అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి నేతృత్వం
సభ్యులుగా ఓయూ, ఎంజీయూ వైఎస్ చాన్స్‌లర్లు
బోధనా సిబ్బంది నియామకంపై సిఫారసులు చేయనున్న కమిటీ
సీఏఎస్, ప్రమోషన్లు తదితర అంశాలపైనా అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు సిఫారసు చేసేందుకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యింది. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సభ్యులుగా ఉంటారు. మరో ఇద్దరు సభ్యులను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. నియామకాలకు సంబంధించిన సూచనలతో పాటు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్), ప్రమోషన్లకు సంబంధించిన అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సైతం ఈ కమిటీ పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అన్నీ పరిశీలించాకే..
యూనివర్సిటీల్లో దాదాపు 3 వేల బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా గతంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని వర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే దీని స్థానంలో కాలేజ్ సరీ్వస్ కమిషన్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాలన్నీ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత నియామకాలు చేపట్టాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలికి విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. వీసీల సమావేశం వివరాలను మండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి మీడియాకు వివరించారు.
ర్యాంకింగ్‌లపైనా కమిటీ!
యూనివర్సిటీల స్థితిగతులు, నాణ్యత ప్రమాణాలు, అనుబంధ గుర్తింపు విధానాలపై వీసీల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. తమ వర్సిటీల పరిధిలో సమస్యలను వీసీలు సమావేశంలో లేవనెత్తారు. జాతీయస్థాయిలో ర్యాంకులు పడిపోవడానికి కారణాలు, వీటిని ఏ విధంగా మెరుగుపర్చాలనే అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వర్సిటీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న నిధుల కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. పరిశ్రమల నుంచి సామాజిక బాధ్యత కార్యక్రమం కింద, పార్లమెంట్ సభ్యుల ప్రాంతీయ అభివృద్ధి నిధుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.
సిలబస్ మార్పుపై కసరత్తు పూర్తి
కొన్ని నెలలుగా ఉన్నత విద్యా మండలి చేపట్టిన పలు కార్యక్రమాలను వీసీలకు బాలకిష్టారెడ్డి వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా సిలబస్‌లో గణనీయ మార్పు తెస్తున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలిపారు. మార్కెట్ డిమాండ్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్ ఉండబోతుందని వివరించారు.
న్యూస్ లెటర్ విడుదల
మండలి నేతృత్వంలో రూపొందిస్తున్న న్యూస్ లెటర్‌ను విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. మండలి నేతృత్వంలో రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల్లో పురోగతిని ఇందులో వివరించారు. సమావేశంలో ఘంటా చక్రపాణితో పాటు పలు వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment