సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం పేదలు-పెత్తందార్ల మధ్య జరుగుతోన్న యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి పేదల పక్షాన నిలిచారని సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సత్యనారాయణపురంలో శుక్రవారం నిర్వహించిన “జగనన్న బడుగు వికాసం” అవగాహన సదస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ(సి) ఎంటర్ ప్రెన్యుర్‌లనుద్దేశించి ఆయన మాట్లాడారు. పేదల పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ఇలాంటి ముఖ్యమంత్రిని తమ 46 ఏళ్ల జర్నలిస్టు అనుభవంలో మొట్ట మొదటి సారి చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పేదల కోసం చెప్పింది చెప్పినట్లు చేస్తున్న ఈ ముఖ్యమంత్రిపై యుద్ధం చేయలేని కొంతమంది “వలంటీర్ల” పై యుద్ధం చేస్తుండడం విచారకరమని ఆయన అన్నారు. ఎండలో, వానలో ఇబ్బందులు పడుతూ పెన్షన్‌లు తెచ్చుకునే వృద్ధులకు ఇంటివద్దే, ఒకటోతేదీన పెన్షన్‌లు సమర్ధవంతంగా అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను కించ పరచడం సరికాదన్నారు.
నేనూ సమాజంలో ప్రయోజనకారిగా వుండే వ్యక్తిని అని ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో ముందుకెళ్ళాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ(సి) ఎంటర్ ప్రెన్యుర్‌లకు ఉద్బోధించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వయంశక్తితో పది మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్
సామాజిక న్యాయం, సాధికారిత రాష్ట్ర సలహాదారు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నవాళ్లే అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ రాష్టంలో 2 లక్షల 25 వేల కోట్లు పేదలకు పంపిణీ అయ్యిందని, అందులో 80 శాతం మేర నిధులు ఎస్.సి.ఎస్.టి వర్గాలకే అందిందని ఆయన గుర్తుచేశారు.
ఇది పేదల ప్రభుత్వమని చెప్పేందుకు ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 54 వేల ఎకరాల అసైన్డు భూములపై పేదలకు, దళితులకు సంపూర్ణ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇదని ఆయన ప్రస్తుతించారు.
గత 70 ఏళ్లుగా తమ పేరున ఉన్న భూములపై పూర్తి హక్కులు ఈ వర్గాలకు లేవని, దళితుల, పేదల జీవితాలలో ఈ చర్య ద్వారా సీఎం జగన్ పెను మార్పులకు దోహద పడ్డారని ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తాన్ని కలిపే ఇంగ్లీషు భాష ప్రాథమిక విద్యలో ప్రవేశపెట్టిన సాహసి మన ముఖ్య మంత్రి అని ఆయన అన్నారు. దళితుల పిల్లలను ఇంగ్లీషు లో చదివించే విప్లవాత్మక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రిని విమర్శించడం సరికాదన్నారు.
సమావేశానికి క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ బందెల దయానందం అధ్యక్షత వహించారు. సమావేశంలో సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, సెంట్రల్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎస్. సూర్యనారాయణ మూర్తి, పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.వి. పటేల్ , జాయింట్ డైరెక్టర్ ఏ. సుధాకర్, క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ ఎం.డి. ఏ. శేఖర్, ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి వై. అశోక్ , ఎన్. హెచ్. ఆర్. ఏ. సి.సి. చైర్మన్ ఆర్.జె. రాజు, ఏ.ఎస్.ఎస్.ఎన్.టి. డైరెక్టర్ ఎన్. వెంకటరావు, వివిధ జిల్లాలనుంచి వచ్చిన ఎస్.సి. ఎస్.టి. ఎంటర్ ప్రెన్యూర్ లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment