మౌలిక రంగానికి ‘పేమెంట్స్’ బూస్ట్!
- అందుబాటులోకి ఏటా రూ. 14 లక్షల కోట్ల నిధులు
- ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికలో అంచనా..
ముంబై: దేశంలో కొత్తగా ఏర్పాటుకానున్న పేమెంట్స్ బ్యాంకులు.. మౌలిక(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) రంగానికి చేదోడుగా నిలవనున్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్న ఇన్‌ఫ్రా రంగానికి ఏటా రూ.14 లక్షల కోట్ల మేర అందుబాటులోకి వచ్చేందుకు పేమెంట్స్ బ్యాంకులు వీలుకల్పించనున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో అంచనా వేసింది. ‘మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవల విస్తరణకు పేమెంట్స్ బ్యాంకులతో సాధ్యమవుతుంది. మరోపక్క, ఇవి సమీకరించే డిపాజిట్ నిధులను కేవలం ప్రభుత్వ బాండ్‌లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కారణంగా ఈ మొత్తమంతా ఇన్‌ఫ్రా రంగానికి నిధులందించేందుకు అందుబాటులోకి వస్తుంది.
మా అంచనాల ప్రకారం ఏటా ఈ విధంగా రూ.14 లక్షల కోట్ల అదనపు నిధులు లభ్యమయ్యే అవకాశం ఉంది. వివరంగా చూస్తే.. రోజువారీ అవసరాలకోసం ప్రజలు తమదగ్గరున్న డబ్బులో 13 శాతాన్ని క్యాష్ రూపంలోనే ఉంచుకుంటారు. ఈ మొత్తంలో 1 శాతం తగ్గినా.. డిపాజిట్ల రూపంలో అదనంగా రూ.15 లక్షల కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. ఇందులో 75 శాతాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులకు వీలుంది. అంటే రూ.11.25 లక్షల కోట్లు లభించినట్లే’ అని ’ అని నివేదిక తెలిపింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్‌టెల్ సహా మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్‌బీఐ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం రూ. లక్ష వరకూ ఇవి డిపాజిట్లను సమీకరించవచ్చు. దేశంలో ప్రస్తుతం ఉన్న చిన్న వాణిజ్య బ్యాంకుల సగటు డిపాజిట్ల పరిమాణం రూ. లక్ష కోట్లుగా ఉంది.
ఇందులో కనీసం నాలుగో వంతును డిపాజిట్లుగా సమీకరించగలిగితే... 11 పేమెంట్స్ బ్యాంకులు కలిపి ఏడాదిలో దాదాపు రూ.2.75 లక్షల కోట్లను సమకూర్చుకోగలవని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇక భారత్‌లో చెలామణీలో ఉన్న బ్యాంక్ నోట్లు, నాణేల విలువ కూడా చాలా అధికంగా ఉందని(జీడీపీలో 12 శాతం).. ఏవైనా చెల్లింపులకు క్యాష్‌ను వాడేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతుండటమే దీనికి కారణమని నివేదిక పేర్కొంది. పేమెంట్స్ బ్యాంకుల రాక, అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రభావంతో దేశంలోని మొత్తం మనీ సప్లైలో నగదు పరిమాణం భారీగా తగ్గి.. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. బ్రిటన్‌లో ఈ పరిమాణం 2 శాతం కాగా, ఆస్ట్రేలియాలో 3 శాతం, జపాన్‌లో 6 శాతంగా ఉంది.