సాక్షి, బెంగళూరు : నిధుల కొరత వల్ల పలు ప్రభుత్వ విభాగాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుంటాయి... లేదా నిలిచిపోతుంటాయి. అయితే రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ విభాగం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఏటా వేలాది కోట్లాది రూపాయలు విడుదలవుతున్నా.. అందులో సగానికి సగం కూడా నేతలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కావడం లేదు. దీంతో రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
రాష్ట్రంలో ‘సువర్ణ గ్రామోదయ’ పథకం కింద ప్రతి ఏడాదికి కొన్ని గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. ఆ గ్రామానికి ఏడాది నుంచి మూడేళ్లలోపు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి.. అక్కడి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 2007 అక్టోబర్ 2 ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 5,543 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకుంది. వాటిల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.2,422 కోట్లను విడుదల చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యం, స్థానిక రాజకీయ పరిస్థితులు... కారణాలేవైనా ఇందులో కేవలం రూ.1,704 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో కేవలం 40 శాతం వాటిల్లోనే అన్ని పనులు పూర్తయ్యాయి. మిగిలిన 60 శాతం గ్రామాల్లో ఇంకా పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి.
నీటి ఎద్దడి నిధులూ అంతే..
రాష్ట్రంలో మూడేళ్లగా ఏర్పడిన వర్షాభావం వల్ల చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దటి తీవ్రరూపం దాల్చింది. ఈ సమయంలో తాత్కాలిక, శాశ్వత తాగునీటి సరఫరా పథకాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.2,100.56 కోట్లను విడుదల చేయగాా.. అందులోనూ రూ. 1,406.05 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మిగిలిన సొమ్ము ఇప్పటికీ ఖజానాలో అలాగే ఉండిపోయింది. నిర్ధిష్ట కాల వ్యవధిలోపు నిధులను ఖర్చు చేయక పోవడంతో తిరిగి ఆ సొమ్ము కేంద్రానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ స్వయానా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ విషయమై ఆ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... ‘నిధులు ఖర్చుకాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ అనిశ్చితి కూడా కారణం. ప్రభుత్వానికి మరోసారి విన్నవించుకుని నిధులను పూర్తి స్థాయిలో ఖర్చుచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం.’ అని పేర్కొన్నారు.
మురిగిపోతున్న సంక్షేమం
Published Mon, Sep 2 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement