అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం పంపిణీపై అయోమయం నెలకొంది. క్లాత్ ఇస్తారా.. కుట్టించి ఇస్తారా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ప్రతిసారి స్కూళ్లకు క్లాత్ పంపిణీ చేసి అక్కడి నుంచి దర్జీల ద్వారా కుట్టించేవారు. అయితే ఈసారి అప్కో వారే కుట్టు బాధ్యతను తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఈ కారణంగానే క్లాత్ సరఫరా పెండింగ్ పడుతూ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెళ్లు గడిచినా ఇప్పటిదాకా అతీగతీ లేదు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్ కొనుగోలుకు పాఠశాలల వారీగా ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఇండెంట్ తెప్పించుకుని ప్రభుత్వానికి నివేదిక పంపారు.
జిల్లాలోని విద్యార్థుల క్లాత్ కొనుగోలుకు రూ.8,77,45,920 నిధులు అవసరం. ఇందులో రూ. 4,38,72,960 నేరుగా ఎస్పీడీ అధికారులే అప్కోకు అడ్వాన్స్‌గా చెల్లించారు. గతేడాది పంపిణీ చేసిన రంగు దుస్తులే ఈసారీ పంపిణీ చేయాలని ఎస్పీడీ కార్యాలయం నుంచి జిల్లాకు ఉత్తర్వులు అందాయి. రంగు వరకు స్పష్టత ఇచ్చారని అయితే క్లాత్ సరఫరా చేస్తారో, కుట్టించిన దుస్తులు సరఫరా చేస్తారా అనే విషయంలో ఎలాంటి సమాచారం లేదని అటు ఎస్‌ఎస్‌ఏ అధికారులు, ఇటు అప్కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ఎస్‌ఎస్‌ఏ పీఓ దశరథరామయ్యను సాక్షి వివరణ కోరగా రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు ఇప్పటి దాకా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. క్లాత్ సరఫరా కోసం ఇండెంట్ పంపామని మూడు రోజుల క్రితం రాష్ట్ర అధికారులు కూడా ఆరా తీశారన్నారు.
యూనిఫాంపై అయోమయం !
Published Tue, Sep 13 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
Advertisement
Advertisement