హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీలర్ల వద్ద ప్యాసింజర్ వాహన నిల్వలు పోగవడం సహజం. ప్రస్తుతం ఉన్న 80–85 రోజుల ఇన్వెంటరీ(గోదాముల్లో అమ్ముడవకుండా ఉన్న నిల్వలు) స్థాయి ఆందోళన కలిగిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) చెబుతోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 7.9 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాల నిల్వలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అవగతమవుతోంది.
డీలర్ల వద్ద పోగైన వాహనాల విలువ ఏకంగా రూ.79,000 కోట్లు అని ఎఫ్‌ఏడీఏ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 19 శాతం క్షీణించి 2,75,681 యూనిట్లకు వచ్చి చేరాయి. టూవీలర్స్ అమ్మకాలు 8 శాతం తగ్గి 12,04,259 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు స్వల్పంగా పెరిగి 1,06,524 యూనిట్లు నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 10 శాతం పడిపోయి 74,324 యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్లు 15 శాతం దూసుకెళ్లి 74,324 యూనిట్లను తాకాయి. ఇక అన్ని విభాగాల్లో కలిపి రిజిస్ట్రేషన్స్ 18,99,192 నుంచి 9 శాతం క్షీణించి 17,23,330 యూనిట్లకు పడిపోయాయి.
ఇది చివరి అవకాశం..
‘భారీ వర్షపాతం, మందగించిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. గణేష్ చతుర్థి, ఓనం వంటి పండుగలు ప్రారంభమైనప్పటికీ పరిశ్రమ పనితీరు చాలా వరకు నిలిచిపోయిందని డీలర్లు పేర్కొన్నారు’ అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. మరింత ఆలస్యం కాకముందే మార్కెట్ పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి తయారీ సంస్థలకు ఇది చివరి అవకాశం అని అన్నారు. అదనపు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా నిరోధించడానికి డీలర్ సమ్మతి, వాస్తవ పూచీకత్తు ఆధారంగా మాత్రమే కఠినమైన ఛానల్ ఫండింగ్ విధానాలను తప్పనిసరి చేస్తూ బ్యాంకులకు సలహా జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను ఫెడరేషన్ కోరిందన్నారు.
ఇదీ చదవండి: ‘పెయిడ్ ట్వీట్’ అంటూ వ్యాఖ్యలు
డీలర్లు, తయారీ సంస్థలు పండుగలకు ఎక్కువ అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో సానుకూల నగదు ప్రవాహం, మెరుగైన వ్యవసాయ పరిస్థితులు డిమాండ్‌ను పెంచుతాయని ఆశించినప్పటికీ ఆశించినమేర ఫలితం లేదని ఫెడరేషన్ తెలిపింది. అదనపు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి, 2024–25 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి సానుకూల వృద్ధి పథాన్ని నడపడానికి అక్టోబర్ నెల చాలా అవసరమని పేర్కొంది. ఊహించిన విక్రయాలు కార్యరూపం దాల్చకపోతే కొత్త సంవత్సరంలోకి వెళ్లే క్రమంలో డీలర్లతోపాటు తయారీ సంస్థలను కూడా కష్టతర పరిస్థితి ఎదురవుతుందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment