వర్సిటీ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం
ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ 2008 జూన్ 25న ఏర్పడింది. కొత్త యూనివర్సిటీలు బలోపేతం కావాలంటే ప్రత్యేక నిధులు అవసరం. సీనియర్ వర్సిటీల స్థాయికి చేరుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందులో భాగంగానే కొత్త యూనివర్సిటీల నుంచి ప్రభుత్వం అనుమతులు కోరింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు అందజేశారు.
కొత్తగా ఏర్పాటైన వర్సిటీలు ఆదికవి నన్నయ్య, శ్రీకృష్ణ, విక్రమసింహపురిలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.33.45 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పలు నిర్మాణాలు చేయాలని అధికారులు భావించారు. అధికారులు ప్రతిపాదించిన వాటిలో రూ.6 కోట్లతో పరిపాలన భవనం, రూ.90 లక్షలతో న్యాయకళాశాల, రూ.90 లక్షలతో విద్యావిభాగం భవనాలు, రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ. 2.50 కోట్లతో క్రికెట్ మైదానం, రన్నింగ్ ట్రాక్‌కు రూ.1.50 కోట్లు, జిమ్ ఏర్పాటుకు రూ.1.50 కోట్లు, ఎగ్జామినేషన్స్ బ్లాక్‌కు రూ. 3.45 కోట్లు, వసతిగృహం భవనాలకు రూ.2.65 కోట్లు, తరగతి గదుల నిర్మాణం కోసం రూ.4.05 కోట్లు, రూ.8 కోట్లతో అకడమిక్ భవనాల నిర్మాణం చేపట్టాలని భావించారు.
ఉన్నత విద్యాశాఖ మంజూరు చేసిన ఈ నిధులను వర్సిటీలకు నేరుగా మంజూరు చేయకుండా రోడ్లు, భవనాల శాఖకు ఖర్చు, అంచనాల బాధ్యత అప్పగించారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు వర్సిటీకి వచ్చి అంచనాలు రూపొందించారు. నిర్మాణాలకు అనువైన స్థలాలను సైతం గుర్తించారు. అంచనాలకు అనుగుణంగా పనులకు టెండర్లు వేయనున్నట్లు ప్రకటించారు. అయితే వర్సిటీ అధికారులు ఆర్‌అండ్‌బీకి కాకుండా, కేంద్ర ప్రజా పనుల విభాగానికి పనులు అప్పగిస్తే నాణ్యత ఉంటుందని భావించారు.
నిధుల మంజూరుపై నీలినీడలు: ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ నిధుల మంజూరుపై నీలినీడలు అలుముకున్నాయి. గత రెండేళ్ల నుంచి ప్రదిపాదన దశలో ఉన్న నిధులు మంజూరు కావడం లేదు. ఉన్నత విద్యామండలి, ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి సైతం వర్సిటీ అధికారులు తీసుకువెళ్లారు. అయినా ప్రభుత్వం నిధుల మంజూరు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రత్యేక నిధులు బడ్జెట్‌లో కేటాయించడం కుదరదు. మరోవైపు పెద్ద యూనివర్సిటీలకు బడ్జెట్‌లో వర్సిటీ స్థాయి బట్టి నిధులు మంజూరు అవుతున్నాయి. బడ్జెట్‌లో వర్సిటీకి అరకొర నిధులతో ప్రభుత్వం సరిపెడుతోంది. ప్రస్తుతం మంజూరు చేసిన ప్రత్యేక నిధులు సైతం అందజేయలేదు. అసలు ఈ నిధులు మంజూరు అవుతాయా? లేదా? అన్న అంశం సైతం ప్రశ్నార్థకంగా మారింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం: ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో వర్సిటీకి అందజేశారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖకు వర్సిటీ ప్రత్యేక నిధులు అప్పగించారు. ఇంజినీరింగ్ అధికారులు సైతం వర్సిటీకి వచ్చి నిర్మాణాలకు అనువైన స్థలాలు, అంచనాలు పరిశీలించారు. ఈ వర్సిటీ సీనియర్ వర్సిటీలతో పోటీ పడాలంటే ప్రత్యేక నిధులు తప్పని సరి. లేదంటే ప్రగతి సాధ్యం కాదు. వర్సిటీలో కొత్త కోర్సులు, అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, ఎగ్జామినేషన్ విభాగాలు బలోపేతం కావాలంటే ప్రత్యేక నిధుల మంజూరు కీలకం. నిధుల కోసం అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాం. ---ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ