వాహన చోదకులకు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : నిధుల కొరతతో ఏళ్ల తరబడి జిల్లాలోని ప్రధాన రహదారులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రధాన రహదారులను కలిపే సింగిల్‌రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకైన వంతెనలు, శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టులు పెరిగిన వాహన రద్దీకి అనుగుణంగా లేవు. గతంలో పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలు రోడ్ల విస్తరణ, మరమ్మతుల కోసం అరకొరగా నిధులు సాధించుకున్నారు.
దీంతో జిల్లాలో చాలా చోట్ల గుంతలు తేలిన రోడ్డపై వాహనదారులు సర్కస్ ఫీట్లతో ప్రయాణం చేస్తున్నారు. రోడ్ల విస్తరణ, మరమ్మతుల కోసం ప్రస్తుతం రూ.వేయి కోట్లతో ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు పంపడంతో జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. జిల్లాలో డబుల్‌రోడ్డు లేని 31మండల కేంద్రాలకు రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు రహదారులు, భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
376.76 కిలోమీటర్ల మేర సింగిల్ లేన్ రహదారులను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు రూ.452.90 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సిద్ధం చేశారు. వీటితో పాటుగా జిల్లా మీదుగా వెళ్లే రాష్ట్ర, జాతీయ రహదారులను కలుపుతూ వెళ్లే 25 సింగిల్ రోడ్లను కూడా డబుల్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించారు. వీటితో పాటు పలు రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ఇరుకైన వంతెనలను విస్తరించడం, శిథిలావస్తకు చేరిన వంతెనలు, కల్వర్టులను తిరిగి నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రధాన అంతర్గత రోడ్ల విస్తరణకు రూ.524.91 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. జిల్లాలో రోడ్ల విస్తరణ, మరమ్మతులకు సుమారు రెండేళ్లుగా నిధులు విడుదల కావడం లేదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే గతంలో తమ నియోజకవర్గ పరిధిలోని రోడ్లను మెరుగు పరిచేందుకు కొంత మేర నిధులు సాధించగలిగారు. తాజా ప్రతిపాదనల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రోడ్లు అన్నింటినీ విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం విశేషం.
విడతల వారీగా నిధులు?
డబుల్ రోడ్లు, రాష్ట్ర హైవేలను కలుపుతూ సాగే 25 అంతర్గత సింగిల్ రోడ్లు 759.78 కిలోమీటర్లున్నట్లు గుర్తించారు. అయితే ప్రతిపాదనల్లో మాత్రం 378 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.524.91 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపించారు. మిగిలిన పనులను తర్వాత దశల్లో చేపట్టే అవకాశముందని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.
అధికారులు భారీగా అంచనాలు రూపొందించినా, ప్రభుత్వం వీటిలో ఎంతమేర నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే జిల్లాలోని రోడ్లు అద్దాన్ని తలపిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయనున్నాయి.
ప్రతిపాదనలకు ఆమోదం ఇలా!
జిల్లాలో వివిధ రహదారులను సింగిల్ లై న్ నుంచి డబుల్ లేన్లుగా మార్చేందుకు, ఇరుకు వంతెనల విస్తరణ, కల్వర్టుల పునర్నిర్మాణానికి జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలకు పాలనాపరమైన ఆమో దం లభించింది. ఈ మేరకు రాష్ట్ర రవా ణా, రోడ్లు, భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు పంపిన ప్రతిపాదనలకు యదాతథంగా ఆమోదం లభించినట్లు సమాచారం.
జిల్లాలో 31 మండలాలను జిల్లా కేంద్రంతో కలిపే సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు రూ.452.90 కోట్ల ప్రతిపాదనలకు యథాతథంగా ఆమోదం.
జిల్లాలో 46 హైలెవల్ వంతెనల నిర్మాణానికి రూ.3.18 కోట్లకు ఆమోదం.
ప్రధాన మార్గాల్లో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు 25 పనులకు 524.91 కోట్లకు ఆమోదం.
స్టేట్ హైవే కలిపే రహదారులకూ వర్తించాలని ప్రతిపాదనలు
హైదరాబాద్- బీజాపూర్ (స్టేట్ హైవే-04), మహబూబ్‌నగర్- చించోలి (స్టేట్ హైవే- 23), మరికల్-మినాస్‌పూర్ (స్టేట్ హైవే- 22)లను కలిపే తునికిమెట్ల- నారాయణపేట రోడ్డును సింగిల్ రోడ్డు నుంచి డబుల్ రోడ్డుగా మార్చాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదించారు.
మూడు స్టేట్ హైవేలను కలుపుతూ 67 కిలోమీటర్ల సాగే ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే కోస్గి, మద్దూరు, దామరగిద్ద, నారాయణపేట మండల కేంద్రాలకు రాకపోకలు సులభతరమవుతాయి. ఈ మార్గంలో ఉండే తునికిమెట్ల, నమ్దాపూర్, బాపల్లి తండా, హకీంపేట, సర్జగానిపేట, కోస్గి, గుండుమాల్, దోరెపల్లి, క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి తదితర గ్రామాల ప్రజల ఆర్థికాభివృద్ధికి కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
డబుల్ రోడ్ల విస్తరణ తీరిలా..
కేంద్రాలు పనులు పొడవు నిధులు
(కి.మీ) (కోట్లలో)
మండలాల రోడ్లు 39 376.762 452.90
ప్రధాన రోడ్లు 25 378.000 524.91
మొత్తం 64 754.762 977.81