యూ‘నో’ఫాం
కడప ఎడ్యుకేషన్: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కష్టాలు తప్పడంలేదు. ఒకటి రెండు కాదు పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలుగా గడుస్తున్నా ఇప్పటికీ యూనిఫాం అందని దుస్థితి నెలకొంది. జిల్లాలోని 51 మండలాలకుగాను ఇప్పటి వరకు 26 మండలాలలోని విద్యార్థులకే యూనిఫాం దస్తులు అందాయి. మరో మూడు నెలలు గడిస్తే పాఠశాలకు సెలవులు కూడా వస్తాయి.
జిల్లా వ్యాప్తంగా సుమారు 3, 305 పాఠశాలల్లో 1 నుంచి 8 వతరగతి చదివే విద్యార్థులకు ఒకొక్కరికి రెండు జతలు చొప్పున యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. సంబంధిత యూనిఫాంను సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల మంది లబ్ధిపొందనున్నారు.
వారు కుట్టేదెప్పుడు.. విద్యార్థులు కట్టేదెన్నడు.
విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్‌ఎస్‌ఏ అధికారులు మెప్మాకు అప్పజె ప్పారు. జిల్లా వ్యాప్తంగా 38 మండలాలను వారికి కేటాయించారు. మిగతా 13 మండలాలను సంబంధించిన యూనిఫాంను కుట్టే బాధ్యతను బయటి వ్యక్తులకు అప్పగించారు. వారు మాత్రం ఇప్పటికీ 12 మండలాలకు సంబంధించిన దుస్తులను కుట్టి అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకా ఒక మండలానికి సంబంధించిన యూనిఫాం సిద్ధమవుతోందని తెలిపారు.
మరోవైపు మెప్మా వారు ఇప్పటికి 16 మండలాలలోని పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంను కుట్టి అందజేశారు. మిగతా 4 మండలాలకు సంబంధించిన దుస్తులను కుట్టి సిద్ధం చేయగా వాటికి ఇంకా కాజాలు, గుండీలను ఏర్పాటు చేసి అందజేయాల్సి ఉందని తెలిపారు. యూనిఫాంలకు సంబంధించిన విషయంలో ప్రతి సారీ ఇదే వరుస కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా విద్యార్థుల దుస్తుల విషయంలో మాత్రం పురోగతి కనిపించటం లేదు.
ఫిబ్రవరి 15లోపు.. అన్ని పాఠశాలలకు యూనిఫాంలను అందజేస్తాం. ఈ సారి బట్టరావటం కొంత ఆలస్యం అయింది. దీంతోపాటు మరికొన్ని కారణాల వల్ల తీవ్రజాప్యం జరిగింది. ఫిబ్రవరి 15 కంతా అన్ని పాఠశాలలకు అందజేస్తాం.
- గంగాధర్‌నాయక్, సీఎంఓ, సర్వశిక్ష అభియాన్.