అడ్రస్ ఏదీ? | Uniform still not available | Sakshi
Sakshi News home page

అడ్రస్ ఏదీ?

Published Thu, Dec 17 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

Uniform still not available

నేటికీ అందని యూనిఫాం
విద్యార్థుల ఎదురుచూపులు
అధికార పార్టీ నేతల అడ్డంకులే కారణం

 
పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు యూనిఫాం అందజేస్తాం. ఇకపై ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం... (గతేడాది వేసవి సెలవులకు ముందు విద్యార్థులకు యూనిఫాం అందజేస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన ఇది.)
ప్రస్తుత పరిస్థితి : విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలవుతున్నా ఇంకా యూనిఫాంలు అందజేయలేదు. ఇప్పట్లో అందే పరిస్థితి కూడా కనిపించడంలేదు.
 
 విశాఖపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్వార్థం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాల విద్యార్థులకు ఏటా ఇచ్చే యూనిఫాం పంపిణీ మొక్కుబడి తంతే అవుతోంది. పాఠశాలలు తెరచుకుని ఆరు నెలలు పూర్తయినా అవి అందకపోవడంలో వీరి పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్కూళ్లలో చదివే వారిలో పేదలే అధికంగా ఉన్నందున ఒకటి నుంచి 8వ తరగతుల వారికి సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా  ఏటా ఉచితంగా రెండు యూనిఫాం ఇస్తోంది. ఈ సంవత్సరం జిల్లాలో 2,36,218 మంది పిల్లలకు రెండు జతల చొప్పున 4,72,436 యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి బడులు తెరిచిన కొద్దిరోజులకే వీటిని పంపిణీ చేయాలి. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వారికే కుట్టు పనులు దక్కించుకోవాలని పట్టుపట్టడంతో ఇన్నాళ్లూ యూనిఫాం ప్రక్రియ నిలిచిపోయింది.

పనిచేయని నేతల ఎత్తులు : గత ఏడాది ఇలా కొందరు ప్రజాప్రతినిధులు బల్క్‌గా తమ అనుయాయులకు చేజిక్కించుకున్నారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద ప్రభుత్వం రూ.40 చెల్లిస్తుంది. ఇందులో జతకు రూ.5 వరకు కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ సంవత్సరం కూడా అదే తీరులో వ్యవహారం నడపాలని చూశారు. అందుకు ఎన్నో ఎత్తుగడలు వేశారు. చివరకు నవంబర్ 28న సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ రాజకీయాలకు అతీతంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు అభీష్టం మేరకు టైలర్లకు ఇవ్వవచ్చని ఆదేశాలిచ్చారు. దీంతో యూనిఫాంపై కదలిక వచ్చి ఆప్కో వస్త్రాలను ఆయా స్కూళ్లకు పంపడం మొదలెట్టారు. ఇప్పటిదాకా 70 శాతం వస్త్రాల పంపిణీ జరిగింది. మిగిలింది పంపిణీకి కనీసం మరో 15 రోజులైనా పడుతుంది. యూనిఫాం అందజేయకపోవడంతో చాలామంది సివిల్ డ్రెస్‌తో రోజు స్కూలుకు వెళ్లి వస్తున్నారు.

సంక్రాంతి రద్దీలో దర్జీలు
సంక్రాంతి పండగ  సమీపిస్తున్నందున ప్రస్తుతం దర్జీలంతా రద్దీగా ఉన్నారు. దీంతో ఈ స్కూల్ యూనిఫాం కుట్టు మొదలెట్టడానికి మరో నెలరోజులకు పైగానే పట్టనుంది. అన్నీ సవ్యంగా జరిగితే వీటి కుట్టు పూర్తి కావడానికి, పంపిణీకి రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మార్చి నాటికి గాని బడి పిల్లలకు దుస్తుల అందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది కూడా వేసవి సెలవులకు ముందు వీటిని పంపిణీ చేశారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ సదస్సులో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచిన వెంటనే యూనిఫాంలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది!  

సత్వరమే అందేలా చూస్తా..
బడి పిల్లలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ సత్వరమే జరిగేలా చూస్తాం. అన్ని జిల్లాల్లోనూ దుస్తుల పంపిణీ ఆలస్యమవుతోంది. యూనిఫాంలకు అవసరమైన వస్త్రాలు కొన్నాళ్ల క్రితమే వచ్చాయి. చాలావరకు వాటిని ఆయా స్కూల్ మేనేజిమెంట్ కమిటీల (ఎస్‌ఎంసీల)కు పంపించేశాం. మిగిలినవి కూడా త్వరలోనే అందజేస్తాం.
 -టి.శివరామ్‌ప్రసాద్, పీవో, సర్వశిక్షా అభియాన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement