ఆస్తిపన్ను పెంపు?
ఆదాయం పెంచేందుకు బహుళ అంతస్తుల మదింపు
సిద్ధమవుతున్న గ్రేటర్ అధికారులు
సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఆదాయమార్గాలపై దృష్టిసారించిన ప్రభుత్వం...ఇందుకు ఆస్తిపన్ను పెంపుదల, వాణిజ్య భవనాల రీ అసెస్‌మెంట్‌ను ఓ మార్గంగా భావిస్తోంది. పన్ను పెంపుదల జరగకముందే నగరంలోని పలు వాణిజ్య భవనాల రీ అసెస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
నగరంలో పలుచోట్ల ఎక్కువ విస్తీర్ణంలోని భవనాలకు తక్కువ విస్తీర్ణం చూపుతూ తక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాత్ర సైతం ఉందనే ఆరోపణలున్నాయి. మరోవైపు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, నివాస కేటగిరిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలు సైతం గణనీయంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ భవనాలు, బహుళ అంతస్తుల భవనాలను మరోమారు అసెస్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.