చేపట్టే అవకాశముందని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. అధికారులు భారీగా అంచనాలు రూపొందించినా, ప్రభుత్వం వీటిలో ఎంతమేర నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే జిల్లాలోని రోడ్లు అద్దాన్ని తలపిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయనున్నాయి. ప్రతిపాదనలకు ఆమోదం ఇలా! జిల్లాలో వివిధ రహదారులను సింగిల్ లై న్ నుంచి డబుల్ లేన్లుగా మార్చేందుకు, ఇరుకు వంతెనల విస్తరణ, కల్వర్టుల పునర్నిర్మాణానికి జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలకు పాలనాపరమైన ఆమో దం లభించింది. ఈ మేరకు రాష్ట్ర రవా ణా, రోడ్లు, భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు పంపిన ప్రతిపాదనలకు యదాతథంగా ఆమోదం లభించినట్లు సమాచారం. జిల్లాలో 31 మండలాలను జిల్లా కేంద్రంతో కలిపే సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు రూ.452.90 కోట్ల ప్రతిపాదనలకు యథాతథంగా ఆమోదం. జిల్లాలో 46 హైలెవల్ వంతెనల నిర్మాణానికి రూ.3.18 కోట్లకు ఆమోదం. ప్రధాన మార్గాల్లో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు 25 పనులకు 524.91 కోట్లకు ఆమోదం. స్టేట్ హైవే కలిపే రహదారులకూ వర్తించాలని ప్రతిపాదనలు హైదరాబాద్- బీజాపూర్ (స్టేట్ హైవే-04), మహబూబ్‌నగర్- చించోలి (స్టేట్ హైవే- 23), మరికల్-మినాస్‌పూర్ (స్టేట్ హైవే- 22)లను కలిపే తునికిమెట్ల- నారాయణపేట రోడ్డును సింగిల్ రోడ్డు నుంచి డబుల్ రోడ్డుగా మార్చాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదించారు. మూడు స్టేట్ హైవేలను కలుపుతూ 67 కిలోమీటర్ల సాగే ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే కోస్గి, మద్దూరు, దామరగిద్ద, నారాయణపేట మండల కేంద్రాలకు రాకపోకలు సులభతరమవుతాయి. ఈ మార్గంలో ఉండే తునికిమెట్ల, నమ్దాపూర్, బాపల్లి తండా, హకీంపేట, సర్జగానిపేట, కోస్గి, గుండుమాల్, దోరెపల్లి, క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి తదితర గ్రామాల ప్రజల ఆర్థికాభివృద్ధికి కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. డబుల్ రోడ్ల విస్తరణ తీరిలా.. కేంద్రాలు పనులు పొడవు నిధులు (కి.మీ) (కోట్లలో) మండలాల రోడ్లు 39 376.762 452.90 ప్రధాన రోడ్లు 25 378.000 524.91 మొత్తం 64 754.762 977.81 -
మెడికల్ కళాశాలకు నిధుల కొరత
నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాలకు నిధుల కొరత వేధిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కళాశాల కోసం అనుమ తి కోసం తంటాలు పడిన అధికారులు ప్రస్తుతం నిధుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్వహణ కోసం కావల్సిన నిధులు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కళాశాల అవసరాల మేరకు తక్షణమే రూ. 91 కోట్లు మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ జిజియాబాయి గత జూన్‌లో ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినా, నేటికీ స్పందన లేదు. అందుబాటులో లేని భవనాలు కళాశాలలో రెండవ సంతవ్సరం మొదలు కావడంతో నిధుల అవసరం ఏర్పడింది. ముఖ్యంగా రెండవ సంవత్సరం విద్యార్థులకు వసతి గృహాలు, ప్రొఫెసర్ల నివాసాల నిర్మాణానికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. మ్యూజియం ఏర్పాటు కోసం సుమారు రూ. 20 లక్షలు కావాలి. అంతేకాకుండా, ఫార్మ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. వచ్చే ఏడాది మూడవ సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ప్రస్తుతం భవన నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలి. అలాగే ఆసుపత్రి, కళాశాలకు పరికరాలను కొనుగోలు చేయాలి. ప్రయోగశాలల సౌకర్యం కల్పించాలి. వీటి కోసం ఉన్నతాధికారులకు విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. అప్పుడు కళాశాల నిర్వహణ కోసం రూ. 100 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతోనే కళశాల ఏర్పాటు జరిగింది. అనంతరం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి హయాంలో మరో రూ. 60 కోట్లు మంజూరయ్యాయి. వీటితోనే నేటికీ కళాశాల కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవలే అటవీశాఖ, ఆర్అండ్బీ స్థలాన్ని మెడికల్ కళాశాలకు స్వాధీనం చేశారు. ఇందులో రెండవ సంవత్సరం విద్యార్థులకు భవనాలు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించే అవకాశం ఉంది. గత ఆగస్టు నెలలో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు. రూ. 60 కోట్ల రూపాయలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిధుల విడుదల మాత్రం జరుగడం లేదు. -
మురిగిపోతున్న సంక్షేమం
సాక్షి, బెంగళూరు : నిధుల కొరత వల్ల పలు ప్రభుత్వ విభాగాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుంటాయి... లేదా నిలిచిపోతుంటాయి. అయితే రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ విభాగం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఏటా వేలాది కోట్లాది రూపాయలు విడుదలవుతున్నా.. అందులో సగానికి సగం కూడా నేతలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కావడం లేదు. దీంతో రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్రంలో ‘సువర్ణ గ్రామోదయ’ పథకం కింద ప్రతి ఏడాదికి కొన్ని గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. ఆ గ్రామానికి ఏడాది నుంచి మూడేళ్లలోపు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి.. అక్కడి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 2007 అక్టోబర్ 2 ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 5,543 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకుంది. వాటిల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.2,422 కోట్లను విడుదల చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యం, స్థానిక రాజకీయ పరిస్థితులు... కారణాలేవైనా ఇందులో కేవలం రూ.1,704 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో కేవలం 40 శాతం వాటిల్లోనే అన్ని పనులు పూర్తయ్యాయి. మిగిలిన 60 శాతం గ్రామాల్లో ఇంకా పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నీటి ఎద్దడి నిధులూ అంతే.. రాష్ట్రంలో మూడేళ్లగా ఏర్పడిన వర్షాభావం వల్ల చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దటి తీవ్రరూపం దాల్చింది. ఈ సమయంలో తాత్కాలిక, శాశ్వత తాగునీటి సరఫరా పథకాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.2,100.56 కోట్లను విడుదల చేయగాా.. అందులోనూ రూ. 1,406.05 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మిగిలిన సొమ్ము ఇప్పటికీ ఖజానాలో అలాగే ఉండిపోయింది. నిర్ధిష్ట కాల వ్యవధిలోపు నిధులను ఖర్చు చేయక పోవడంతో తిరిగి ఆ సొమ్ము కేంద్రానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ స్వయానా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ విషయమై ఆ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... ‘నిధులు ఖర్చుకాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ అనిశ్చితి కూడా కారణం. ప్రభుత్వానికి మరోసారి విన్నవించుకుని నిధులను పూర్తి స్థాయిలో ఖర్చుచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం.’ అని పేర్కొన్నారు.