సాక్షి, శ్రీకాకుళం: తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తమ అవసరాల కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు కోసం యాచించాల్సిన అవసరం లేని వ్యవస్థను ప్రభుత్వంలో ప్రవేశపెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు సుపరిపాలనలో భాగమన్నారు. గతంలో రైతులు వ్యవసాయ ఇన్ పుట్స్ కోసం ధర్నాలు, ఆందోళనలు చేసేవారని, ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చిందన్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్‌లకోసం మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఇంటికే వచ్చే ఏర్పాటు విజయవంతంగా అమలు అవుతోన్నదన్నారు. ఇదే సుపరిపాలన అంటేనని తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి జరగడం లేదన్న వాదన సరికాదన్నారు.
విశాఖలో అదానీ డేటా సెంటరు, భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మచిలీపట్నంలో పోర్టులు వంటి వి అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్దానం లో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవతా థృక్పధానికి నిదర్శనమని కొనియాడారు. శ్రీ శ్రీ, గురజాడ, గరిమెళ్ళ, వంగపండు, వంటి ఉత్తరాంధ్ర కవులను, వ్యావహారిక భాషా వేత్త గిడుగు రామ్మూర్తిని, కాళీపట్నం రామారావును ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. తమ ప్రసంగంలో ఆద్యంతం సుపరిపాలన పై విద్యార్థులు ప్రతి స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. నిమ్మ వెంకట రావు మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశ పెట్టిన “నవరత్నాల” పథకంలో మహాత్మా గాంధీ, జ్యోతిబా ఫూలే, ఆర్ధిక వేత్త అమర్త్య సేన్ ల సిద్ధాంతాలు యిమిడి వున్నాయన్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు వారి ఇంటివద్దనే, ఒకటో తేదీనే అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వారికి పేదలు, నిస్సహయుల పట్ల వున్న అనుకూల ధృక్పధాన్ని మనం తెలుసు కోవచ్చన్నారు.
చదవండి: అమ్ముడుపోను.. చావుకు భయపడను: పోసాని
విద్యకు వృత్తి పరమైన నైపుణ్యాన్నిజోడించడంద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచిందన్నారు. ఆర్ధిక పరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్నిఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లితండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకుప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోగంగా, ఉపయుక్తంగా వుండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.
సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటి రిటైర్డ్ వీసీ వి.బాల మోహన్‌దాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రి కి మించిన తనయుడు సీఎం జగన్ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీయ విద్యా దీవెనలకు సంబంధించి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అవర్ స్టేట్ అవర్ లీడర్ వైఎస్సార్ ఇంటలెక్చరర్ ఫోరమ్ చైర్మన్ జి. శాంతమూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ బి.అర్ధయ్య, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయభాస్కర్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. రాజేష్, సి.హెచ్. కృష్ణారావు, డా. సి.హెచ్. రాజశేఖర్, ఇ. కామరాజు, పొన్నాల వెంకట లక్ష్మణరావు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment