గ్రామసభే సుప్రీం  | Gram sabhas are crucial in rural development | Sakshi
Sakshi News home page

గ్రామసభే సుప్రీం 

Published Mon, Feb 11 2019 4:04 AM | Last Updated on Mon, Feb 11 2019 5:32 AM

Gram sabhas are crucial in rural development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణాభివృద్ధిలో గ్రామసభలు కీలకం కానున్నాయి. గతంలో కంటే భిన్నంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో గ్రామసభలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పారిశుధ్యం మొదలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, గ్రామ సమస్యలతో పాటు వివిధ అంశాలపై గ్రామసభల్లో తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. పల్లెల్లోని ప్రజల ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక వనరుల పరిరక్షణ, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తినపుడు వాటిని పరిష్కరించే అధికారం గ్రామసభకు ఉంటుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల ఆమోదం, సామాజిక,ఆర్థిక, అభివృద్ధి కోసం ప్రణాళికలు,కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేందుకు ముందస్తుగా గ్రామసభల అనుమతి పొందేలా చట్టంలో పొందుపరిచారు.

వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక, పేదరిక నిర్మూలన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికకు గ్రామసభే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వివిధ కార్యక్రమాల కోసం కేటాయించిన నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు (యూసీ), వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టు పరిమాణాలు, గ్రామస్థాయిలో వ్యయం చేసిన నిధులకు సంబంధించిన యూసీలను గ్రామసభల ద్వారానే పొందాల్సి ఉంటుంది. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం,షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టు అమలుకు భూమి స్వాధీనం లేదా సంబంధిత ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించాల్సి వచ్చినా ముందుగా గ్రామసభ లేదా తగినపద్ధతుల్లో గ్రామపంచాయతీని తప్పనిసరిగా సంప్రదించేలా నూతనచట్టంలో ఏర్పాట్లు చేశారు.

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని చిన్నతరహా నీటివనరుల నిర్వహణ ప్రణాళికలకు, చిన్న తరహా ఖనిజాల తవ్వకాలకు గనుల లైసెన్స్‌లు లేదా లీజుకు ఇచ్చేందుకు గ్రామసభ లేదా సరైన స్థాయిలోని పంచాయతీ సిఫార్సులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండునెలలకు ఒకసారి గ్రామసభ జరిగేలా, ఏడాదిలో మొత్తం ఆరు సభల్లో రెండింటిని మహిళలు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదైన వారందరూ సభ్యులుగా గ్రామసభకు హాజరుకావొచ్చు.  

గ్రామసభలు సమీక్షించే అంశాలు
పారిశుధ్యం కాపాడే చర్యలు.. ఘన,ద్రవరూప వ్యర్థాల నిర్వహణ, చెత్తా,చెదారాన్ని ఎరువుగామార్చడం వీధిదీపాల నిర్వహణ, గ్రామపంచాయతీలో వివిధ పథకాల కింద చెట్లునాటడం, వాటి నిర్వహణ కుటుంబ సంక్షేమం విద్య, ప్రజారోగ్యం, బాలకార్మికుల నిర్వహణ అంతర్గతరోడ్లు, వంతెనలు, కాల్వల నిర్వహణ పబ్లిక్‌ ప్రదేశాలు, కమ్యూనిటీహాళ్లు, పార్కుల వంటి సామాజిక ఆస్తుల నిర్వహణ సంతలు, పండుగలు, క్రీడలు, ఆటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం గ్రామపంచాయతీ అమలుచేసే పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు రూపొందించి,ప్రాధాన్యతల నిర్ధారణ.

సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసే బాధ్యత పంచాయతీల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య మతసామరస్యం, సఖ్యత పెంపొందించేందుకు, స్థానిక ప్రజల మధ్య స్నేహసంబంధాలు అభివృద్ధి చెందేందుకు కళలు, క్రీడా సంబరాల నిర్వహణ పింఛన్లతో పాటు వివిధరకాల సంక్షేమ సహాయాలను ప్రభుత్వం నుంచి పొందేందుకు వ్యక్తుల స్క్రీనింగ్‌ వయోజన విద్య ప్రోత్సాహం, పబ్లిక్‌ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ బడ్జెట్‌ సంబంధ ఏర్పాట్లు, ఖర్చు చేసే ప్రణాళిక వివరాలు, అంశాల వారీగా నిధుల కేటాయింపు వివరాలు, పంచాయతీ ప్రాంతంలో చేసిన లేదా చేయబోయే పనులకు సంబంధించి సామగ్రి ఖర్చుల గురించి తెలుసుకునే హక్కు గ్రామసభకు ఉంటుంది.  

షెడ్యూల్డ్‌ ప్రాంత పంచాయతీల్లో... 
షెడ్యూల్డ్‌ ప్రాంత పంచాయతీలు/ గ్రామసభలకు మత్తు పదార్థాల వినియోగంపై నిషేధం లేదా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగంపై నియంత్రణ లేదా క్రమబద్ధీకరించే అధికారాన్ని కొత్త పంచాయతీరాజ్‌ చట్టం కల్పించింది. చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్యహక్కులు, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో భూమి అన్యాక్రాంతం కాకుండా చూసే అధికారం, చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కూడా కట్టబెట్టింది. గ్రామీణ మార్కెట్‌ (సంత) నిర్వహణ అధికారం, గిరిజన ప్రజలకు రుణం ఇస్తున్న సంస్థలు, వ్యక్తులపై నియంత్రణ అధికారాన్ని కూడా నూతన చట్టం కల్పించింది.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement