
తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా జనవరిలో 1.6 శాతం పెరిగి 3,99,386 యూనిట్లకు చేరుకున్నాయి. జనవరి నెలలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి కారణం అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది.
‘2024 జనవరితో పోలిస్తే హోల్‌సేల్‌గా యూవీ(యుటిలిటీ వాహనాలు)ల విక్రయాలు గత నెలలో 6 శాతం అధికమై 2,12,995 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ కార్స్ అమ్మకాలు స్థిరంగా 1,27,065 యూనిట్లు నమోదయ్యాయి. వ్యాన్స్ 6.4 శాతం క్షీణించి 11,250 యూనిట్లకు పడిపోయాయి. మారుతీ సుజుకీ 4 శాతం వృద్ధితో 1,73,599 యూనిట్లు, హ్యుండై మోటార్ 5 శాతం తగ్గి 54,003, మహీంద్రా 17.6 శాతం దూసుకెళ్లి 50,659 యూనిట్లు దక్కించుకున్నాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 2.1 శాతం పెరిగి 15,26,218 యూనిట్లుగా ఉంది. మోటార్‌సైకిళ్లు 3.1 శాతం తగ్గి 9,36,145, స్కూటర్స్ 12.4 శాతం పెరిగి 5,48,201, మోపెడ్స్ స్వల్పంగా తగ్గి 41,872 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 7.7 శాతం ఎగిసి 58,167 యూనిట్లను తాకాయి’ అని వివరించింది.
ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బైటికి
టీవీఎస్ సప్లై చైన్‌లో మరింత వాటా
ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌లో అదనపు వాటా కొనుగోలు చేసింది. బీఎస్‌ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం 1.52 శాతం వాటాకు సమానమైన 67.10 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 107 కోట్లు వెచి్చంచింది. ఒక్కో షేరుకీ రూ. 159.42 సగటు ధరలో వీటిని కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తదుపరి టీవీఎస్ సప్లై చైన్‌లో టీవీఎస్ మోటార్ వాటా 2.39 శాతం నుంచి 3.91 శాతానికి బలపడింది.
Comments
Please login to add a commentAdd a comment