జిల్లాలో 3,155 పాఠశాలలు
నేటికీ రాని యూనిఫాం
ఇండెంట్ పెట్టామంటున్న అధికారులు
గతేడాదీ పంపిణీ చేయని వైనం
268 పాఠశాలల్లో వంటషెడ్లు లేవు
నిధుల కొరతతో నిలిచిన మరమ్మతులు
ఎల్‌ఎన్‌పురంలో పశువుల పాకలా పాఠశాల
‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి
తాగునీటి కుండీలు ఉంటే నీరుండదు.. మరుగుదొడ్లు ఉన్నా అలంకారప్రాయమే.. వానొచ్చిందంటే ఆవరణంతా జలమయమే.. శిథిలావస్థకు చేరిన భవనాలు.. ఇదీ మరో మూడు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ప్రభుత్వ పాఠశాలల్లోని దుస్థితి. జిల్లాలో చిన్నారుల భవితకు బాటలు దిద్దే పాఠశాలలు అసౌకర్యాలకు నిలయాలుగా మారుతున్నా పట్టించుకునేవారే లేరు. మరోపక్క పలు పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేస్తుండటం ఆందోళనకరంగా మారింది.
మొగల్రాజపురం: స్థానిక రావిచెట్టు సెంటర్‌లోని తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ సుమారు 60 మంది చిన్నారులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నారు. కొండ ప్రాంతంలో నివశించే రోజువారి కూలీల పిల్లలు చదువుకోడానికి ఈ స్కూల్ దగ్గరలో ఉంది. ఈ స్కూల్‌లో కనీస సౌకర్యాలు లేవు. కూర్చునేందుకు చెంచీలు లేవు, తరగతి గది లేదు. ఆరుబయట రావిచెట్టు నీడన తాత్కలికంగా నిర్మించిన ప్లాస్టిక్ రేకుల షెడ్డులోనే నేలపై కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. స్కూల్ కోసం నిర్మించిన చిన్న పాటి గదులు వీరికి ఏమాత్రం సరిపోవడం లేదు. అందువల్ల పక్కనే ఉన్న ఖాళీస్థలంలో చెట్టుకింద గోడలు లేకుండా ప్లాస్టిక్ రేకులతో నిర్మించిన ఒక షెడ్డులో విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్షం వస్తే చాలా ఇబ్బంది. పుస్తకాలూ తడిసిపోతుంటాయి. ఎండ కాలంలో సెలవులు ఇచ్చే వరకు వేడిని భరించాల్సిందే.
వాటర్ ట్యాంకర్ రాకపోతే స్కూల్‌కు సెలవే
స్కూల్‌లో ఉన్న మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ వాసులకు మంచి నీటిని సరఫరా చేయడానికి వచ్చే ట్యాంకర్ నుంచి ప్లాస్టిక్ డ్రమ్ములోకి నీటిని పట్టుకుని నిల్వ చేసుకుని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. మరుగుదొడ్డిని ఉపయోగించాలంటే విద్యార్థులు బక్కెట్‌తో నీటిని తీసుకుని వెళ్లాల్సిందే. ఏ కారణం చేతనైనా ట్యాంకర్ రాకపోతే ఆ రోజు స్కూల్‌కు సెలవే. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం కోసం కార్పొరేషన్ అధికారులు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, విద్యుత్ మోటారు అమర్చలేదు. ట్యాంకర్ రాని రోజూ స్కూల్‌కు అనధికారికంగా సెలవు ప్రకటిస్తున్నారు.విద్యార్థులు లెట్రిన్‌కు వెళతామంటూ లైన్‌కట్టి అడగడంతో వారిని ఇళ్ళకు పంపేస్తున్నారు. స్కూల్ మరుగుదొడ్డిలో నీరు రాకపోతే ఇంటికి వెళ్లవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు వరసగా లెట్రిన్ అనడంతో వారిని ఇంటికి పంపక తప్పని పరిస్థితి.ఇలా పదులు సంఖ్యలో విద్యార్థులు అడగడం తో స్కూల్‌కు అనధికారికంగా సెలవు ప్రకటిస్తున్నారు.ఈ సమస్యతో ఉపాధ్యాయులూ ఇబ్బందులు పడుతున్నారు.
స్కూల్ ఆవరణలో ఉన్న కొద్ది పాటి స్థలంలో ప్రత్యేకంగా తరగతి గది నిర్మించాల్సిందిగా స్కూల్ సిబ్బంది కార్పొరేషన్ అధికారులకు విన్నవించుకోగా సుమారు రూ.4 లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న స్కూల్‌లో (రావిచెట్టు సెంటర్) కాకుండా సమీపంలోనే ఉన్న కార్పొరేషన్ పార్కు స్థలంలో స్కూల్ నిర్మిస్తే విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు వస్తాయని, అక్కడ నిర్మిచాల్సిందిగా పాఠశాల ఉపాధ్యాయులు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను కోరడంతో విషయం పెండింగ్‌లో పడింది. రోజులు గడుస్తున్నా ఏవిషయం తేలకపోవడంతో మంజూరైన నాలుగు లక్షల రుపాయల నిధులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెనక్కు పంపించేశారు. ఫలితంగా విద్యార్థులకు ఈఏడాది కూడా చెట్టు కింద చదువులు తప్పడం లేదు.
అరకొర వసతులతో పాఠశాలలు
కృష్ణలంక: స్థానిక పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు అరకొరగా ఉన్నాయి. ఈ స్కూల్ పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌కు ఒక్కటే మూత్రశాల ఉంది. సుమారు 400 మంది విద్యార్థులు ఉండే ఈ స్కూల్‌లో రెండు మూత్రశాలలు మాత్రమే ఉన్నాయి.
గతంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా మూత్రశాలలుండేవి. ఇక్కడ కళాశాల నిర్మాణ నేపథ్యం లో వాటిని తొలగించడంతో సమస్యగా ఉంది. ఎస్వీరెడ్డి స్కూల్‌లోమూత్రశాలలు పిల్లలకు, ఉపాధ్యాయులకు వేరుగా నిర్మించుకున్నారు. విద్యార్థుల మూత్రశాల దుర్వాసన వెదజల్లుతోంది. రాణిగారితోట తాడికొండ సుబ్బారావు స్కూల్, వంగవీటి మోహనరంగా ఎలిమెంటరీ స్కూల్‌లోనూ మూత్రశాలతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.
చెత్తతో నిండిన ప్రాంగణం
ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రపరిచ వారు లే రు. దీంతో చెట్ల ఆకులు రాలి ప్రాంగణమంతా అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో స్కూల్ తెరిచే సమయానికి విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మధ్యాహ్నం భోజనం పథకం
స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం విషయంలోనూ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించడంలేదు. వారికి ప్రత్యేకమైన షెడ్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా పలు స్కూళ్లల్లో షెడ్లు లేకపోవడంతో వేరేచోట వండి తరలిస్తున్నారు. ఈనేపథ్యంలో నిర్వాహకులు పిల్లలకు చాలీ చాలని భోజనం పెడుతున్నారు. ఇటీవల తాడికొండ సుబ్బారావు స్కూల్‌లో మేయర్ ఆకస్మిక తనిఖీల్లో ఇది బయటపడింది.